తెల్లదొరలను మరిపిస్తున్న 'కళా'! మాజీ ఎంపీపీ ఆడియో వైరల్

By Ramana.Damara Singh Apr. 07, 2021, 02:45 pm IST
తెల్లదొరలను మరిపిస్తున్న 'కళా'! మాజీ ఎంపీపీ ఆడియో వైరల్

'మీ బంధువులకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా.. మీ తీరు నాటి బ్రిటీష్ దొరల నిరంకుశాన్ని మరిపిస్తోంది'.. అని ఓ మాజీ ఎంపీపీ భర్త, టీడీపీ సీనియర్ నేత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల ఆడియో శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నిరంతరం తన చర్యలను ప్రశ్నిస్తూ పక్కలో బల్లెంలా మారిన సదరు మాజీ ఎంపీపీ బాలబొమ్మ వెంకటేశ్వరరావును చిన్న సాకుతో కళా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పటికే తన వ్యవహార శైలితో ఎచ్చెర్ల నియోజకవర్గంలో పలువురు ముఖ్యనేతలను దూరం చేసుకున్న కళా తాజా చర్యలతో మరింతగా వ్యతిరేకతను పెంచుకుంటున్నారు.

సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టలేదని..

మాజీ ఎంపీపీ మహాలక్ష్మి భర్త బాలబొమ్మ వెంకటేశ్వరరావు స్వగ్రామమైన జి.సిగడాం మండలం సంతవురిటీ పంచాయతీ మొన్నటి ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పంచాయతీ అభివృద్ధికి రూ. 10 లక్షలు ఇస్తానని విశాఖలో బాగా స్థిరపడిన ఆ వర్గానికి చెందిన ఓ ప్రముఖుడు హామీ ఇవ్వడంతో గ్రామస్తులంతా కలిసి ఓ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే కళా వెంకట్రావు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని కావాలనే పోటీకి పెట్టలేదని ఆరోపిస్తూ.. బాలబొమ్మ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. కళా చర్యలపై బాలబొమ్మతో పాటు మండల టీడీపీ క్యాడర్ మండిపడుతోంది.

పార్టీ కోసం చేసిన త్యాగాలకు బహుమానమా?

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ఆస్తులు అమ్ముకొని సేవలు చేసిన కుటుంబంగా బాలబొమ్మ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వెంకటేశ్వరరావు తండ్రి ధర్మారావుకు 1989 ఎన్నికల్లో చీపురుపల్లి టికెట్టును అప్పటి పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ ఆఫర్ చేశారు. అయితే సొంత మండల ప్రజలకు దూరం కావడం ఇష్టం లేని ధర్మారావు ఆ అవకాశాన్ని గద్దె బాబూరావుకు ఇప్పించారు. అటువంటి కుటుంబానికి చెందిన నేతను సస్పెండ్ చేయడం.. వారి సేవలకు బహుమతా.. అని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అసలు తనను సస్పెండ్ చేసే అధికారం కళాకు ఎక్కడిదని వెంకటేశ్వరరావు బహిరంగ ఆడియో ద్వారా ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే ఆ అధికారం ఉందంటూ.. కళా నిర్ణయాన్ని సవాల్ చేశారు. భూస్వామ్య కుటుంబానికి చెందిన కళా నియంతృత్వ పోకడలను నిలదీశారు. మీ కుటుంబం, బంధువులకో రూలు.. ఇతరులకు ఇంకో రూలా అని ప్రశ్నించారు. మీవద్దకు వచ్చినవారు కిందనే కూర్చోవాలా.. చిరిగిన బట్టలే వేసుకోవాలా.. చేతికి ఉంగరాలు పెట్టుకోకూడదా.. బ్రిటీష్ దొరలను మించిపోతున్నారు.. అని ఏకిపారేశారు.

కళాపై పెరుగుతున్న వ్యతిరేకత

రాజాం నుంచి వచ్చి ఎచ్చెర్ల నియోజకవర్గంపై పెత్తనం చెలాయిస్తున్న కళాపై నానాటికీ పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి, సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు కళాకు వ్యతిరేకంగా పార్టీ వర్గాలను కూడగడుతున్నారు. ఇప్పుడు జి.సిగడాం మండల సీనియర్ నేత బాలబొమ్మ వెంకటేశ్వరరావు కూడా కళా తీరుపై కస్సుమంటున్నారు. తన సొంత మండలమైన రేగిడి, పక్కనే ఉన్న వంగర మండలాల్లో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులనే నిలబెట్టుకోలేకపోగా.. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అన్నీ వైఎస్సార్సీపీకి ఏకగ్రీవమై ఎంపీపీ వారి కైవసం కావడానికి కళా అసమర్థత కారణం కాదా.. అందుకు ఆయన్ను కూడా సస్పెండ్ చేయాలి కదా అని బాలబొమ్మ తదితరులు ప్రశ్నిస్తున్నారు. కళా సోదరుడి కుమారుడు బీజేపీ నేతలతో టచ్ లో ఉంటున్నారని.. మరి అతన్ని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని నిలదీస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp