వాసుపల్లి గణేష్ ఎందుకు జారిపోయారో గుర్తించలేని టీడీపీ

By Raju VS Sep. 23, 2020, 09:30 am IST
వాసుపల్లి గణేష్ ఎందుకు జారిపోయారో గుర్తించలేని టీడీపీ

వరుసగా ఒక్కో ఎమ్మెల్యే బాబుకి ఝలక్ ఇస్తుంటే టీడీపీ నేతలు కలవరపడుతున్నారు. చంద్రబాబు విధానాలను విమర్శిస్తూ, జగన్ ని కలుస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా విశాఖ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన, వెస్ట్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గోడదూకిన నేపథ్యంలో బాబు క్యాంప్ నుంచి వస్తున్న విమర్శలు దానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించి, పార్టీ కండువాలు కప్పి, ఏకంగా క్యాబినెట్ లో చోటు కల్పించిన చంద్రబాబు కూడా ఇప్పుడు విమర్శలకు పూనుకోవడం విస్మయకరమే. అయినా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన దారిలోనే టీడీపీ నేతలు కూడా తలోమాట మాట్లాడుతున్నారు.

ఇప్పటికే దేవినేని ఉమా నుంచి అనేక మంది నేతలు వాసుపల్లి గణేష్ మీద విమర్శలు చేశారు. వారంతా వల్లభనేని వంశీ, కరణం బలరాం విషయంలో పల్లెత్తుమాట కూడా మాట్లాడని విషయం గుర్తు చేసుకోవాలి. అంటే తమ సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఏం చేసినా పల్లెత్తుమాట అనుకుండా బీసీ నేత మీద విరుచుకుపడుతున్న తీరు గమనార్హం. అదే సమయంలో వాసుపల్లి గణేష్ కి రూ. 100కోట్ల తో బేరం కుదుర్చుకున్నారని టీడీపీ విమర్శించింది. ప్రలోభాలకు గురిచేసి గణేష్ ని టీడీపీకి దూరం చేశారని విమర్శించారు. పోనీ ఆ మాట మీద అయినా నిలబడ్డారా అంటే టీడీపీ నేతలు వెంటనే మాట మార్చేశారు. ఈ విషయంలో కూడా యూటర్న్ తీసుకుని చంద్రబాబు వారసత్వాన్ని నిలబెడుతున్నట్టు కనిపిస్తోంది.

తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలను కేసుల పేరుతో భయపెడుతున్నారని ఆరోపించారు. వాసుపల్లి గణేష్ అందుకే పార్టీని వీడారని వ్యాఖ్యానించారు. అంటే తనకు ముందు తన పార్టీకే చెందిన నేతలు చెప్పినట్టుగా వంద కోట్ల బేరం మాట వాస్తవం కాదని బుచ్చయ్య మాటల్లో తేటతెల్లమవుతోంది. కానీ వాసుపల్లి గణేష్ మీద కేసులు పెట్టారనే విమర్శ కూడా పొసగడం లేదు.ఇలాంటి వ్యాఖ్యలు ఏదోటి చేయడం ద్వారా తమ విధానాల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే యత్నంలో బాబు అండ్ కో ఉన్నట్టు కనిపిస్తోంది. రాజధాని విషయంలో గానీ, రాష్ట్రాభివృద్ధి అంశంలో గానీ బాబు మార్క్ రాజకీయాలకు కాలం చెల్లిందనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నట్టు అర్థమవుతోంది. కేవలం జగన్ ని విమర్శించడం ద్వారా మనుగడ సాధించాలనే ప్రయత్నం చెల్లదని గుర్తించకపోవడంతోనే టీడీపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే టీడీపీ నేతలు స్పష్టతకు వస్తే ఆపార్టీ కార్యకర్తలు మరింత క్రియాశీలకంగా ఉంటారు. లేదంటే రానురాను నిస్తేజంలో మునిగి పార్టీ కూడా పూర్తిగా మునిగిపోవడం ఖాయమని చెప్పకతప్పదు.

నిజానికి గణేష్ తన వైఖరిని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు ఆయన తనయుడి వల్ల ఏపీ ప్రజలకు గానీ, టీడీపీకి గానీ ప్రయోజనం ఉండదనే విషయాన్ని గుర్తించినట్టు సంకేతాలు ఇచ్చేశారు. జగన్ సమర్థత తనను ఆకట్టుకుందన్నారు. ఏపీ అభివృద్ది ఆయన వల్లనే సాధ్యమని చెప్పారు. కానీ టీడీపీ నేతలు మాత్రం అసలు విషయాన్ని వదిలేసి విన్యాసాలు చేస్తుండడంతో ఆ పార్టీని కాపాడే నాథుడు కష్టమేనని అంతా చెబుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp