తప్పించుకుందామనుకున్నా తప్పలేదు - దేవినేని

By Harinath.P Apr. 29, 2021, 02:26 pm IST
తప్పించుకుందామనుకున్నా తప్పలేదు - దేవినేని

సీఎం జగన్‌ మాటల మార్ఫింగ్‌ వీడియో కేసులో తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీ విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించి, దుష్ప్రచారం చేశారనే ఆరోపణతో వైకాపా లీగల్‌ సెల్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్‌.నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దేవినేని ఉమా మహేశ్వరరావుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

సీఐడీ కేసును కొట్టేయాలని ఉమా హైకోర్టు లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు సీఐడీ విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఉమా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై నోరు పారేసుకున్నారు. తనపై అక్రమ కేసులు నమోదు చేసి, నోరు నొక్కేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కరోనా విజృంభణలోనూ విచారణకు మినహాయింపు ఇవ్వలేదన్నారు. అయితే ఇప్పటికే విచారణకు రావాలని మూడు సార్లు సీఐడీ నోటీసులు ఇచ్చింది. వాటిని ఖాతరు చేయలేదు. అయితే ఈ నెల 20వ తేదీ ఉమా ఇంటికి సీఐడీ పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఆయన పరారయ్యారు.

ఉమాపై కేసు వివరాలు ఇవీ..!

ఈ నెల 7న ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ మాట్లాడినట్టు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈనెల 10న ఉమాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ.. 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు.

Also Read : ఏపీకి అదెలా సాధ్య‌మ‌వుతోంది..?

మార్ఫింగ్ వీడియోలోని మాటలు ఇలా..!

‘‘ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండి అంటే ఎవరూ రారు. ఏ వ్యక్తి కూడా ఒడిశాలో ఉండడానికో.. బీహార్లో ఉండడానికో.. తిరుపతిలో ఉండడానికో ఇష్టపడడు.. అంటూ గతంలో తిరుపతిని కించపరిచిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తిరుపతి పార్లమెంటులో ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది?’’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ మార్ఫింగ్‌ వీడియోతో ఉమా ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తప్పుడు బాటను ఉమా ఎంచుకున్నారు.

ఇప్పటికీ అవే మాటలు..

సీఐడీ విచారణకు వచ్చిన సమయంలో దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తనపై అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఆరోపించారు. అక్రమ కేసు అయితే సీఐడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఎందుకు యత్నించారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మూడు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకుండా.. సీఐడీ అధికారులు ఇంటికి వస్తే ఎందుకు పరారయ్యారనే ప్రశ్నకు దేవినేని రేపైనా సమాధానం చెప్పాల్సి వస్తుంది. తాను మార్పింగ్‌ చేయలేదంటూనే.. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ విచారణకు వచ్చానని చెప్పుకొచ్చారు. పైగా కోవిడ్‌ సమయంలో విచారణకు హాజరకావాల్సి వస్తోందంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.

Also Read : పరారీలో దేవినేని ఉమా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp