ఏ జాబు బూటకం బాబూ..?

By Aditya Sep. 17, 2021, 09:30 pm IST
ఏ జాబు బూటకం బాబూ..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్ బూటకమని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేస్తున్న విమర్శలు జనాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. సీఎం జగన్మోహనరెడ్డి తీరుతో రాష్ట్రంలో ప్రజలకు పనుల్లేవు.. యువతకు ఉద్యోగాలు లేవు అంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రజలను ముఖ్యంగా నిరుద్యోగ యువతను తప్పు దోవ పట్టించడమే.

తాము అధికారంలోకి వచ్చిన 2019 జూన్ నుంచి 2021జూన్ వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. అలాగే రాబోయే సంవత్సరం 2021-22లో భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను పేర్కొంటూ జాబ్ కేలండర్ను విడుదల చేసింది. ఆ ప్రకారంగా నెలనెలా శాఖల వారీగా నోటిఫికేషన్లను ఇస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇలా పారదర్శకంగా ఉంటే బూటకం అని చంద్రబాబు ఎలా అనగలుగుతున్నారో?

ఇవీ లెక్కలు..

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలో అంటే 2021 జూన్ వరకు 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇందులో1,84,264 రెగ్యులర్ కాగా, 19,701 కాంట్రాక్ట్, 3,99,791 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలోనే 2,59,565 గ్రామ/వార్డు వలంటీర్ పోస్టులు ఉన్నాయి. గత జూన్ లో 2021-22 జాబ్ కేలండర్ను ప్రభుత్వం విడుదల చేస్తూ 10,143 పోస్టుల వివరాలను ప్రకటించింది. ఏఏ నెలల్లో ఏఏ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నది తెలిపింది. పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా రాత పరీక్షల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఇచ్చిన మాట ప్రకారం..

పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. ఇందుకు రూ. 3,600 కోట్ల భారాన్ని భరించడానికి సిద్ద పడుతూ 51,387 మందిని రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చింది. అదే బాబు హయాంలో తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయమని ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు.

Also Read : టీటీడీ పాలకమండలి, టీడీపీ వాదనలో వాస్తవమెంత

ఉద్యోగ పక్షపాతిగా.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్యోగ పక్షపాతిగా పేరు తెచ్చుకుంది. 27 శాతం ఐఆర్ ఇచ్చి వారిని సంతోష పెట్టింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించి వారి అభిమానాన్ని చోరగొంది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ నిర్థారించింది. ఆ విధంగా వారి జీతాలను పెంచింది. ఇకముందు భర్తీ చేయబొయే ఉద్యోగాలకు గ్రూప్ -1, గ్రూప్ -2 సహా వేటికి ఇంటర్వ్యూలు నిర్వహించ బోమని విస్పష్టంగా ప్రకటించింది. కేవలం రాత పరీక్ష ద్వారా పోస్టులను భర్తీ చేయడం వల్ల ప్రతిభకు పటం కట్టవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్నయాన్ని తీసుకుంది.

బాబు వస్తే జాబులు వచ్చాయా?

బాబు వస్తే జాబు వస్తుందని 2014 ఎన్నికల ముందు టీడీపీ ఊరూ వాడా ఊదరగొట్టింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అలా ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి నెలనెలా రూ. 2 వేలు చెల్లిస్తామని నమ్మబలికింది. బాబు వచ్చారు, అయిదేళ్లు పాలించారు. కానీ ఉద్యోగాల భర్తీ మాత్రం జరగలేదు. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు నిరుద్యోగ భృతి తాను హామీ ఇచ్చినట్లు కాక కేవలం రూ. వేయి చొప్పున అదీ కొద్దిమందికే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పైగా తన హయాంలో పారిశ్రామిక సంమిట్ అని, ఉద్యోగ మేళా అని వందల కోట్లు ఈవెంట్స్ మేనేజ్మెంట్ సంస్థలకు చెల్లించి ఎక్కడా లేని హడావుడి చేశారు. అదిగదిగో లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయని ప్రచారం చేశారు. కానీ ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది లేదు.

ఇవన్నీ బహిరంగంగా అందరికీ తెలిసిందే. ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ఓ పద్దతిగా నిర్వహిస్తుంటే బూటకం ఎలా అవుతాయో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడే చెప్పాలి.

Also Read : విమర్శలు చేస్తే చర్యలుంటాయని హెచ్చరించే పరిస్థితి టీడీపీకి ఎందుకు వచ్చింది..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp