పోలీసులపై దుష్ప్రచారం వెనుక ఉన్న వ్యూహం ఏంటి..?

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పోలీసులపై ప్రతిపక్ష పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. అంతేకాకుండా పోలీసులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. స్వయానా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే మాట్లాడుతూ పోలీసులపై లేనిపోని కేసులు పెడితే దెబ్బకు దారికి వస్తారంటూ కార్యకర్తలను రెచ్చగొట్టే వీడియో వైరల్ కావడం తెలిసిందే. తాజాగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్వయంగా వీరు మాట్లాడుతుండడమే కాకుండా.. సోషల్, సొంత మీడియా ద్వారా విష ప్రచారం చేయిస్తున్నారు. చివరకు విగ్రహాల ధ్వంసానికి కూడా పోలీసులే కారణమని ప్రచారం చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటి వెనుక టీడీపీకి ప్రత్యేకమైన వ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు, అద్భుతమైన పనితీరులోనూ సత్తా చాటుతోంది అంటూ రాష్ట్ర పోలీస్ శాఖ ను కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రశంసించింది. అందుకు నిదర్శనం జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 108 అవార్డులను పొందడమే అని కొనియాడింది. వాస్తవానికి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రతిష్ఠ అంతకంతకూ పెరుగుతోంది. సీఎం జగన్ ప్రోత్సాహం.. ఉన్నతాధికారుల కృషితో ఎన్నడూ లేని ఫలితాలను సాధిస్తోంది. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)కు మిగతా మూల స్తంభాలైన కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్, తదితర విభాగాలతో కలసి బాధితులకు సత్వర న్యాయం అందేలా ఏపీ పోలీసులు కృషి చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని కేంద్ర హోం శాఖ కూడా అభినందించింది. ఐసీజేఎస్ అమలు, వినియోగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఏపీ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను ఏపీ పోలీసులు జాతీయ స్థాయిలో ‘స్కోచ్’ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తెలుగుదేశం నేతలు మాత్రం పోలీసులపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కాకుండా వైసీపీ ఎజెండా అమలు చేస్తున్నారంటూ తరుచూ విమర్శిస్తున్నారు. వారి విమర్శలకు పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు కౌంటర్ లు ఇస్తూనే ఉన్నారు.
కేసుల నుంచి తప్పించుకునేందుకేనా..?
తెలుగుదేశం హయాంలో ఆ పార్టీ నేతల అవినీతి, నేర సంబంధిత అంశాలు ఏడాదిన్నర కాలంగా వెలుగులోకి వస్తున్నాయి. అధికార మధంతో నాడు చేసిన తప్పులకు నేడు శిక్ష అనుభవిస్తున్నారు. పోలీసులు ఆధారాలతో సహా ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తూ కటకటాల్లోకి నెడుతున్నారు. దేవాలయాలపై దాడుల ఘటనల్లో కూడా పలు చోట్ల తెలుగుదేశం నేతల హస్తం ఉంది. ఆ విషయం కూడా పోలీసుల విచారణలో తేలింది. రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం వెనుక కూడా కొందరు టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు రుజువైంది. వీటితో పాటు దాడులు, హత్యలు తదితర కేసులకు సంబంధించి పలువురి తెలుగుదేశం నేతలను ఇటీవల అరెస్ట్ చేశారు. మరి కొందరిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే పోలీసులపై టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. అధినేత చంద్రబాబునాయుడి నుంచి చోటా మోటా నేతల వరకూ అదే పంథా అనుసరిస్తున్నారు.
చంద్రబాబు అయితే పోలీసులకు కులం, మతం ఆపాదిస్తూ చేసిన ప్రకటనలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసు సంక్షేమ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. గురువారం తాజాగా అచ్చెన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులకు బుర్ర లేదన్నారు. ప్రభుత్వం ఏం చెబితే అది కేసు రాయడం, అరెస్టు చేయడమే తెలుసునని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోవాలని, ఆలోచనతో పనిచేయాలని సూచించారు. వంటిపై వేసుకున్నది ఖాకీ డ్రస్ అని, వైసీపీ జండా కాదని తెలుసుకోవాలన్నారు. అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టే సమస్యలేదని, నాయకులు, అధికారులు ఎవరినైనా వదిలిపెట్టేది లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రిటైర్ అయినా, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. ఇవన్నీ పోలీసులను భయపెట్టి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భుజం తట్టాల్సింది పోయి...
ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుకు జాతీయస్థాయిలో అవార్డులు, ప్రశంసలు లభిస్తున్నాయి. కొవిడ్ కాలంలో వారు చూపుతున్న తెగువకు, ప్రజలకు అవగాహన కలిగిస్తున్న తీరుకు, మంచి చేసే వారిని ప్రోత్సహిస్తున్న వినూత్న చొరవకు ఏపీ పోలీసు శాఖ పేరొందింది. కరోనాతో పోరాటంలో ముందువరుసలో ఉంటూ మరోవైపు నేరాల కట్టడికి, త్వరితగతిన కేసుల పరిష్కారానికి విశేష కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భుజం తట్టి ప్రోత్సహించాల్సింది పోయి.. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం సమంజసం కాదని, అసత్య ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని డీజీపీ గౌతం సవాంగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర పోలీసులు ప్రజలకు విశేష సేవలందిస్తూ.. అన్ని వర్గాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తున్నారని ఆయన తెలిపారు.
పోలీసులను టార్గెట్ చేస్తే...
ఆలయాల్లో దాడులంటూ సోషల్ మీడియాలో సాగిన దుష్ప్రచారాలపై నిజాలు తెలియజేశామని డీఐజీ పాల్రాజు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులకు నిబద్ధత ఉండదని.. సామాజిక మధ్యమాల్లో దుష్ప్రచారంపై విచారణ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాలు ఆపదలో ఉన్నాయని దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ‘‘2020- 2021లో జరిగిన ఆలయాలపై దాడుల వివరాలు డీజీపీ ఇచ్చారు. 44 కేసుల్లో జరిగిన దాడుల్లో అసలేం జరిగిందో కూడా చెప్పాం. అబద్ధపు ప్రచారాలు కూడా ఎలా జరిగాయో తెలిపాం. కొన్ని కేసులలో ముద్దాయిలు రాజకీయ నేపథ్యం కూడా వెల్లడించాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రాసిన వార్తకు ఒక నిబద్ధత ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వార్తలకు నిబద్ధత ఉండదు. 2014లో ఏలూరులో జరిగిన ఘటనలో ఒక వ్యక్తిని అరెస్టు చేసి, శిక్ష వేశారు.
అదే ఘటనను మరల జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తమిళనాడు, కర్నాటకలో జరిగిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్టు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ ప్రచారం పట్ల విచారణ చేస్తున్నాం. పోలీసు వ్యవస్థను దిగజార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ప్రతి జిల్లాలో స్పెషన్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశాం. పోలీసులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని’’ డీఐజీ పాల్రాజు హెచ్చరించారు.


Click Here and join us to get our latest updates through WhatsApp