తరం మారింది.. తీరు మారింది.. మారాల్సింది అదొక్కటే..!

By Kotireddy Palukuri Oct. 17, 2020, 03:48 pm IST
తరం మారింది.. తీరు మారింది.. మారాల్సింది అదొక్కటే..!

ప్రతి ముప్పై ఏళ్లకు తరం మారుతుందంటారు. అన్ని రంగాల్లోనూ ఇది జరగడం షరామామూలే. తరం మారింది అన్న విషయం కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే కనిపిస్తుంది. అలాంటి ప్రత్యేకమైన సందర్భమే.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిన్నర క్రితం జరిగిన అధికార మార్పిడి. ఎన్నికల సమయంలో మాటలు కోటలు దాటించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలు గడప కూడా దాటని పరిస్థితి 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలు చూశారు. సీనియర్‌ కన్నా.. విశ్వసనీయత కలిగిన యువకుడు మేలని ఏపీ ప్రజలు నమ్మారని 2019 ఎన్నికలు చాటిచెప్పాయి.

తన మాటపై విశ్వాసంతో మద్దతుగా నిలిచిన ప్రజల ఆశలను 100 శాతం అమలు చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పని చేస్తున్నారు. ఎన్నికల హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేవలం 16 నెలల్లోనే ఏపీ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా పథకాలను అమలు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందింస్తున్నారు. జనాభాలో 50 శాతం కన్నా ఎక్కువ ఉన్న బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (బీసీ)లను నిన్న మొన్నటి వరకు ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్న తెలుగుదేశం పార్టీ.. నేడు ఆ వర్గాలు దూరం అవుతున్నాయనే భయం ఆ పార్టీలో మొదలైంది.

వైసీపీ ప్రభుత్వం బీసీలను.. బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాసెస్‌.. అంటూ వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. గడచిన 16 నెలల్లో తన ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ఏ ఏ పథకాల ద్వారా.. ఎంత మందికి.. ఎంత మొత్తం అందించామనే విషయాన్ని జగన్‌ సర్కార్‌ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ప్రజలకు తెలియజేసింది. 2.71 కోట్లకు పైగా బీసీ సామాజికవర్గ ప్రజలకు గడిచిన 16 నెలల్లో 21 పథకాల ద్వారా 33,424 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది.

యువ సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన తీరుతో తమకు ఇన్నాళ్లు ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు దూరం అవుతున్నారనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో మొదలైంది. అందుకే ప్రభుత్వంపై అర్థరహితమైన విమర్శలు చేస్తోంది. హత్యకేసులో బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాటలే టీడీపీ ఏ స్థాయిలో భయపడుతుందో తెలియజేస్తోంది. కొల్లు రవీంద్ర మూస పద్ధతిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీసీ అభివృద్ధి కాగితాలకే పరిమితమైందంటూ ఈ రోజు శనివారం మైకు అందుకున్నారు. రాష్ట్రంలో 2.50 కోట్ల మంది బీసీలు ఉంటే.. వైసీపీ ప్రభుత్వం 4.37 లక్షల మందికి మాత్రమే మేలు చేసిందన్నారు.

రాజకీయాల్లో తరం మారింది.. పాలకుడి తీరు మారిందన్న విషయం కొల్లు రవీంద్రకు ఇంకా అర్థం కానట్టుగా ఉంది. అందుకే నోటికొచ్చిన అంకెలతో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం గడిచిన 16 నెలల్లో 2.71 కోట్ల మంది బీసీ సామాజికవర్గ ప్రజలకు 33 వేల కోట్ల రూపాయలకుపైగా నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటన జగన్‌ పత్రికలో వస్తే.. టీడీపీ నేతలు నమ్మలేకపోవచ్చు. కానీ చంద్రబాబు భగవద్గీతగా భావించే ఈనాడు పత్రికతో సహా ఇతర పత్రికల్లోనూ వచ్చింది. ఈ గణాంకాలు కొల్లు రవీంద్ర చూడక.. 2.50 కోట్ల మంది బీసీలు ఉంటే... 4.37 లక్షల మందికే మేలు చేశారని చెప్పారా..? లేక ఆ గణాంకాలను విశ్వాసంలోకి తీసుకోలేదా..? తీసుకున్నా.. చెప్పేందుకు మనసు రాలేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

ప్రభుత్వం రాతపూర్వకంగా ప్రకటనల ద్వారా తెలియజేసిన గణాంకాలు ఒకసారి సరిచూసి.. ఇవన్నీ బోగస్‌ అని చెప్పే సాహసం కొల్లు రవీంద్ర చేస్తే టీడీపీకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. అంతేకానీ నొటికి తోచిన లెక్కలు చెబితే.. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందుతున్న ప్రజలు టీడీపీ గురించి గత ఎన్నికల కన్నా మరింత ఎక్కువగా ఆలోచించే ప్రమాదం లేకపోలేదు. తరం మారింది.. పాలనా తీరు మారింది.. తమ రాజకీయమే మారలేదన్న విషయం టీడీపీ నేతలు గుర్తించి నడిస్తే మనుగడలో ఉండే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp