తిరుపతి ఉప ఎన్నిక: టీడీపీ బంఫరాఫర్‌..!

By Karthik P Mar. 29, 2021, 07:00 pm IST
తిరుపతి ఉప ఎన్నిక: టీడీపీ బంఫరాఫర్‌..!

ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల.. నిజమని నమ్మిచ్చొచంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీకి కూడా ఇదే దారిలో నడుస్తోంది. తమ ఓటములకు కారణాలు వెదుకుతోంది. ఓటేయమని అడిగేందుకు ఎలాంటి కారణాలు దొరకకపోవడంతో.. ఓటమికి ముందే కారణాలను చెబుతోంది. పోలింగ్‌కు ముందే వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు సీరియస్‌గా చేస్తోంది.

వైసీపీకి ఓటు వేయకపోతే.. పథకాలు కట్‌ చేస్తామని ఆ పార్టీ నేతలు బెదిరించినట్లు, వాలంటీర్లు బెదిరిస్తున్నట్లుగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ తరహా విమర్శలు చేసిన టీడీపీ నేతలు.. తాజాగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ అదే పంథాలో నడుస్తున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటు వేయకపోతే పథకాలు కట్‌ చేస్తామని బెదిరించే వైసీపీ నేతలు, వలంటీర్ల సమాచారం అందించాలని టీడీపీ నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఫోన్‌ కాల్‌ రికార్డులు, ఫోటోలు, వీడియో రికార్డులు పంపాలంటూ 7557557744 నంబర్‌ను ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు ప్రకటించారు. ఆధారాలను ఈ వాట్సప్‌ నంబర్‌కు పంపాలని కోరుతున్న అచ్చెం నాయుడు.. అలా పంపిన వారి బ్యాంకు ఖాతాలో పది వేల రూపాయలు జమ చేస్తామంటూ బంఫరాఫర్‌ ప్రకటించారు.

అర్హతే ఆధారంగా పథకాలు ప్రజలకు అందించాలని సీఎం వైఎస్‌జగన్‌ ఆది నుంచి చెబుతున్నారు. అర్హతల్లోనూ చిన్న చిన్న కారణాలను చూపి పథకం వర్తించకుండా చేయొద్దంటూ అధికారులకు చెబుతున్నారు. పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఎవరైనా అర్హులు.. తమకు పథకం అందలేదనుకుంటే.. నెల రోజుల సమయం ఇచ్చి.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. అన్ని పథకాలకు ఈ సమయం ఇస్తున్నారు. ఇప్పటికే పలు పథకాలు రెండు విడతలు అమలయ్యాయి. వలంటీర్లు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం పథకాలు కట్‌ చేస్తామని బెదిరిస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు.

ఎన్నికల్లో ఏ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా.. కేంద్ర ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకోదు. అధికార పార్టీ అయినా.. ప్రతిపక్ష పార్టీ అయినా చర్యలు తప్పకుండా తీసుకుంటుంది. అయితే అందుకు తగిన ఆధారాలు ఉండాలి. ప్రజలు, పార్టీల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది. ఫోన్‌ నంబర్లు, మొబైల్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తుంది. టీడీపీ నేతలు తమ అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రస్తావించొచ్చు. ప్రజలను ఫిర్యాదు చేయాలని కోరవచ్చు. కానీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాదని.. తమకు ఆధారాలు పంపండి.. పది వేలు ఇస్తామంటూ చెప్పడం ఫలితం తర్వాత చెప్పుకునే కారణాన్ని ముందుగానే బలంగా సిద్ధం చేసుకోవడమే అవుతుంది.

Also Read : అచ్చెన్నాయుడు, రామ్మోహ‌న్ నాయుడు రిగ్గింగ్ తోనే గెలిచార‌ట‌!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp