వారిలో ప్రకంపనలు రేపుతున్న సునిల్‌ దేవ్‌ధర్‌ వ్యాఖ్యలు

By Kotireddy Palukuri Jul. 09, 2020, 10:53 am IST
వారిలో ప్రకంపనలు రేపుతున్న సునిల్‌ దేవ్‌ధర్‌ వ్యాఖ్యలు

అభివృద్ధిని అందరికీ అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ సర్కార్‌ మూడు రాజధానుల ప్రకటన చేసి దాదాపు ఏడు నెలలవుతోంది. మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధానిగా అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధానిగా ఉండాలంటూ సీఆర్‌డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళన మొదలెట్టారు. ప్రారంభంలో వారికి మద్ధతుగా తెలుగుదేశం పార్టీ ఆందోళనలు, నిరసనలు చేసింది. చంద్రబాబు జోలె పట్టి నాలుగు రోజులు హడావుడి చేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష కార్యచరణను పక్కపెట్టి తన అనుకూల మీడియాలో ఉద్యమం చేయిస్తున్నారు. చంద్రబాబు లేదా టీడీపీ అనుకూల మీడియాలో గడచిన ఏడు నెలలుగా అమరావతి ఉద్యమం వార్తలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.

ఇలా గ్రామాల్లో సాదాసీదాగా, టీడీపీ అనుకూల మీడియాలో మహోద్రంగా అమరావతి ఉద్యమం సాగుతున్న తరుణంలో బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి సునిల్‌ దేవ్‌ధర్‌ రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలు టీడీపీతోపాటు దాని అనుకూల మీడియాకు షాక్‌ ఇచ్చాయి. రైతులను ముందు పెట్టి ఉద్యమం నడిపిస్తున్న శక్తుల్లో రాష్ట్ర పరిధిలోని అంశం, కేంద్రం ఇప్పుడే కాదు భవిష్యత్‌లో కూడా జోక్యం చేసుకోబోదని సునిల్‌ దేవ్‌ధర్‌ చేసిన ప్రకటన ప్రకంపనలు రేపింది. దీంతో అనుకూల మీడియాలో అమరావతిపై తాజాగా చర్చలు, బీజేపీ ఎలా వ్యవహరించాలని, కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి, మోదీ ఇచ్చిన మట్టి, నీరు అంశాలపై చర్చ పెట్టాయి. యథావిధిగా టీడీపీ అనుకూల వాదులను చర్చల్లో మాట్లాడిస్తూ రాజధాని ఎంపిక అంశంపై సునిల్‌ దేవ్‌ధర్‌ చేసిన ప్రకటన నుంచి రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉద్యమం చేస్తున్న కొన్ని గ్రామాల రైతుల దృష్టి మరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

సునిల్‌ దేవ్‌ధర్‌ చేసిన ప్రకటననే మూడు నెలల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు కూడా చేశారు. అయితే ఆ సమయంలో జీవీఎల్‌పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించారు. జీవీఎల్‌.. వైసీపీ ఏజెంట్‌ అన్నారు. వైఎస్‌ జగన్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. జీవీఎల్‌పై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉందంటూ ప్రచారం సాగించారు. రాష్ట్ర రాజకీయాల్లో జీవీఎల్‌ను జోక్యం తగ్గించారని, జీవీఎల్‌ను కట్టడి చేశారంటూ వార్తలు రాశారు, ప్రసారం చేశారు. అయితే నాటు జీవీఎల్‌ చేసిన ప్రకటనే నేడు సునిల్‌ దేవ్‌ధర్‌ కూడా చేశారు. కానీ టీడీపీ, దాని అనుకూల మీడియా జీవీఎల్‌పై సాగించిన దుష్ప్రచారం, చేసిన విమర్శలు, ఆరోపణలు సునిల్‌ దేవ్‌ధర్‌పై మాత్రం చేయకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. కేంద్రం రాజధాని విషయంలో జోక్యం చేసుకుంటుందని చెబుతూ రైతుల్లో ఆశలు కల్పిస్తూ ఉద్యమం కొనసాగేలా చేసేందుకు బీజేపీలో ఉన్న నాటి టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు బీజేపీ నేతలు ఆదిలోనే అడ్డుకట్ట వేస్తుండడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp