"నీట్" ను రద్దు చేసిన తమిళనాడు

By Thati Ramesh Sep. 15, 2021, 08:15 am IST
"నీట్" ను రద్దు చేసిన తమిళనాడు

MBBS, BDS కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ ను తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మరోసారి వ్యతిరేకించింది. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడంతో మరోసారి ఈ జాతీయ అర్హత పరీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొన్ని గంటల్లో నీట్ జరుగుతుందనగా.. పరీక్షలో అర్హత సాధించలేననే భయంతో ఆ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసిం కేంద్రానికి పంపింది. అదే సమయంలో నీట్ తో సబంధం లేకుండా ఇంటర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించే బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినప్పటికీ అధికారపక్షం ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షం మద్దతు తెలిపగా బీజేపీ సభ్యులు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు.

సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కేలా ఉన్న నీట్ తమిళనాడు ప్రజలకు అవసరం లేదన్న స్టాలిన్.. నీట్ విధానంతో పేద, దళిత విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు’.‘మెడికల్ సీటు కోసం ప్రయత్నం చేస్తున్న తమిళ విద్యార్థుల ఆశలు, కలలను భగ్నం చేసేలా నీట్ ఉందన్నారు. పేద, గ్రామీణ, అట్టడుగు వర్గాల విద్యార్థులతో పాటు తమిళమీడియంలో చదివిన వారికి నీట్ బేస్డ్ అడ్మిషన్ విధానంతో తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, అదే సమయంలో సంపన్న వర్గాల పిల్లలకు మేలు చేసేలా ఉందని తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఓ హై లెవల్ కమిటీ పేర్కొన్నట్లు బిల్లులో తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. వైద్య విద్య అన్ని స్థాయిల్లో నీట్ ను తొలగించాల్సిన విషయాన్ని కమిటీ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం వివరించింది.’

మొదటి నుంచి వ్యతిరేకతే..

2013లో నీట్ ప్రారంభమైనప్పటి నుంచి తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూనే ఉంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ కూడా నీట్ ను వ్యతిరేకించాయి. స్టేట్ సిలబస్ చదివిన విద్యార్థులతో పాటు ఇంగ్లిష్ యేతర మాద్యమంలో చదివిన విద్యార్థులకు నష్టం జరిగే అవకాశమున్నందున నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించాయి. ప్రస్తుతం నీట్ ను వ్యతిరేకిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమే. నీట్ విధానం రాకముందు ఇంటర్ మార్కుల ఆధారంగా మెడికల్ సీట్లు కేటాయించే పద్ధతి తమిళనాడులో ఉండేది. కొన్ని పేరున్న కాలేజీలు మాత్రమే సొంతంగా ఎంట్రన్స్ లు నిర్వహించేవి. 2017 లో సుప్రీంకోర్టు నీట్ ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. నీట్ కు కట్టుబడి ఉండాలని ‘మేథస్సుపై రాజీ’ వద్దని సూచించింది. ఈ పరిస్థితిలో తమిళనాడు ప్రభుత్వం, ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా జాతీయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు పొందింది.

నీట్ కంటే ముందు పరిస్థితి..

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఒకే ప్రవేశ పరీక్షతో భర్తీ చేసేందుకే నీట్ విధానం అమలులోకి వచ్చింది. గతంలో ఎంబీబీఎస్, బీడీఎస్ లో చేరికకు రాష్ట్రాలు, కళాశాలలు పలు రకాల పరీక్షలు నిర్వహించేవి. నీట్ విధానానికి ముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా అర్హత పరీక్షలు నిర్వహించి, మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించేవి. మెడికల్ సీటు కోసం ఓ విద్యార్థి సుమారు 9 ఎంట్రన్స్ లు రాసేవారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడితో పాటు ఆర్థికభారం ఎక్కువగా ఉండేది. నీట్ తో సమయం, డబ్బు ఆదాతో పాటు విద్యార్థిపై ఒత్తిడి తగ్గిందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

2013లో ప్రారంభం..

గతంలో ఈ పరీక్షను ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అనే వారు. తర్వాత నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రన్స్ టెస్ట్ గా మార్చారు. 2013లో నీట్ ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమలు చేయగా..ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. 2016లో స్టే తొలగించిన సుప్రీంకోర్టు నీట్ నిర్వహణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. మొదట్లో ఈ పరీక్షను సీబీఎస్ఈ నిర్వహించగా ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహిస్తోంది. నియామక, ప్రవేశ పరీక్షల కోసం NTA ఏర్పాటైంది. 2019 నుంచి నీట్ ను పూర్తిస్థాయిలో NTA నిర్వహిస్తోంది.

NTA మొత్తం 16 దేశీయ స్థాయి పరీక్షలు నిర్వహిస్తుండగా, NEET మాత్రమే OMR ఫార్మట్ లో ఉంటుంది. NEET-UG ను ఇంగ్లిష్, హిందీ సహా 11 ప్రాంతీయ భాషల్లో రాయవచ్చు. దీంతో ప్రాంతీయ భాషల్లో చదివిన వారు కూడా ఈ ఎంట్రన్స్ రాయడం సులభమైంది. అయితే కొన్నిసార్లు ట్రాన్స్ లేషన్ లో తప్పులు దొర్లి, నవ్వుల పాలైన సందర్భాలు ఉన్నాయి. 2018లో నిర్వహించిన పరీక్షలో 49 ప్రశ్నలను తమిళంలో తప్పుగా అనువదించారని కోర్టును ఆశ్రయించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp