కేంద్రంపై స్టాలిన్ లేఖాస్త్రం ..  జగన్ సహా 9 మంది సీఎంలకు పిలుపు

By Ritwika Ram Jun. 23, 2021, 04:31 pm IST
కేంద్రంపై స్టాలిన్ లేఖాస్త్రం ..  జగన్ సహా 9 మంది సీఎంలకు పిలుపు

రాష్ట్రాల అభిప్రాయాలతో పని లేకుండా, ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఒక్కో నిర్ణయం తీసుకుపోతోంది కేంద్ర ప్రభుత్వం. మూడు వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, లక్ష్యదీప్ గొడవ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రోజుకొకటి చేసుకుంటూ పోతోంది. ఈ మధ్య కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రాలు కూడా ఒక్కటవుతున్నాయి. కలిసి కట్టుగా ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక అడుగు ముందున్నారు. వీలు చిక్కినప్పుడల్లా అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు లేఖలు రాస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2021 ముసాయిదాపై స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మైనర్‌ పోర్టుల విషయంలో రాష్ట్రాల ప్రాధాన్యతను ఈ బిల్లు తగ్గిస్తుందని చెబుతూ ఆయన వ్యతిరేకిస్తున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు ఇతర తీర ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖలు రాశారు. ఈ లిస్టులో మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటక, గోవా ముఖ్యమంత్రులు కూడా ఉండటం గమనార్హం.

స్టాలిన్ చెబుతున్నది ఏంటంటే?

చిన్న ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎంఎస్‌డీసీ) కు అప్పజెప్పేలా కేంద్రం ముసాయిదా బిల్లు తీసుకొచ్చింది. దీనిపై చర్చించేందుకు ఎంఎస్‌డీసీ ఈ నెల 24న రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయాలని, బిల్లును అడ్డుకోవాలని స్టాలిన్ కోరుతున్నారు. ప్రస్తుత ఇండియన్‌ పోర్ట్స్‌ యాక్ట్‌–1908 ప్రకారం మైనర్‌ పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ తదితరాలు రాష్ట్రాల అధీనంలోనే ఉన్నాయి. కొత్త చట్టం వస్తే అవన్నీ ఎంఎస్‌డీసీ కిందికి పోతాయి. దీంతో చిన్నతరహా ఓడరేవుల విషయంలో తీర ప్రాంత రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలుగుతుందని స్టాలిన్ వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర చట్టాన్నివ్యతిరేకించేందుకు పార్టీలకు అతీతంగా తీర ప్రాంత రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుతున్నారు.

Also Read : రాజకీయాలకు కిడారి శ్రావణ్ సెలవు!

గతంలోనూ లేఖలు రాసిన స్టాలిన్

స్టాలిన్ ఇప్పుడే కాదు.. గతంలో కూడా పలుమార్లు లేఖలు రాశారు. తన డిమాండ్లకు రాష్ట్రాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాలపై మారటోరియం ప్రకటించాలని కేంద్రాన్ని ఆయన కోరారు. దీనికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈనెల ప్రారంభంలో 12 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు.

10 రోజుల కిందట నేరుగా ప్రధానికే లెటర్ రాశారు. కావేరీ బేసిన్ లో హైడ్రోకార్బన్ వెలికితీత బిడ్డింగ్ ను వెంటనే ఆపేలా పెట్రోలియం, సహజ వనరుల శాఖను ఆదేశించాలని మోడీని కోరారు. కావేరి బేసిన్ రైతులకు ఈ ప్రాజెక్టు ముప్పుగా మారనుందని, ఆ ప్రాంత పర్యావరణ పరిరక్షణకు ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఎయిమ్స్ నిర్మాణం, నీట్ రద్దు తదితర అంశాలపైనా మోడీకి లేఖలు రాశారు.
గతేడాది కూడా తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ కు స్టాలిన్ లేఖలు రాశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రం నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తోందని, కేంద్రం తీరును నిరసిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్రాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.

వ్యాక్సినేషన్ తీరునే మార్చిన జగన్ లేఖ

కేంద్రం ఆధ్వర్యంలోని కరోనా వ్యాక్సినేషన్ తీరుపై ఇటీవల అందరు ముఖ్యమంత్రులకు జగన్ లేఖలు రాశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మొత్తం కేంద్రమే చేపట్టాలని కోరుదామంటూ పిలుపునిచ్చారు. టీకాలు వేయడాన్ని రాష్ట్రాల సమన్వయంతో పూర్తిగా కేంద్రమే నిర్వహించాలని, ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే మాట మీద నిలబడదామంటూ పిలుపునిచ్చారు. జగన్ తీసుకున్న చొరవకు అన్ని వైపుల నుంచి మద్దతు దక్కింది. ఆయన లెటర్ రాసిన కొన్నిరోజుల్లోనే.. దేశమంతటా, అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ రూపురేఖలే మారిపోయాయి. రోజుకు 40 లక్షల డోసులు కూడా వేయలేని స్థితి నుంచి 88 లక్షల డోసులు వేసే స్థాయికే పరిస్థితి మారింది.

Also Read : ఢిల్లీకి చేరిన పంజాబ్ పంచాయితీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp