అంతగా వ్యతిరేకత లేదు.. అనుకూలమూ లేదు..!

By Kalyan.S Apr. 08, 2021, 10:30 am IST
అంతగా వ్యతిరేకత లేదు.. అనుకూలమూ లేదు..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ రాష్ట్రంలో 6.29 కోట్ల ఓటర్లుండగా, 71.79 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఈసీ పేర్కొంది. మొత్తం 3,998 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఫలితాలు వచ్చే నెల 2 (కౌంటింగ్‌)న వెలువడనున్నాయి. అంటే పోలింగ్‌కు, ఫలితాలకు మధ్య 26 రోజుల సుదీర్ఘ గ్యాప్‌ ఉంది. ఇప్పుడు ఇదే అభ్యర్థులు, ప్రజల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గెలుపోటములపై మాత్రం ఎన్నో ఊహాగానాలు వెలువడుతున్నాయి. విచిత్రం ఏంటంటే రెండు సార్లు అధికారంలో ఉన్న అన్నాడీఎంకేపై పెద్దగా వ్యతిరేకత లేదు.. అలాగనీ అనుకూలమూ లేదని పలు సర్వేలు వెల్లడిస్తుండడం ఆసక్తిగా మారింది.

ఢిల్లీ పెద్దల చలవతో..

జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే ప్రభుత్వం కకావికలమవుతుందని, పాలన అస్తవ్యస్తమవుతుందని చాలామంది భావించారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ, ఢిల్లీ పెద్దల చలువతో నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారు. నిజానికి ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో ఒకింత సానుకూలతే కనిపిస్తోంది. అధినేత్రి లేని లోటుగానీ, పదేళ్లు పనిచేసిన ప్రభుత్వం పట్ల ఉండే వ్యతిరేకత గానీ ప్రజల్లో పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు కూడా పలు సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదంటూనే.. ఈసారి ఓటు మాత్రం డీఎంకేకే వేస్తామని ఓటర్లు చెప్పడం ఆ సర్వేలు నిర్వహిస్తున్న నిపుణులను సైతం దిగ్ర్భాంతికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకూ వెల్లడైన నాలుగైదు సర్వేలు మెజారిటీ డీఎంకేవైపే మొగ్గు చూపినప్పటికీ.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చెప్పడం ఆశ్చర్యం గొలుపుతోంది.

ఎవరికి కలిసి వస్తుందో..?

మునుపెన్నడూ లేని విధంగా ఈసారి తమిళనాడులో ఐదు కూటములు బరిలో నిలిచాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, పెరుంతలైవర్‌ కామరాజర్‌ కట్చి, తమిళ మానిల కాంగ్రెస్‌(టీఎంసీ) ఉన్నాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, డీపీఐ, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, ముస్లింలీగ్‌, మణిదనేయ మక్కల్‌ కట్చి ఉన్నాయి. కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌నీదిమయ్యం కూటమిలో సమత్తువ మక్కల్‌ కట్చి, ఇండియ జననాయగ కట్చి, టీటీవీ దినకరన్‌ నాయకత్వంలోని అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగంలో డీఎండీకే, ఎస్డీపీఐ తదితర పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. సీమాన్‌ నాయకత్వంలోని నామ్‌తమిళర్‌ కట్చి మాత్రం ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దింపింది. అత్యధిక కూటములు, ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడం ఈసారి ఎవరికి కలిసివస్తుందో, ఎవరి నష్టం చేకూరుస్తుందో అని అన్ని పార్టీలూ బేరీజువేసుకుంటున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp