వాళ్ళు మారరు ,మళ్ళీ కాళ్లు, చేతులు న‌రికేస్తార‌ట‌..!

By Kalyan.S Sep. 25, 2021, 11:00 am IST
వాళ్ళు మారరు ,మళ్ళీ  కాళ్లు, చేతులు న‌రికేస్తార‌ట‌..!

ఆప్ఘ‌నిస్తాన్ లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్ల చ‌ర్య‌లు ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంటున్నాయి. కొంద‌రికి క్రూరంగా కూడా అనిపిస్తున్నాయి. కానీ.. ఆ పాల‌కులు వాటిని స‌మ‌ర్థించుకుంటూనే ఉంటున్నారు. ఐక్యరాజ్యసవిుతికి చెందిన భద్రతా మండలి గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చిన 14 మంది ఉగ్రవాదులు తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రులుగా కొన‌సాగుతున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు.

అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డారు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. అటువంటి సిరాజుద్దీన్ అక్క‌డ సిరాజుద్దీన్ మామ ఖలీల్‌ హక్కానీ కాందిశీకుల సంక్షేమ మంత్రిగా నియమితులయ్యారు. రక్షణ శాఖ మంత్రి ముల్లా యాకూబ్, విదేశాంగ మంత్రి ముల్లా అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి షేర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్‌జాయ్‌ తదితరులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన శాంక్షన్స్‌ కమిటీ(తాలిబన్‌ శాంక్షన్స్‌ కమిటీ) గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది.

క‌ఠినంగా స్లామిక్ చ‌ట్టం అమ‌లు

స్లామిక్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఆఫ్ఘనిస్థాన్ నూతన పాలకులు స్పష్టం చేస్తున్నారు. ఉరితీతలు, చేతులు నరకడాలు వంటి శిక్షలను పునరుద్ధరిస్తామని తెలిపారు. అయితే ఇటువంటి శిక్షలను బహిరంగంగా అమలుపరచాలా? వద్దా? అనే అంశంపై అధ్యయనం జరుగుతోందని చెప్పారు. తమ పాలనలో ఇతర దేశాలు జోక్యం చేసుకోరాదని హెచ్చరించారు. తాలిబన్ న్యాయ శాఖ మంత్రి ముల్లా నూరుద్దీన్ టురబి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ నూతన పాలకుల పాలనలో జోక్యం చేసుకోరాదని ప్రపంచాన్ని టురబి హెచ్చరించారు. గత తాలిబన్ పాలనలో ఉరితీతలపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలను తోసిపుచ్చారు.

Also Read : తాలిబాన్లలో "హక్కానీ" గ్రూప్ ప్రత్యేకం

స్టేడియంలలో తాము అమలు చేసిన శిక్షల గురించి ప్రతి ఒక్కరూ విమర్శించారని, కానీ తాము ఎన్నడూ వారి చట్టాలు, శిక్షల గురించి ఏమీ మాట్లాడలేదని అన్నారు. ‘‘మా చట్టాలు ఎలా ఉండాలో ఎవరూ చెప్పకూడదు. మేము ఇస్లాంను అనుసరిస్తాం. ఖురాన్ ఆధారంగా మేం చట్టాలు చేస్తాం’’ అన్నారు. న్యాయమూర్తులు కేసులపై విచారణ జరిపి తీర్పులిస్తారన్నారు. ఆఫ్ఘనిస్థాన్ చట్టాలకు పునాది ఖురాన్ అని చెప్పారు. గతంలో అమలు చేసిన శిక్షలను పునరుద్ధరిస్తామన్నారు.

చేతులను నరకడం భద్రత కోసం చాలా అవసరమని చెప్పారు. ఇది నిరోధక చర్య అని చెప్పారు. శిక్షలను బహిరంగంగా అమలు చేయాలా? అనే విషయంపై కేబినెట్ అధ్యయనం చేస్తోందన్నారు. దీనికి సంబంధించిన విధానాన్ని అభివృద్ధిపరుస్తామన్నారు.
తాలిబన్లు 1996-2001 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్థాన్‌ను పరిపాలించినపుడు కాబూల్ స్పోర్ట్స్ స్టేడియంలో లేదా ఈద్గా మసీదు మైదానంలో శిక్షలను అమలు చేసేవారు. వందలాది మంది చూస్తుండగా శిక్షలు అమలయ్యేవి. బాధితుల కుటుంబ సభ్యులు దోషి తలలోకి కాల్చి చంపడం వంటి పద్ధతులను అనుసరించేవారు.

ఒక్కొక్కసారి బాధితుల కుటుంబ సభ్యులు ‘‘బ్లడ్ మనీ’’ తీసుకుని, దోషిని సజీవంగా వదిలిపెట్టే అవకాశం ఉండేది. దొంగలకు చేతులను నరికేవారు. హైవేలపై దోపిడీకి పాల్పడినవారి చేతిని, కాలిని నరికేవారు. అయితే విచారణలు, దోషిత్వ నిర్థరణలు బహిరంగంగా జరగడం అరుదు. న్యాయ వ్యవస్థ పూర్తిగా ఇస్లామిక్ మత పెద్దలకు అనుకూలంగా ఉంటుంది. ఈ మత పెద్దలకు న్యాయశాస్త్రంలో నైపుణ్యం ఉండద‌నే వాద‌న ఉంది.

Also Read : WTC ట్విన్ టవర్స్,లాడెన్,సద్దాం,ఐసిస్ ,మళ్ళీ తాలిబన్- 20 ఏళ్ళలో జరిగింది ఇదే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp