మనకు కావాలి ఒక ఛానల్

By Ritwika Ram Jul. 09, 2021, 02:20 pm IST
మనకు కావాలి ఒక ఛానల్

‘‘తెలంగాణలో మీడియా అంతా కేసీఆర్‌ కంట్రోల్‌లో ఉంది. ఏపీ మీడియాలో మాత్రం ఏబీఎన్, టీవీ5 చానల్స్‌ ద్వారా లోకేశ్‌కు బాగా ప్రచారం కల్పిస్తున్నాం’’ - కొన్ని రోజుల కిందట ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పిన మాటలివి...

‘‘సోదరులరా.. మేం మాట్లాడేది కూడా కవరేజీ ఇవ్వండి. కేసీఆర్ మాట్లాడితే గంటలు గంటలు లైవ్ ఇస్తారు’’ - గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.

రాజకీయ నాయకులకు మీడియా సపోర్టు ఎంత అవసరమో చెప్పేందుకు ఈ రెండు కేవలం ఉదాహరణలు మాత్రమే. తమ లీడర్లను ఆహా ఓహో అని ప్రజలకు చెప్పాలన్నా.. ప్రతిపక్షాలను విమర్శించాలన్నా ఇవే అస్త్రాలు. కొన్ని సందర్బాల్లో పొలిటికల్ పార్టీలకు మీడియా సంస్థలే అజెండా సెట్ చేస్తాయి కూడా. లీడర్ల నిర్ణయాలను, వాయిస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పని చేస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా పార్టీ కోసం సొంత మీడియా సంస్థ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట. దీనిపై గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మాణిక్కం ఠాగూర్‌, రేవంత్‌రెడ్డి, భట్టి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు తదితరులు సమావేశమై చర్చించారట.

ప్రజల్లోకి వెళ్లాలంటే తప్పదు మరి

ఏ పార్టీ అండ లేకుండా, ఏ పార్టీ కోసం పని చేయకుండా.. కొనసాగుతున్న మీడియా సంస్థలు చాలా అరుదు. దీంతో రాజకీయ పార్టీలు మీడియా సంస్థల సపోర్టు తీసుకుంటున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇది అత్యవసరమని భావిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చాలా పార్టీలకు సొంత మీడియా సంస్థలు ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు పరోక్షంగా సపోర్టు చేస్తుంటాయి. ఇంకొన్ని పార్టీ గొంతుకగా పని చేస్తాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేనకు సామ్నా, ఏపీలో టీడీపీకి ఆంధ్రజ్యోతి, వైఎస్సార్ సీపీకి సాక్షి.. తెలంగాణలో టీఆర్ఎస్ కు నమస్తే తెలంగాణ, టీన్యూస్.. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ కూడా తెలంగాణలో సొంత మీడియా ఉండాలని భావిస్తోంది. సోషల్ మీడియాలో పార్టీ గ్రూపులు ఎన్ని ఉన్నా.. ప్రధాన మీడియా అవసరం చాలా అవసరమని అనుకుంటోంది.

చానళ్లను చుట్టేసిన రేవంత్

ప్రజలను, తమ కార్యకర్తలను ప్రసన్నం చేసుకోవడం కంటే ముందు.. మీడియాను మేనేజ్ చేయడంపైనే లీడర్లు దృష్టి పెడుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి కూడా మీడియా సంస్థలను చుట్టొచ్చారు. తనను పీసీసీ చీఫ్ గా నియమించినట్లు ప్రకటన రాగానే తొలుత తమ పార్టీ సీనియర్లను కలిసిన రేవంత్ రెడ్డి.. తర్వాత మీడియా హౌస్ లకు వెళ్లారు. టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు తదితర చానళ్ల అధిపతులను కలిశారు. తనకు సపోర్టు చేయమని కోరేందుకే రేవంత్ వారిని కలిశారు. అయితే అవన్నీ టీడీపీ అనుకూల మీడియాలే కావడం గమనార్హం.

రెండున్నరేళ్లలో ఎన్నికలు

తెలంగాణలో రెండున్నరేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ మీడియా సంస్థను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ లీడర్లు భావిస్తే ఈ రెండున్నర ఏళ్లలోనే ఏదో ఒకటి చేయాలి. ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. తమ వాయిస్ జనాలకు వినిపించాలంటే చానాల్ తప్పనిసరి అని భావిస్తున్న రేవంత్ రెడ్డి, ఇతర నేతలు.. ఈ ప్రతిపాదనపై ముందుకు వెళ్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

Also Read : త్వ‌ర‌లోనే మూడు రాజ‌ధానులు.. కేంద్రం సంకేతాలు?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp