రఘురామరాజుకు బెయిల్‌.. కానీ మాట్లాడొద్దని షరతు

By Karthik P May. 21, 2021, 05:10 pm IST
రఘురామరాజుకు బెయిల్‌.. కానీ మాట్లాడొద్దని షరతు

రాజద్రోహం కేసులో అరెస్ట్‌ అయిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ రాజుకు ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు సుప్రిం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఉదయం నుంచి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రిం ధర్మాసనం.. కొద్దిసేపటి క్రితం తీర్పును వెల్లడించింది. విచారణ అధికారి పిలిచిన వెంటనే విచారణకు హాజరుకావాలని, అందుకు అధికారులు 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని షరతు విధించింది. మీడియాతో మాట్లాడకూడదని స్పష్టం చేసింది. ఇటీవల బైపాస్‌ సర్జరీ జరిగిన నేపథ్యంలో ఎంపీ ఆరోగ్యం దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

పోటా పోటీగా వాదనలు..

రఘురామ కృష్టం రాజు బెయిల్‌ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే, రఘురామ కృష్ణం రాజు తరఫున ముఖుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువురు న్యాయవాదుల మధ్య వాడీ వేడీగా వానదలు సాగాయి. రఘురామ కృష్ణం రాజుపై కక్షతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు పెట్టిందని, బెయిల్‌ రాకుండా ఉండాలనే అందుకు తగిన సెక్షన్లతో కేసు నమోదు చేశారని ముఖుల్‌ వాదించారు. సీఎం వైఎస్‌ జగన్‌ బెయిల్‌రద్దు చేయాలని రఘురామకృష్ణం రాజు పిటిషన్‌ దాఖలు చేశారని, దాన్ని అడ్డుకునేందుకు రఘురామను అరెస్ట్‌ చేశారంటూ పేర్కొన్నారు. ఎంపీ అయిన రఘురామను పోలీసులు విచారణ సమయంలో కొట్టారంటూ పేర్కొన్నారు. ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించిన దుష్యంత్‌ దవే ముఖుల్‌ వాదనలను తోసిపుచ్చారు. రఘురామరాజు సమాజంలో అలజడులు సృష్టించేందుకు యత్నించారని పేర్కొన్నారు. ఆయన మాట్లాడిన 45 వీడియోలను పరిశీలించిన సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని తెలిపారు. దేశంలో ఓ ఎంపీని పోలీసులు ఇప్పటి వరకు కొట్టలేదన్నారు. పోలీసులు కొడితే ఒక కాలిలోని రెండో వేలికి మాత్రమే గాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

అంతకు ముందు సికింద్రాబాద్‌ రైల్వే మెడికల్‌ అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయమూర్తి చదివి వినిపించారు. రఘురామ కాలి వేలికి గాయం అయిందన్న విషయంపై ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవేను ప్రశ్నించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికన వ్యతిరేకించడం లేదన్న దవే.. గుంటూరు జీజీహెచ్‌ నివేదిక కూడా సరైనదేనన్నారు. గాయం ఎప్పుడు అయిందనే విషయం నివేదికలో లేదన్నారు.

పిటిషన్‌ తరఫు న్యాయవాది పదే పదే ఎంపీ అంటూ సంబోధిస్తున్నారని, ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్లు కాదని దవే అన్నారు. చట్టం అందరికీ ఒక్కటేనన్నారు. బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టు కింది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించగా.. రఘురామ రాజు సుప్రిం కు వచ్చారని గుర్తు చేశారు. హైకోర్టులో మెరిట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోకముందే ఆయన బైపాస్‌లో సుప్రిం కోర్టుకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం రఘురామరాజు ఆర్మీ ఆస్పత్రిలోనే ఉన్నందున. బెయిల్‌ పిటిషన్‌ను రద్దు చేయాలని, విచారణను వాయిదా వేయాలని కోరారు.

అయితే, హైకోర్టులో ఊరట లభించనందునే సుప్రిం కోర్టుకు వచ్చామని ఎంపీ న్యాయవాది ముఖుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. ఇరు వైపుల వాదనలను విన్న ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Also Read : రఘు రామరాజు కట్టు కథ బయటపడింది..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp