నీరు చెప్తున్న సత్యం..చంద్రబాబు చెప్తున్న అసత్యం .. పోతిరెడ్డిపాడు నుంచి తెలుగు గంగ చరిత్ర

By Siva Racharla May. 22, 2020, 10:30 pm IST
నీరు చెప్తున్న సత్యం..చంద్రబాబు చెప్తున్న అసత్యం .. పోతిరెడ్డిపాడు నుంచి తెలుగు గంగ చరిత్ర

ఒక విషయాన్ని పదిసార్లు పది మందితో చెప్పిస్తే నలుగురైనా నమ్ముతారని రాజకీయ నాయకులకు ఒక ఆశ... ఆ క్రమంలో ఒక్కోసారి ముందు వెనుక ఆలోచించకుండా ఫ్లోలో ఏదేదో చెప్పేస్తారు... ఈ పద్దతి కొత్త తరం నాయకులకు కొంత కలిసి వస్తుంది కానీ నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికి అది కూడా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతకు అనుకూలించకపోగా పలు ప్రశ్నలతో తలబొప్పి కట్టిస్తుంది...

ఇది చదివిన వారిలో కనీసం 90 శాతం మందికి ఈ వాఖ్యాలు ఎవరిని ఉద్దేశించి రాస్తున్నవో అర్ధమైపోతాయి, అది ఆ నాయకుడు సాధించిన విజయం! సాగునీటిపారుదల కోసం చాలా చేసాను అని చెప్పుకోవటానికి ఆత్రపడే చంద్రబాబు మొన్న ఏకంగా రాయలసీమ ప్రాజెక్టులన్నీ కట్టింది నేను కాదా ?అంటూ ప్రశ్నించాడు... 

చంద్రబాబు మాటలను యధాతధంగా తీసుకోకుండా భావాన్ని అర్ధం చేసుకోవాలని ఆయన అనుచరులు అంటుంటారు... కవి హృదయం అందరికీ అర్ధం కాదు .. చంద్రబాబు చెప్తుంది కవిత్వం కాదు... ఒక అంశం మీద నికారంగా మాట్లాడటం, తాను చేసిన పనులను మాత్రమే చెబితే ఇంత చర్చ ఉండదు.. చంద్రబాబు కూడా ఎంతోకొంత పనులు చేయించారన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది ...

SRBC పథకం ఎలా మొదలైంది?
శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఉన్నప్పటి నుంచి కుడికాలువ ద్వారా కర్నూల్ జిల్లాకు నీళ్లు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రధానంగా పవర్ జనరేషన్ కోసం ఉద్దేశించింది కావటంతో ఈ డిమాండ్ మీద నిర్ణయం ఆలస్యమయింది. 1976లో జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శ్రీశైలం కుడి కాలువ కింద నీరు ఇవ్వటానికి శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ లో "పోతులపాడు" వద్ద హెడ్ రెగ్యులేటర్ కట్టటానికి అనుమతులు ఇచ్చారు. రికార్డ్స్ ప్రకారం దీని పేరు "శ్రీశైలం కుడికాలువ హెడ్ రెగ్యులేటర్" కానీ పత్రికలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అని రాయటంతో వాడుకలో ఆ పేరు స్థిరపడింది.

ఈ పథకంలో భాగంగా పోతులపాడు గ్రామంవద్ద హెడ్ రెగ్యులేటర్ ,నది నుంచి రెగ్యులేటర్ వరకు అప్రోచ్ కాలువ , రెగ్యులేటర్ నుంచి బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు 16 కి.మీ మేర SRMC(శ్రీశైలం కుడి మైయిన్ కాలువ),బానకచెర్ల నుంచి 140 కి.మీ SRBC-శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్,12.44 టీఎంసీ ల గోరకల్లు రిజర్వాయర్,4.30 టీఎంసీల అవుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలి.

SRBC,పోతిరెడ్డిపాడు పనులు మొదలు కావటం వెనుక నంద్యాల మాజీ ఎంపీ పెండేకంటి వెంకటసుబ్బయ్య కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1977 ఎన్నికల్లో నీలం సంజీవ్ రెడ్డి జనతా పార్టీ తరుపున నంద్యాల నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి పెండేకంటి వెంకటసుబ్బయ్య మీద 35 వేల మెజార్టీతో గెలిచారు. వెంకటసుబ్బయ్య అప్పటికే మూడుసార్లు ఎంపీగా గెలిచాడు.

సంజీవరెడ్డి ఎంపీగా గెలిచిన స్వల్పకాలంలోనే రాష్ట్రపతిగా ఎన్నిక కావటంతో 1978లో జరిగిన ఉప ఎన్నికల్లో పెండేకంటి పోటీచేసి గెలిచాడు. ఆ ఎన్నికల్లో SRBC పూర్తి చేయించి నీళ్లు ఇస్తానని పెండేకంటి ప్రచారం చేసాడు. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద పెండేకంటి ఒత్తిడి తెచ్చి పనులు త్వరగా మొదలు కావటానికి దోహదం చేసాడు.

తెలుగు గంగ ఎలా మొదలైంది ?
బ్రిటీష్ కాలం నుంచి కృష్ణా-పెన్నార్ పథకం ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని మద్రాస్ కు తీసుకెళ్లాలన్న ప్రతిపాదన ఉంది. స్వాతంత్రం తరువాత రాయలసీమ నాయకులు ఆ పథకాన్ని వ్యతిరేకించారు.

నాటి ప్రధాని ఇందిరా 15-Feb-1976 నాడు మద్రాస్ దాహార్తిని తీర్చటానికి శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని మద్రాస్ కు తీసుకొచ్చే ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక రాజకీయ లక్ష్యాలు ఉన్నా (01-Feb-1976 న తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించారు, డీఎంకే ,అన్నా డీఎంకే లతో ప్రజలు విసిగిపోయారని, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని భావించారు) నేడు పిలుస్తున్న తెలుగు గంగ ప్రాజెక్టుకు బీజాలు పడ్డాయి.

ఇందిరా సూచనతో 14-Apr-1976 న మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సమావేశమయ్యి అందరు 5 టీఎంసీ ల చొప్పున మొత్తం 15 టీఎంసీలు మద్రాస్ కు ఇచ్చేలా అంగీకరించారు. 1978 జూన్లో నాటి ముఖ్యమంత్రులు జలగం వెంగళ రావ్,ఎంజీఆర్ సమావేశమయ్యి ప్రాజెక్ట్ సర్వే ,DPR తయారీకి కావలసిన అనుమతులు ఇచ్చారు. ఆ విధంగా తెలుగు గంగ ప్రాజెక్ట్ చర్చల స్థాయిని దాటి వాస్తవరూపం దాల్చటం మొదలయ్యింది.

తెలుగు గంగ - పూర్వాపరాలు
పైన రాసినట్లు 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ గెలవటం కాసు బ్రహ్మానందరెడ్డి ,జలగం వెంగళ రావ్ వర్గం ఓడిపోవటంతో ఆంధ్రాలో కొత్త రాజకీయం మొదలయింది. రెండున్నర సంవత్సరాల చెన్నారెడ్డి పాలన తరువాత అంజయ్య ముఖ్యమంత్రి అయినా తరువాత SRMC పనులు వేగం పుంజుకున్నాయి. మరోవైపు తెలుగు గంగ సర్వే జరుగుతుంది ...

నీటి కోసం రాయలసీమ నేతల తాపత్రయం పై ఫోటో చూస్తే అర్ధమవుతుంది.. వరి పంట వేయటానికి అధికారుల అనుమతి కావలి,అనుమతి లేకుండా వరి పంట సాగుచేస్తే అధికారులు నిర్దయగా పంటను ధ్వంసం చేసేవారు.

రాయలసీమకు చెందిన కాంగ్రెస్ యువ శాసనసభ్యులు వైఎస్ఆర్ తదితరులు SRMC నుంచి ఎడమ వైపు మరో కాలువ తొవ్వి (అప్పటికి తెలుగు గంగ పేరు లేదు.. లెఫ్ట్ బ్రాంచ్ ఆఫ్ శ్రీశైలం రైట్ కెనాల్ అని వ్యవహరించేవారు) కడప చిత్తూర్ జిల్లాలకు నీళ్లు ఇవ్వాలని అంజయ్య మీద ఒత్తిడి తెచ్చారు. ఆయన ఈ డిమాండ్ సాధ్యా సాధ్యాల ను స్టడీ చేయటానికి ఒక టెక్నికల్ కమిటీ వేసాడు.. ఆ రిపోర్ట్ వొచ్చేలోపు ఆయన పదవి నుంచి దిగిపోయి.. భవనం వెంకట్ రామ్ ,కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులయ్యారు.. 1983 ఎన్నికలు కూడా వొచ్చేశాయి..

తెలుగు గంగ - ఎన్టీఆర్ పాత్ర
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన మూడు నెలలోనే 1983 ఏప్రిల్ లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో ప్రాజెక్ట్ ఖర్చు మరియు ఇతర అంశాల మీద ఒప్పందం చేసుకొని 27-Apr-1983 నాడు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరుతొ రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసాడు.

SRBC ప్రాజెక్టు లోని అప్రోచ్ కెనాల్ ,పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్,శ్రీశైలం కుడి మైయిన్ కెనాల్ ,బానకచెర్ల - ఏ ఈ నాలుగింటిని SRBC నుంచి తప్పించి తెలుగు గంగ పథకం లో చేర్చారు. దీనితో తెలుగు గంగ పనులు ఊపందుకున్నాయి కానీ SRBC పనుల్లో స్పీడ్ తగ్గింది.

ఎన్టీఆర్ కృషితో తెలుగు గంగ పథకంకింద వెలిగోడు ,బ్రహ్మం సాగర్ పనులు బాగా జరిగాయి. అందులో వెలుగోడు పూర్తికాగా బ్రహ్మం సాగర్ వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా 2007లో పూర్తి చేశాడు.1983 లో శంకుస్థాపన జరిగితే 2007లో పూర్తయ్యింది. దాదాపు 25 సంవత్సరాలు .. మధ్యలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నీటిప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఎందుకు విమర్శిస్తారో దీన్ని చూస్తే అర్ధమవుతుంది... ఆయన మీడియా ముందు ఎంత గొంతు చించుకున్నా ఏమి ఉపయోగం? సాక్ష్యం చెప్పవలసింది పూర్తి అయిన ప్రాజెక్టులు . వాటిని నిర్లక్ష్యం చేసి .. ఇప్పుడు ఎంత మాట్లాడినా ఎవరూ నమ్మరు ..

ఎంవీఆర్ ,వైయస్ఆర్,మైసూరా రెడ్డి తదితరులు "కరువుబండ" యాత్ర ఎందుకు చేశారు
అధికారంలోకి వొచ్చిన మూడు నెలలోనే ఎన్టీఆర్ తెలుగు గంగ పనులు మొదలు పెట్టటానికి కారణం అంజయ్య హయాంలో మొదలై చాలావరకు పూర్తయిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ , SRMC ,బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ పనులు .. అందుకే ఎన్టీఆర్ తెలుగు గంగ శంకుస్థాపన వెలుగోడు,బ్రహ్మం సాగర్ వద్ద చేసాడు.

అంజయ్య హయాంలో వేసిన టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం తెలుగు గంగ ద్వారా కడప,చిత్తూర్ జిల్లాలకు తాగు నీరు,సాగు నీరు ఇవ్వాలని,SRBC కి కేటాయించిన 19 టీఎంసీల నీటిని వాడుకోవటం కోసం నిర్మించిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ తోపాటు కాలువల సామర్ధ్యం పెంచాలని రాయలసీమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్, మైసురా రెడ్డి, చెంగారెడ్డి, మబ్బు రామిరెడ్డి, కుతూహలమ్మ, గంగుల ప్రతాప్ రెడ్డి ,సీనియర్ నేతలు శేష శయనారెడ్డి తదితరులు ఎన్టీఆర్ మీద ఒత్తిడి తెచ్చారు కానీ ఆయన పట్టించుకోలేదు.

కరువు బండ యాత్ర
రాయలసీమలో పలుచోట్ల కరువు తొలగి,పంటలు సంవృద్ధిగా పండాలని కోరుకుంటూ రాళ్లు , రోళ్ళు, రోకళ్ళు నీళ్లలో పడేస్తారు.దీనిని కరువు బండ అంటారు.

"కరువు బండ " యాత్ర పేరుతో 1986 జనవరి 1 న లేపాక్షి నుంచి వైయస్ఆర్ నాయకత్వంలో, రాయదుర్గం నుంచి ఎంవీ రమణారెడ్డి నాయకత్వంలో,తిరుపతి నుంచి మైసూరా రెడ్డి నాయకత్వంలో,మదనపల్లి నుంచి చంద్రశేఖర్ రెడ్డి,భూమన్ నాయకత్వంలో, మంత్రాలయం శేష శయనా రెడ్డి నాయకత్వంలో మొత్తం రాయలసీమను కవర్ చేస్తూ 21 జనవరి 1986 నాటికి పోతిరెడ్డిపాడుకు చేరుకొని రెగ్యులేటర్  సామర్ధ్యం పెంపు పనులను మొదలు పెడుతూ సింబాలిక్ గా నాలుగు పలుగులతో కొంచం తొవ్వాలని , సీమను కరువు నుంచి కాపాడాలను కోరుతూ "కరువు బండ" కృష్ణా నదిలో విడవాలని నిర్ణయించారు.

ఈ యాత్ర రాయలసీమలోని అన్నిపాంతాలను కలుపుతూ సాగింది. ప్రకాశం జిల్లా కంబం,గిద్దలూరు నుంచి కందుల నాగార్జున రెడ్డి నాయకత్వంలో మరో బృందం కూడా వీరితో పాటు పాదయాత్ర చేశారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 22-Jan-1986 నాడు పోతిరెడ్డిపాడు చేరుకొని సింబాలిక్ గా తొవ్వి,కరువు బండను నీళ్ళలోకి తోశారు.

నాటి సభకు కనీసం 30 వేల మంది హాజరయ్యిఉంటారని అంచనా. శాంతిభద్రతల సమస్య రాకుండా నాయకులు చర్యలు తీసుకున్నారు. ఒక దశలో ఉద్యమకారులు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ను డ్యామేజి చేస్తారని, సభకు అనుమతులు రాకుండా చేయలని పోలీసుల మీద ఒత్తిడి వొచ్చింది.

అధికారపార్టీ నాటకీయత, చంద్రబాబు లక్ష క్యూసెక్కుల ప్రకటన
ఉద్యమాలను,ప్రతిపక్ష పోరాటాల నుంచి ప్రజలు దృష్టి మరల్చే ఎత్తుగడలు మొదటి నుంచి చంద్రబాబుకు అలవాటే.

ఆ యాత్రలో కాంగ్రెస్ నాయకులతో , రాయలసీమ పోరాట సమితి నేత ఎంవీ రమణారెడ్డి ,విప్లవ సంస్థలలో పనిచేసిన భూమన్,చంద్రశేఖర్ రెడ్డి ఇలా పార్టీలకు అతీతంగా 20 రోజుల పాటు పాద యాత్ర చేస్తుంటే మీరు యాత్రను ఆపి మాతో కలిసి రండి,ఢిల్లీకి వెళ్లి ప్రధాని రాజీవ్ ఇంటి ముందు ధర్నా చేద్దాం అంటూ చంద్రబాబు,మంత్రులు రాజగోపాల్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి ప్రకటనలు చేశారు.

వైఎస్ఆర్ ,మైసూరా తదితర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాయలసీమకు మంచి జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారని, 35 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏమి చేశారని ఎదురుదాడికి దిగారు.. ఆ యాత్రలో పాల్గొన్న నాయకులు ఎక్కువ మంది 35- 38 సంవత్సరాల వయస్సు వారే.. 35 సంవత్సరాల కాంగ్రెసు పాలనకు మేము ఎలా బాధ్యత వహించాలని వీరు ప్రజలకు సమాధానము చెప్పేవారు. చంద్రబాబు ,కేఈ కృష్ణ మూర్తి తొలిసారిమంత్రులు అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వాలలోనేనన్న వాస్తవాన్ని మర్చిపోయి వారు చేసిన రాజకీయ ఆరోపణలు ప్రజలు పట్టించుకోలేదు.

మరోవైపు ఎన్టీఆర్ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నాడని మంత్రి రాజగోపాల్ రెడ్డి ప్రకటించగా, ఎన్టీఆర్ పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని లక్ష క్యూసెక్కుల కు పెంచటానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ప్రకటించాడు.

మళ్ళీ చదవండి పోతిరెడ్డిపాడు కెపాసిటీని లక్ష క్యూసెక్కులకు పెంచటానికి ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడని టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో చంద్రబాబు 1986లో ప్రకటించాడు... కట్ చేస్తే 2005లో వైస్సార్ పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44, 000 క్యూసెక్కులను పెంచే వరకు దాని కెపాసిటీ 11,500 క్యూసెక్కులు ... నీటి ప్రాజెక్టుల మీద చంద్రబాబు చిత్తశుద్ధి ఇది.

పోనీ,పోతిరెడ్డిపాడును వైఎస్ఆర్ 44,000 క్యూసెక్కులకు పెంచినప్పుడు ఆ నిర్ణయాన్ని చంద్రబాబు సమర్ధించాడా? అఖిల పక్ష సమావేశంలో కానీ శాసనసభ చర్చలో గాని ఎక్కడన్నా పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచటం మంచిదని అనలేదు..చంద్రబాబు 1996లో ఇచ్చిన జీవో 69 ని సవరిస్తూ, శ్రీశైలం కనీస నీటి మట్టంను 834 నుంచి 854 అడుగులకు పెంచుతూ వైఎస్ఆర్ తెచ్చిన జీవో 107 కు వ్యతిరేకంగా దేవినేని ఉమా, కోడెల నాయకత్వంలో మూడు రోజులు ప్రకాశం బ్యారేజి కింద ధర్నా చేసి ఒక్క బక్కెట్ నీళ్లు తీసుకెళ్ళినా తలలు తెగుతాయ్ అని హెచ్చరికలు చేశారు..

13 రోజుల దీక్ష 13 కోర్కెలు 13 మంది శాసనసభ్యులు

ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవటంతో రాయలసీమ నీటి సమస్యతో పాటు మరో 12 అంశాల మీద వై ఎస్ఆర్ ఇచ్చిన నోటీసు మీద 18-Aug-1988 న అసెంబ్లీల చర్చ జరిగింది ..అనేక అవాంతరాల మధ్య చర్చ రెండో రోజు కూడా కొనసాగింది.టీడీపీ కాంగ్రెస్ సభ్యుల వాదోపవాదులతో సభ వేడెక్కింది,చివరికి స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్ చేసాడు.. మార్షల్స్ బలవంతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ బయటకు ఎత్తుకొచ్చి వొదిలారు. కాంగ్రెస్ సభ్యులు సభా ప్రాంగణంలోనే రాత్రంతా నిరశన దీక్ష చేశారు. తరువాతి రోజు మార్షల్స్ వీరిని రోడ్డు మీదకి తోసివేసారు.. పి. జనార్దన్ రెడ్డి నాయకత్వంలో అప్పటికప్పుడు రోడ్డు మీదనే టెంట్లు వేసి దీక్షను కొనసాగించారు..

అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు .. దీనితో శాసనసభ సమావేశాలు జరిగినన్ని రోజులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకొని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాయలసీమకు చెందిన 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 13 డిమాండులతో నిరాహార దీక్షను మొదలు పెట్టారు..

దీక్షలో ఉన్న ఎమ్మెల్యేలు 24-Aug-1988న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు తమ డిమాండ్ లు పరిష్కరించాలని ఉత్తరం రాశారు ,దానికి ఎన్టీఆర్ సమాధానం రాసారు కానీ ఎలాంటి వాగ్దానం చెయ్యలేదు. 31-Aug-1988 సమావేశాల చివరి రోజు కానీ ఒకరోజు ముందే సమావేశాలను ముగించారు .. దీనితో పొత్తూరి వెంకటేశ్వర రావ్,గజ్జల మల్లారెడ్డి చొరవ తీసుకొని ఎమ్మెల్యేల దీక్షను విరమింపచేశారు .

ఆ విధముగా 13 డిమాండ్ల సాధనకు 13 మంది శాసనసభ్యులు 13 రోజులపాటు చేసిన నిరాహార దీక్ష ముగిసింది.

నడిరోడ్డు మీద సీన్ క్రీయేట్ చేసిన ఎన్టీఆర్
తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగించిన సీమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి పలుసార్లు ఉత్తరాలు రాశారు. 1988 నవంబర్ 1 న అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఎన్టీఆర్ కు మెమోరాండం ఇవ్వటానికి కాంగ్రెస్ నేతలు అనుమతి కోరగా దానికి ఎన్టీఆర్ అంగీకరించాడు.

రాయలసీమ నుంచి వేలాది ప్రజలు మంది పబ్లిక్ గార్డెన్స్ వద్దకు చేరుకున్నారు.. కానీ అప్పటికే పోలీస్ బలగాలు అక్కడి చేరుకొని వీరిని ముందుకు పోకుండా అడ్డుకున్నారు. ఎన్టీఆర్ అనుమతి ఇవ్వటంతో అంతా సాఫీగా సాగుతుందని కాంగ్రెస్ నేతలు భావించారు కానీ పోలీసులు అడ్డుకోవటంతో ప్రభుత్వం ఘర్షణకు దిగుతుందా అని అనుమానం పడ్డారు. ఉద్యమకారులు పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో గుర్రాలు బెదరటంతో గందరగోళం నెలకొని .. కొందరు కార్యకర్తలు సచివాలయంలోకి చొచ్చుకొని వెళ్లారు .. కొంత సమయానికి అందరు సచివాలయం చేరుకొని ముఖ్యమంత్రి కోసం ఎదురు చూసారు ..

గంట గడిచిన ఎన్టీఆర్ అక్కడికి రాలేదు ఇంతలో సచివాలయం బయట ఎన్టీఆర్ కండువా రోడ్డు మీద పరుచుకొని పడుకున్నాడు ..రేణుకా చౌదరి రివాల్వర్ బయటికి తీసి ఆందోళనకారుల ను బెదిరించారు.. మళ్ళీ గందరగోళం ..తమ డిమాండ్ల ఎన్టీఆర్ తో సామరస్యంగా మాట్లాడాలనుకొన్న నాయకులకు ఈ పరిణామాలు దిగ్భ్రాంతిని కలిగించాయి ..ఎన్టీఆర్ దాదాపు 2 గంటలు రోడ్డు మీద కూర్చొని ఇంటికి వెళ్లిపోగా ఉద్యమకారులు సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నారు.

ఈ ఉద్యమాల ఫలితమో లేక ఎన్టీఆర్ మనసు మార్చుకున్నాడా కానీ అదే 1988 నవంబర్ లో బనకచెర్ల వద్ద ఒక శంకుస్థాపన , గాలేరు-నగరి,హంద్రీ-నీవా మూడు పనులకు శంకుస్థాపనలు చేశాడు .. పనులు మాత్రం జరిగింది లేదు .. 12 నెలల తరువాత 1989 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చింది. ఈసారి కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు..

1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుడికాలువ సామర్ధ్యాన్ని 18000 క్యూసెక్కులకు పెంచుతూ జీవో ఇచ్చాడు. "జైకా" రుణంతో కేసి కెనాల్ ఆధునీకరణ కూడా చేసాడు.. గాలేరు-నాగరి పథకం సర్వే కు శ్రీరామ్ రెడ్డి కమిటీ వేశాడు. 1994లో కాంగ్రెస్ ఓటమి , టీడీపీ గెలవటం, 1995లో ఎన్టీఆర్ ను దించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం తెలిసిందే..

చంద్రబాబు హయాంలో నీటి ప్రాజెక్టులు మరోసారి నిర్లక్షానికి గురయ్యాయి..రాయలసీమలో చంద్రబాబు హయాంలో జరిగిన పనులలో SRBC పనుల గురించి ఒక మేర చెప్పుకోవచ్చు కానీ SRBC నుంచి గండికోట రిజర్వాయర్ ను తప్పించటానికి ఐఏఎస్ కృష్ణస్వామి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశాడు.. దీన్ని వ్యతిరేకిస్తూ 1997 అక్టోబర్లో మైసూరా రెడ్డి గండికోట నుంచి,నేదురుమల్లి రాజ్యలక్ష్మి వెంకట్ గిరి నుంచి ,గాలి ముద్దుకృష్ణమ నాయుడు(అప్పట్లో కాంగ్రెసులో ఉండేవారు) నగరి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశారు.వీళ్ళ ఒత్తిడికి వలనో మరెవరైనా చంద్రబాబు మనసు మార్చారో కానీ అదే అక్టోబర్ 1997లో గండికోట రిజర్వాయర్ నిర్మాణానికి కావలసిన భూసేకరణకు నిధులు కేటాయిస్తూ జీవో ఇచ్చాడు.. పనులు మాత్రం జరగలేదు .

వైఎస్ఆర్ జలయజ్ఞం

వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినా తరువాత జలయజ్ఞం లో భాగంగా పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44,000 క్యూసెక్కులు పెంచే పనులు మొదలు పెట్టి పూర్తి చేశారు. గాలేరు-నగరి, హంద్రీనీవా , గండికోట ,వెలిగొండ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వేగవంతంగా పనులు చేయించాడు.. 2012లో గండికోటకు తొలిసారి నీళ్లు పారాయి. హంద్రీ-నీవా ద్వారా కృష్ణా నీళ్లు అనంతపురం జీడిపల్లి వరకు పారాయి.

ఈ పనుల గురించి ఒకరు చెప్పావల్సిన అవసరం లేదు .. ప్రజలు కళ్ళతో చూసారు.. చంద్రబాబు చెప్పే పనులు ఆయన చెప్పిన తరువాత కూడా కంటికి కనిపించవు.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఇప్పటికి నేను నేను ఆ పనులు చేసాను అని చెప్పుకోవాల్సి వస్తుందంటేనే అర్ధమవుతుంది ...

చంద్రబాబు 2005లో పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచటం మీద సూటిగా అభిప్రాయం చెప్పలేదు నేడు జగన్ పోతిరెడ్డిపాడు కెపాసిటీని 80 వేలకు పెంచుతూ ఇచ్చిన జీవో మీద కూడా బహిరంగ అభిప్రాయం చెప్పకుండా "కరోనా" నుంచి దృష్టి మరలచటానికే జగన్ కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించాడు.. వాళ్ళు ఏ నాటకాలైన ఆడనియ్యండి ..పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు మీద చంద్రబాబు ఇప్పుడు కూడా దాటవేత ధోరణి పాటిస్తే అపకీర్తి కూడకట్టుకుంటాడు.. ఎన్నిసార్లు మీడియా ముందు ఆవేశపడినా లాభం లేదు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp