రాష్ట్రాలకు ఆర్థిక బెంగ: మోడీ సర్కారుపై రాష్ట్ర ప్రభుత్వాల గుస్సా

By Jagadish J Rao Jul. 10, 2020, 12:16 pm IST
రాష్ట్రాలకు ఆర్థిక బెంగ: మోడీ సర్కారుపై రాష్ట్ర ప్రభుత్వాల గుస్సా

రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. కానీ మోడీ సర్కార్‌ కరోనా కాలంలో రాజకీయానికి తెరలేపింది. ఓవైపు దిక్కుతోచని స్థితి..మరోవైపు ఖజానాలో కాసుల్లేక రాష్ట్రాలు కేంద్రం వైపు చూస్తున్నాయి. అయితే రాష్ట్రాలను సంప్రదించకుండా.. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ మోడీ సర్కార్ తీసుకొచ్చిన లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రతి రంగాన్నీ, ప్రతి పౌరుణ్ణీ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసింది.

రాష్ట్రాల పన్ను వసూళ్ళు దారుణంగా పడిపోయాయి. ఇప్పటికే నెత్తిన ఉన్న అప్పుల భారాన్ని తప్పించుకోవడమెలా.. అని రాష్ట్ర ప్రభుత్వాలు తర్జనభర్జనపడుతున్నాయి. ఇదే అదనుగా కరోనా వచ్చింది.. కష్టమంతా మీదే అన్నట్టుగా మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నది.

భారతదేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. అలాగే, దేశ ఆర్థిక వ్యవస్థనూ కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసింది. కేంద్రం ఆనుసరించిన అస్తవ్యస్త విధానాలతో కరోనా మహమ్మారి మన దగ్గరకు రావడానికి ముందే మాంద్యంలో ఉన్న దేశం.. ప్రస్తుత పరిస్థితులతో ఆర్థిక వ్యవస్థ మరింత దారుణమైన స్థితికి చేరుకున్నది.

ముఖ్యంగా కరోనాతో పోరాడుతున్న రాష్ట్రాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఆ రాష్ట్రాల ఆదాయాలు, పన్నువసూళ్లు క్రమంగా పడిపోయాయి. ఫలితంగా, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య తేడాలు ఏర్పడుతున్నాయి. పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రజారోగ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఆర్థిక కార్యకలాపాలను తిరిగిప్రారంభించడానికి స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలపై ఇది తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ వంటి రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డౌన్‌ పెట్టాలంటే.. ఖజానా చూసి వెనకడుగువేస్తున్నాయి. దీంతో గాడితప్పిన ఆర్థికవ్యవస్థ ఏవిధంగా నెట్టుకురావాలో తెలియటం లేదు. ఇలా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు పైసల్లేక పనులెట్లా ముందుకు తీసుకెళ్లాలో బోధపడటంలేదు. మార్చి చివరి నుంచి భారత్‌లో లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. కరోనా కేసులు పెరుగుతన్నప్పటికీ కేంద్రం.. లాక్‌డౌన్‌ పరిమితులను ఏప్రిల్‌ 20 నుంచి సడలించింది.

అదే నెలలో భారత్‌లోని 28 రాష్ట్రాలలో 14 రాష్ట్రాలకు రూ.17,200 కోట్లు ఆదాయాల-లోటు గ్రాంటును మోడీ సర్కార్ ఆమోదించింది. క్వారంటైన్‌ సౌకర్యాల కోసం రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి కింద మరో రూ.11,090 కోట్లు విదిల్చింది. డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌కు చెందిన 6.6 బిలియన్‌ డాలర్లు పంజాబ్‌ పొందనుండగా, రాష్ట్రాల అవసరాలను బట్టి చూస్తే ఇవి చాలా తక్కువ అని బాదల్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలోనే మేనెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ రాష్ట్రాల అవసరాలను తీర్చలేకపోయాయి.

వసూళ్లు తగ్గడంతో రాష్ట్రాలు 1.5 లక్షల కోట్లు అమ్మకపు పన్ను వాటాను కోల్పోతాయని ఆర్థిక వేత్త ఎం. గోవిందరావు తెలిపారు. ఇప్పటికే, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఏప్రిల్‌లో ఆదాయం గడించకపోగా.. పన్ను వసూళ్లలో 106.7 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. '' ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ఆటుపోట్లను తొలగించి వాటికి సహాయ పడటానికి కేంద్రం కోవిడ్‌-19 గ్రాంటుతో ముందుకు రావాలి'' అని రావు సూచించారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి మోడీ సర్కార్ మరింత ఆర్థిక ఉద్దీపనకు ఉపక్రమించాల్సినవసరం ఉన్నదని బెంగళూరుకు చెందిన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ వైస్‌ ఛాన్సలర్‌ ఎన్‌ ఆర్‌ భానుమూర్తి అభిప్రాయపడ్డారు.

కోవిడ్‌-19తో పోరాడటానికి అధిక జీఎస్టీ నిధుల కోసం రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్‌ న్యాయమైనదనీ, ఆర్థిక పరిమితులను ఆలస్యం చేయకుండా వాటిని తీర్చాల్సినవసరం కేంద్రంపై ఉన్నదని ఆయన అన్నారు. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన మోడీ.. ఓ వర్గం పై వివక్ష చూపే చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగా తన హిందూ జాతీయవాద సిద్ధాంతాన్ని ప్రతిఘటించిన ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని రాష్ట్రాలతో ఎక్కువ విభేదాలను చూశారు. మరి ఇలాంటి తరుణంలో మోడీ సర్కార్ 'రాజకీయాన్ని' పక్కనబెట్టి రాష్ట్రాలకు తోడు నిలుస్తారా? అని చర్చ నడుస్తున్నది. కానీ కాసులు విదల్చ కుండా బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను అమలు చేస్తున్నదని వామపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా మహమ్మారి విజృంభణతో ఆయా రాష్ట్రాల ఆదాయం, బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. పన్ను వసూళ్ల విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. ఆస్థి, మద్యం, ఇంధన అమ్మకాలపై విధించే పన్నుల ద్వారా రాష్ట్రాలు పొందే ఆదాయం లాక్‌డౌన్‌ సమయంలో పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనం పన్ను వసూళ్లను దెబ్బ తీసే అవకాశం ఉన్నందున జీఎస్టీలో రాష్ట్రాల వాటా కూడా పడిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే కేంద్రం నుంచి పన్నుల వాటా ఆలస్యం కావడంతో రాష్ట్రాల కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి.

''భారత రాజ్యాంగంపై నాకున్న అవగాహన ప్రకారం.. రాష్ట్రాలు ఏవైనా కష్టాల్లో ఉంటే వాటిని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం ముందుకు రావాలి'. కరోనా పరిస్థితుల కారణంగా పంజాబ్‌.. రూ.8,800 కోట్ల వార్షికాదాయంలో మూడో వంతు కోల్పోనున్నది" అని పంజాబ్‌ మంత్రి మన్‌ప్రీత్‌సింగ్‌ బాదల్‌ అన్నారు.

''రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయలపై మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపింది'' ఫిబ్రవరితో ముగిసిన మూడు నెలల జీఎస్టీ బకాయిలు 4.9 బిలియన్‌ డాలర్లు (490కోట్లు). నాలుగు నెలల ఆలస్యం తర్వాత జూన్‌ 4న చెల్లించారు. వాస్తవంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలు లక్షకోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం 40శాతానికి బదులు 60శాతం పన్నును పొందటానికి రాష్ట్రాలు ముందుకు రావాలి" అని‌ కేరళ ఆర్థిక మంత్రి టి.ఎం థామస్‌ ఐజాక్‌ పేర్కొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp