సిక్కోలులో ఎలక్షన్ ఎలా ఉంది?

By Suresh Mar. 05, 2021, 01:40 pm IST
సిక్కోలులో ఎలక్షన్ ఎలా ఉంది?

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ పోరులో చతికిలపడిన పడినా తాము పార్టీ సింబల్‌ లేకపోవడ వల్లే గెలవలేదని సాకులు చెప్పిన ప్రతిపక్ష టీడీపీకి మున్సిపల్‌ పోరులో ముందే చుక్కలు కనబడుతున్నాయి. సర్పంచ్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి పార్టీ సింబల్స్‌తో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో అదే పరిస్థితి పునరావతమయ్యేలా కనబడుతోంది.

ఇప్పటికే పలాస మున్సిపాల్టీలో కౌన్సిలర్లుగా నామినేషన్‌ వేసిన నలుగురు టీడీపీ అభ్యర్థులు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస-కాశిబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాల్టీతో పాటుగా పాలకొండ నగర పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ పంచాయతీ ఎన్నికలకు మించిన ఫలితాలు వెలువడతాయనే భయం టీడీపీ నేతలకు పట్టుకుంది.

Also Read:కుంభారవి,ఫలించిన పదేళ్ల నిరీక్షణ

పాలకొండలో గతంలోనే ఎదురుదెబ్బ
టీడీపీకి గతేడాది నామినేషన్ల సమయంలోనే పాలకొండలో గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ తరపున ఐదు వార్డుల్లో పోటీకి అభ్యర్థులే ముందుకు రాలేదు. దీంతో 15 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసింది. తాజాగా జరిగిన నామినేషన్ల ఉపసంహరణ సమయంలో మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ రెండు వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవంమైంది. దీంతో టీడీపీ కేవలం 13 వార్డుల్లోనే ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ నగరపంచాయతీలో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 18 వార్డుల్లో 47 మంది బరిలో ఉన్నారు. వీరిలో వైసీపీ నుంచి 18 మంది, టీడీపీ తరపున 13, బీజేపీ ఏడుగురు, సీపీఐ ఒకరు, ఇండిపెండెంట్లు 8 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీతో పాటుగా బీజేపీ, సీపీఐ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు అంతగా ప్రజాధరణ కనిపించడం లేదు. దీంతో ఈ నగర పంచాయతీలో వైసీపీ విజయకేతనం ఎగురవేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

పలాసలోనూ సీన్‌ రిపిట్‌
పలాస మున్సిపాలిటీలో టీడీపీ తరఫున నాలుగో వార్డుకు నామినేషన్‌ వేసిన వాయిలపల్లి శ్రీనివాసరావు, 20వ వార్డుకు నామినేషన్‌ వేసిన బమ్మిడి వెంకటలక్ష్మి, 29వ వార్డుకు నామినేషన్‌ వేసిన సనపల దీప్తి ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. తాజాగా ఎనిమిదో వార్డుకు నామినేషన్‌ వేసిన రోణంకి మురళీకష్ణ కూడా వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. దీంతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు టీడీపీ డమ్మీ అభ్యర్థులతోనే ఎన్నికల బరిలో నిలచింది. టీడీపీ తన అభ్యర్థులు బరిలోంచి ఎక్కడ తప్పుకుంటారోనని భయపడి వారిని రహస్య ప్రదేశాలకు తరలించింది. ఇచ్ఛాపురంలో కూడా వైసీపీ జెండా ఎగురవేయడానికి పార్టీ శ్రేణులు తహతహలాడుతున్నారు. ఇక్కడ 23 వార్డులకు 54 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో వైసీపీ, టీడీపీ నేతలు బరిలో ఉన్నా వైసీపీకే ప్రజలు పట్టం కడతారంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:గంటా చేరికకు అంతా సిద్ధం...?

బీజేపీకీ అదే పరిస్థితి...
బీజేపీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. పలాసా మున్సిపాలిటీలోని 21వ వార్డుకు నామినేషన్‌ వేసిన దేవరశెట్టి బాలాజీ గుప్తా, 26వ వార్డుకు నామినేషన్‌ వేసిన మళ్లా రమ్య ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. ఒకటి రెండు చోట్ల నామినేషన్‌ వేసిన బీజేపీ అభ్యర్థులు కూడా బరిలో నుంచి తప్పుకుంటున్నారు.

ఫలించని టీడీపీ నేతల ఎత్తుగడలు
మాజీమంత్రి గౌతు శివాజీ ఆయన కూతురు గౌతు శిరీష, ఆ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి వజ్జ బాబూరావు, పట్టణ అధ్యక్షుడు లొడగల కామేశ్వరరావు యాదవ్ లాంటి నాయకులు పలాస-కాశిబుగ్గ మున్సిపాల్టీపై ప్రత్యేకంగా దృష్టి సారించినా ఫలితం కనిపించడ లేదు. పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 81.61 శాతం సర్పంచ్‌ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు.. పార్టీ గుర్తుపై జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించడం నల్లేరుపై నడకేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో సునాయాసంగా గెలుపు సాధించే పరిస్థితి కన్పిస్తుండటంతో టీడీపీ నేతలు ఎన్నికలకు ముందే హడలెత్తిపోతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp