ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ.. ఆ అడ్డంకిని అదిగమిస్తుందా..?

By Kotireddy Palukuri Aug. 15, 2020, 01:40 pm IST
ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ.. ఆ అడ్డంకిని అదిగమిస్తుందా..?

ఆంధ్రప్రదేశ్‌లో బలమైన రాజకీయ పార్టీగా ఎదగాలని జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భావిస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆ లోపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని ఆ పార్టీ వ్యూహకర్త, జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్ధేశం చేశారు.

బీజేపీ రాష్ట్ర నేతలు పెట్టుకున్న లక్ష్యం, జాతీయ నేత చేసిన దిశానిర్ధేశం.. అంతా బాగానే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎప్పుడు కూడా బీజేపీ సొంతంగా ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ పార్టీ నేతలు చెప్పినట్లుగానే ఏదో ఒక పార్టీకి జూనియర్‌ పార్టీగానే రాజకీయాలు చేసింది. మరో పార్టీ భుజంపై చేతులు వేసి ఎన్నికలకు వెళ్లింది. ఆ క్రమంలోనే సింగిల్‌ డిజిట్‌ సీట్లను గెలుచుకుంది. 2019 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి ఒక్క సీటు రాలేదు. మొత్తం పోలైన ఓట్లు 3.14 కోట్లు కాగా అందులో బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 2.68 లక్షలు మాత్రమే. మొత్తం ఓట్లలో ఇది 0.84 శాతం. ఇదీ ఏడాది క్రితం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి.

గత ఎన్నికల్లో ఈ విధంగా ప్రభావం చూపిన బీజేపీ వచ్చె ఎన్నికల్లో జనసేనతో కలసి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన 6.80 శాతం ఓట్లును సాధించింది. రెండు పార్టీలు కలిపి 7.68 శాతం ఓట్లు సాధించాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ 49.95 శాతం ఓట్లను పొందింది. ఇది మొత్తం పోలైన ఓట్లలో దాదాపు సగం. ఇక ప్రధాన ప్రతిక్షమైన టీడీపీ 39.17 శాతం ఓట్లను సాధించింది. బలమైన ఓటు, క్షేత్రస్థాయి కార్యకర్తల బలం ఉన్న వైసీపీ, టీడీపీలను ఢీకొట్టి బీజేపీ బలపడడం సాధ్యమా..? అనేది ప్రధాన ప్రశ్న.

నాయకత్వ లోపంతోపాటు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీని వెనక్కు నెట్టి ఆ స్థానంలో తాము రావాలని ఆశిస్తున్న బీజేపీకి.. అది అంత సులువు కాదని ఆ పార్టీ నేతలకు కూడా బాగా తెలుసు. అయితే టీడీపీ నేతలను ఆకర్షించినా.. ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఓ ప్రధాన అడ్డంకిని అధిగమించాల్సి ఉంది. అదే ప్రత్యేక హోదా. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఐదు ఏళ్లు అంటే.. కాదు కాదు పదేళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన పార్టీ బీజేపీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లు కాదు కదా.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటోంది.

కానీ ప్రత్యేక హోదా ఎప్పటికైనా సాధిస్తామని ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ధీమాగా చెబుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేనందున ఇవ్వకపోవచ్చని, కానీ ఏదో ఒక రోజు తప్పక ఆ పరిస్థితి వస్తుందని, ఆ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని స్వాతంత్ర దినోత్సవ వేడుకుల సందర్భంగా ఈ రోజు మాట్లాడిన సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై వైసీపీ స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు తాజాగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.

మరి బీజేపీ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలకు ఏమి చెబుతుంది..? హోదా బదులు ప్యాకేజీ ఇచ్చామని చెబుతుందా..? లేక గతంలో చెప్పినట్లు అది ముగిసిన అధ్యాయమని చెబుతుందా..? హోదా బదులు నిధులు భారీగా ఇచ్చామని చెబుతుందా..? ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రజల విశ్వాసం, ఓట్లు పొందేందుకు ప్రత్యేక హోదా అనే ప్రధాన అడ్డంకిని దాటాల్సి వస్తుందనేది ఆ పార్టీ నేతలు కూడా కాదనలేని వాస్తవం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp