స్పీకర్ నేతృత్వంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల సన్నాహాక సమావేశం

By Raju VS Nov. 28, 2020, 06:46 pm IST
స్పీకర్ నేతృత్వంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల సన్నాహాక సమావేశం

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సన్నాహాలు పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు లోబడి భద్రతా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ స్సీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ తో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను పోలీసు ఉన్నతాధికారులను అడిగి స్పీకర్ తెలుసుకున్నారు. శాసన సభ సమావేశాల భద్రతపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించినట్లు ఇంటెలిజెన్స్ ఓఎస్డీ శశిధర్ వివరించారు. సీఎం, ఇతర ముఖ్యుల కాన్వాయ్ ల రిహార్షల్స్ కూడా నిర్వహించామన్నారు. ముఖ్యంగా కొవిడ్ ను దృష్టిలో పెట్టుకుని... కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ రిపోర్టు వచ్చిన తరవాతే ప్రజాప్రతినిధుల భద్రతా సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందికి అనుమతిస్తున్నామన్నారు.

గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ, శాసన సభ సమావేశాలకనుగుణంగా ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను గుర్తించామన్నారు. ముఖ్యంగా సమావేశాలు జరిగే సమయంలో అసెంబ్లీ చుట్టు పక్కల ఎటువంటి ఆందోళనలు, అసాంఘిక కార్యాకలాపాలు జరగ్గకుండా గట్టి చర్యలు చేపట్టామన్నారు.

సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ, సమావేశాల దృష్ట్యా అసెంబ్లీ, చుట్టు పక్కల ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశాలు ప్రారంభం రోజున, ముగింపు రోజున ఎక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశముందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం కాన్వాయ్ రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ కె.రాజేంద్రనాథ్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీఎఫ్ కమాండెంట్ కె.ఎన్.రావు, విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసరావు, గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ, గుంటూరు అర్బన్ ఎస్పీ అంజిరెడ్డి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp