Punjab Congress Siddu - సీఎం ఎవరైనా.. సిద్ధూ తీరు అంతేనా?

By Ramana.Damara Singh Oct. 21, 2021, 04:00 pm IST
Punjab Congress Siddu - సీఎం ఎవరైనా.. సిద్ధూ తీరు అంతేనా?

రెండు నెలల క్రితం వరకు కెప్టెన్ అమరీందర్ సింగును ఇబ్బంది పెట్టారు. ఆయన్ను పదవి నుంచి తప్పుకునేలా చేశారు. అమరీందర్ స్థానంలో చరణ్ జిత్ చన్నీ వచ్చారు. అయినా పరిస్థితిలో మార్పు లేదు. సిద్ధూ తీరు మారలేదు. సీఎం ఎవరైనా ఆయన్ను సంతృప్తి పరచలేకపోతున్నారో.. ఆయనే తన అహాన్ని వీడలేకపోతున్నారో గానీ పంజాబు కాంగ్రెసులో పరిస్థితి మాత్రం కుదుటపడటంలేదు. పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ పోరుపడలేక తీవ్ర అసహనానికి గురైన సీఎం చరణ్ జిత్ ఒక దశలో రాజీనామాకు సైతం సిద్ధం కావడం రాష్ట్ర కాంగ్రెసులో అంతర్గతంగా చర్చనీయాంశం అయ్యింది.

నిన్న అమరీందర్ కు పొగ

గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని వీడి కాంగ్రెసులో చేరిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆ ఎన్నికల తర్వాత అమరీందర్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. కొద్దికాలానికే స్వపక్షంలో విపక్షంలా మారి సీఎం అమరీందర్ తో విభేదాలు పెంచుకున్నారు. తన వద్ద నుంచి కొన్ని శాఖలను తొలగించినందుకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేసి అసమ్మతి నేతగా మారారు.

మరికొందరు ఎమ్మెల్యేలను చేరదీసి సీఎం అమరీందర్ పై అదే పనిగా ఆరోపణలు చేయడంతో పాటు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఏడాదిన్నరకుపైగా కొనసాగిన అసమ్మతి పోరుతో పార్టీ పరువు పోయింది. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం ఇరువర్గాలతో చర్చలు జరిపి రాజీ మార్గంగా సిద్దూకు పీసీసి అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అప్పటికీ అసంతృప్తి చల్లారలేదు. సీఎం అమరీందర్ ను పదవి నుంచి తప్పించాలంటూ తెరవెనుక ఉండి మళ్లీ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. ఈ పరిణామాలతో విసిగిపోయిన సీఎం అమరీందర్ తానే రాజీనామా చేశారు. కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

Also Read : Punjab Amarinder -అమరీందర్ కొత్త పార్టీ.. బీజేపీతో కలిసి పోటీ

కొత్త సీఎంనూ కుదురుగా ఉండనీయడంలేదు.

అమరీందర్ ను తప్పించాలన్న తన కోరిక తీర్చుకున్న సిద్ధూ రెండు నెలల క్రితమే పదవి చేపట్టిన కొత్త సీఎం చరణ్ జిత్ చన్నీని కూడా కుదుటపడనివ్వడంలేదు. మంత్రివర్గ ఏర్పాటు సమయంలోనే తనకు నచ్చని ఒకరిద్దరికి పదవులు ఇచ్చారని అలిగి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తర్వాత వెనక్కి తగ్గారు. ఆ మధ్య ఒక సందర్భంలో కొత్త సీఎం చన్నీ వచ్చే ఎన్నికల్లో పార్టీని ముంచేస్తారని సహచర నేతల వద్దే వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల వీడియో ఆయనలోని అసంతృప్తిని బయటపెట్టింది. మొన్నటికి మొన్న సీఎంతో ప్రమేయం లేకుండా ఎన్నికల్లోగా కొన్ని కార్యక్రమాలు అమలు చేయాలంటూ 13 అంశాలతో కూడిన లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. కాగా రెండు రోజుల క్రితం పార్టీ ముఖ్యులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో అసహనానికి గురైన సీఎం చరణ్ జిత్.. సిద్దూకు గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం పదవి ఇచ్చేస్తాను.. రెండు నెలల్లో ఏం చేయగలరో చూపించండి.. నేనూ చూస్తాను.. అని సవాల్ విసిరారు.

ఒక దశలో పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధం అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి హరీష్ చౌదరి, రాహుల్ గాంధీ సన్నిహితుడు కృష్ణ అల్లవర, రాష్ట్ర మంత్రి పర్గత్ సింగ్ తదితరుల సమక్షంలోనే ఈ సంవాదం జరగడం విశేషం. వారు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ పరిణామాలన్నీ సిద్ధూ వ్యవహార శైలిని తెలియజేస్తున్నాయి. సీఎం అవడమే ఆయన అంతిమ లక్ష్యమని, అందుకోసం ఉన్నవారిని పనిచేయనివ్వకుండా చేస్తున్నారని కాంగ్రెసులో ఒక వర్గం ఆరోపిస్తోంది. ఆయన వల్లే ఎన్నికల్లో పార్టీకి చేటు తప్పదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

Also Read : Punjab Elections Siddu -సిద్దూ కుమార్తె పొలిటికల్‌ ఎంట్రీ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp