నంద్యాల మున్సిపాలిటీది ప్రత్యేక స్థానం

By Guest Writer Mar. 06, 2021, 08:00 pm IST
నంద్యాల మున్సిపాలిటీది ప్రత్యేక స్థానం

కర్నూలు జిల్లాలో నంద్యాల మున్సిపాలిటీది ప్రత్యేక స్థానం. పురపాలిక ఏర్పడినప్పటి నుంచి టీడీపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటోంది. ముందుగా నంద్యాల పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేవి నంద్యాల నంది పైపులు. నంది బ్రాండ్ కి విపరీతమైన పేరు, ప్రఖ్యాతలు రావడం వెనక ఆ సంస్థ చైర్మన్ దివంగత ఎస్పీవై రెడ్డిదే ముఖ్య పాత్ర.

ఎస్పీవై రెడ్డి 1999 ఎన్నికల్లో మొదటిసారిగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి 3825 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఫరూక్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో కాంగ్రెస్ లో చేరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. తరువాత అనూహ్యంగా 2004 ఎన్నికల్లో నంద్యాల ఎంపీ టికెట్ సాధించుకొని టీడీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మీద సుమారు లక్షా పదివేల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తరువాత 2009, 2014 లో విజయం సాధించి హాట్రిక్ నమోదు చేశారు.

ప్రస్తుతం ఎన్నికలు ఆయన లేకుండానే జరుతున్నాయి. 2019లో ఆయన తన కుటుంబంతో సహా జనసేన కండువా కప్పుకున్నారు. అనారోగ్యంతో ఆయన కన్నుమూయడంతో ఆ కుటుంబం ప్రస్తుతం ఎన్నికలకు దూరంగా ఉంటోంది. ఆయన అల్లుడు శ్రీధర్ రెడ్డి జనసేనలోనే ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

ఇక, మున్సిపాలిటీ విషయానికి వస్తే అధికార వైసీపీ ఫుల్ జోష్ లో ఉంది. చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించడంతో ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రా రెడ్డి తన సతీమణి శిల్పా నాగిణి రెడ్డిని బరిలోకి దించారు. ఈమె 36వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇక్కడున్న 42 వార్డుల్లో 12 వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 30 వార్డుల్లో వైసీపీ అన్నింటిలో పోటీ చేస్తుండగా, టీడీపీ 27 వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక జనసేన ఒకే ఒక వార్డులో, బీజేపీ 6 వార్డుల్లో పోటీ చేస్తోంది.

టీడీపీ 27 వార్డుల్లో పోటీ చేస్తోన్నా గెలిచే స్థానాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఆ పార్టీ ఇంచార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికలను లైట్ తీసుకున్నారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన కిడ్నాప్ కేసులో తన సోదరి భూమా అఖిల అరెస్ట్ అవ్వడం... ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీపై అసంతృప్తితో వున్నారు. దీనితో కౌన్సిలర్ అభ్యర్థులు కూడా విజయంపై పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp