బిజెపికి శరద్ పవార్ హెచ్చరికలు..చురకలు

By Jagadish J Rao Jul. 12, 2020, 08:30 am IST
బిజెపికి శరద్ పవార్ హెచ్చరికలు..చురకలు

దేశంలో సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన ఎన్సీపి అధినేత శరద్ పవార్ బిజెపికి, ఆపార్టీ నేతలకు గట్టిగా హెచ్చరించారు. దేశంలో ఎన్నికల్లో ఉద్ధండులే ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు. ఇది పరోక్షంగా విర్రవీగిపోతున్న బిజెపి నేతలకు వేసిన చురకలే. అధికారం దాహంతో ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నం చేసే వారిని గట్టి సమాధానమని రాజకీయ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.
ఇందిరా గాంధీ, వాజ్‌పాయ్ లాంటి ఉద్ధండులే ఎన్నికల్లో ఓటమిని చవి చూశారని, ప్రజలెప్పుడూ తమవైపే ఉంటారన్న అతి నమ్మకం పనికిరాదని చురకలంటించారు. ఓ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ... తిరిగి తాము అధికారంలోకి వస్తామని ప్రకటించారు.

ఈ వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందిస్తూ... బిజెపి అహంకార పూరితంగా ఉందని ఓటర్లు భావించారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్ల భావన అని పవార్ పేర్కొన్నారు.‌ ‘‘ప్రజాస్వామ్యంలో మీరే శాశ్వతంగా అధికారంలో ఉంటారని అనుకోలేరు. ఓటర్లను పట్టించుకోని పక్షంలో వారు మిమ్మల్ని ఖాతరు చేయరు.  ప్రజల్లో అశేష ప్రజాదరణ ఉన్న ఇందిరా గాంధీ, వాజ్‌పాయ్‌కే ఎన్నికల్లో ఓటమి తప్పలేదు" అని పవార్ బిజెపిని హెచ్చరించారు. ఓ రాజకీయ నేత కంటే సామాన్యుడే అత్యంత తెలివిగా ఉంటాడని, మనం హద్దులు దాటితే ప్రజలు తగిన బుద్ధి చెప్పి తీరుతారని హెచ్చరించారు.

రిమోట్ కంట్రోల్ పనిచేయదు

మహా వికాస్ అగాఢీ ప్రభుత్వంలో భేదాభిప్రాయాలున్నట్లు కొన్ని తప్పుడు ప్రచారాలు ప్రచారంలోకి వచ్చాయని, తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాల్లేవని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో శివసేన కూటమి అధికారంలోకి రావడం అనుకోకుండా ఏమీ జరగలేదని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రకారం ప్రజలు ఓట్లు వేశారని, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజల ధోరణి మారిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతంగా దూసుకెళ్లిన బిజెపి, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లా పడిందన్నారు. మహారాష్ట్ర ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని పవార్ తెలిపారు. 

మహా వికాస్ అగాఢీలో తానేమీ '‘హెడ్ మాస్టర్’'ను కాదని శరద్ పవార్ స్పష్టం చేశారు. తాను రిమోట్ కంట్రోల్ అంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టి పారేశారు. ‘‘నేను హెడ్ మాస్టర్ని కాదు. అవన్నీ పాఠశాలల స్థాయిలో ఉంటాయి. ప్రజాస్వామ్యంలో అయినా, ప్రభుత్వాన్ని నడిపే విషయంలోనైనా ‘రిమోట్ కంట్రోల్’ పనిచేయదు. ప్రజాస్వామ్యం లేని ప్రదేశాల్లో మాత్రం ఈ రిమోట్ కంట్రోల్ పనిచేస్తుంది’’ అని పవార్ స్పష్టం చేశారు.
కరోనా సమయంలో ఉద్ధవ్ అత్యంత జాగరూకతతో వ్యవహరించి, అలాగే లాక్‌డౌన్ అమలు చేసి, జాగ్రత్తగా వ్యవహరించారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలను సడలించే విషయంలో తనకూ, ప్రభుత్వానికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి పద్ధతి ప్రకారం నిబంధనలను సడలించామని, ఈ విషయంపై చాలా మందితో చర్చించామని, ముఖ్యమంత్రి ఉద్ధవ్ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు.

‘‘నాకు, సిఎం ఉద్ధవ్ భిన్నాభిప్రాయాలు ఉన్నాయనడం శుద్ధ తప్పు. ఆ సమయంలో నేను సిఎంతోనే ఉన్నాను. ఈ రోజు కూడా ఆయన వెన్నంటే ఉన్నాను. ఆ సమయంలో కార్మిక సంస్థలు, వ్యాపార యజమానులు, తదితరులతో చర్చలు జరిపాను. వాటి ఆధారంగానే నేను ఓ అభిప్రాయానికి వచ్చాను. దానిని సిఎం దృష్టికి తీసుకెళ్లాను. దీనిని భిన్నాభిప్రాయం అని అనరు. ఢిల్లీ, కర్ణాటకలో నిబంధనలను సడలించారు. తరువాత పరిణామాలను చవి చూశారు. అయినా సరే.. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అలాంటి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిందో... రాబోయే తరాలు కరోనా కంటే అధిక ప్రమాదాన్నే ఎదుర్కునే అవకాశం ఉంది.’’ అని శరద్ పవార్ తెలిపారు. నిబంధనలను సడలించే విషయంలో సీఎం ఠాక్రే ఆలస్యం చేశారని అందరూ భావించారని, కానీ ఆయన సరైన సమయంలోనే సడలించారని శరద్ పవార్ ప్రశంసించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp