సియోల్ మేయ‌ర్ ఆత్మ‌హ‌త్య‌...! :క్ష‌మించండంటూ సూసైడ్ నోట్‌

By Jagadish J Rao Jul. 12, 2020, 06:59 pm IST
సియోల్ మేయ‌ర్ ఆత్మ‌హ‌త్య‌...! :క్ష‌మించండంటూ సూసైడ్ నోట్‌

ఆయనో దేశానికి కాబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీలో ఉండే అభ్యర్థి. ప్రస్తుతం ఆ దేశంలో ప్రముఖ నగరానికి మేయర్‌గా ఉన్నారు. ఆ దేశంలో సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరు. కాని లైంగిక ఆరోపణలు వస్తే...ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను క్షమించండంటూ సూసైడ్ నోట్ కూడా రాసి మరి ఈ‌ ఆత్మహత్య చేసుకున్నారు.
ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడి రేసులో ఉన్న వ్య‌క్తి, సియోల్ న‌గ‌ర మేయ‌ర్ పార్క్‌-వోన్‌-సూన్ (64) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చిన మ‌రుస‌టి రోజే పార్క్ త‌నువు చాలించారు. న‌గ‌రంలోన ఓ ప‌ర్వ‌త ప్రాంతంలో పార్క్ మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంత‌రం మేయ‌ర్ అధాకారిక‌ నివాసంలో ల‌భ్య‌మైన‌ సూసైడ్ నోట్‌ను అధికారులు విడుద‌ల చేశారు. 

‘'ప్ర‌తి ఒక్కరూ న‌న్ను క్ష‌మించండి. నా సుదీర్ఘ జీవితకాలంలో నాతో పాటు ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. అత్యంత బాధ క‌లిగించినందుకు నా కుటుంబస‌భ్యులు కూడా న‌న్ను క్ష‌మించండి'' అని సూసైడ్ నోట్‌‌లో పార్క్ పేర్కొన్నాడు. అయితే, త‌న‌పై వ‌చ్చిన‌ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఎలాంటి విష‌యాల‌నూ నోట్‌‌లో మేయ‌ర్ ప్ర‌స్తావించ‌లేదు.

సియోల్‌ మేయ‌ర్ త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ మాజీ కార్య‌ద‌ర్శి ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కార్యాల‌య స‌మ‌యంలోనే త‌న‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించేవాడ‌ని, 2015 నుంచి మేయ‌ర్‌కు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన‌ మ‌హిళ త‌న ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మేయ‌ర్ పార్క్‌పై కేసు న‌మోదైంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మీటూ (#MeToo) ఉద్య‌మంలో భాగంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎంతోమంది మ‌హిళ‌లు స్వ‌యంగా వారి అనుభ‌వాల‌ను తెలుపుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ప‌లుకుబ‌డి, ఉన్న‌తస్థానంలో ఉన్న‌వారు ఎంద‌రో ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఘ‌ట‌న‌లు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. 

దీనిలో భాగంగా ద‌క్షిణ కొరియాలోనూ గ‌త‌ రెండు సంవ‌త్స‌రాలుగా మీటూ (#MeToo) ఉద్య‌మం ఊపందుకుంది. ఇప్ప‌టికే  లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు రుజువుకావ‌డంతో ఓ గ‌వ‌ర్న‌ర్ స్థాయి వ్య‌క్తి జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది.

ద‌క్షిణ కొరియాలో ప్ర‌స్తుతం అధికారపార్టీలో కీల‌క నాయ‌కుల్లో పార్క్ ఒక‌రు. దేశంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన సియోల్‌ న‌గరానికి గ‌డిచిన‌ ద‌శాబ్దం నుంచి పార్క్‌-వోన్‌-సూన్ మేయ‌ర్‌గా సేవ‌లందిస్తున్నారు. లింగ స‌మాన‌త్వం, సామాజిక స‌మాన‌త్వాన్ని ప్రోత్స‌హించే పార్క్ గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ గెలుపొందారు. అంతేకాకుండా 2022లో జ‌రిగే దేశాధ్య‌క్షుడి రేసులో కూడా ఉన్నారు. 

మాన‌వ హ‌క్కుల న్యాయ‌వాదిగా పేరుగాంచిన పార్క్.. విద్యార్థి సంఘం నాయ‌కుడిగా త‌న ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టాడు. అయితే, పార్క్ ఆత్మ‌హ‌త్య‌పై దేశ‌వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. శిక్ష నుంచి త‌ప్పించుకోవడానికే పార్క్ ఇలా చేశార‌ని కొంద‌రు విమ‌ర్శిస్తే.. మేయ‌ర్ పార్క్‌ ఒక అద్బుత‌మైన రాజ‌కీయ నాయ‌కుడంటూ అక్క‌డి కొన్ని ప‌త్రిక‌లు, మ‌ద్ద‌తుదారులు కీర్తించ‌డం గ‌మ‌నార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp