తెలంగాణ ధిక్కారం బూర్గుల నర్సింగరావు

By Kalyan.S Jan. 18, 2021, 09:10 pm IST
తెలంగాణ ధిక్కారం బూర్గుల నర్సింగరావు

తొలి తరం విద్యార్థి ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కమ్యూనిస్టు నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా బూర్గుల నర్సింగరావు సుపరిచితులు. బంధుత్వాల కంటే రాజకీయ విశ్వాసాలకే విలువనిచ్చిన అరుదైన వ్యక్తిత్వం నర్సింగరావుది. నిజాం వ్యతిరేక పోరాటం నుంచి ప్రస్తుత పాలక విధానాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసే వరకు ఆయనెప్పుడూ ప్రజల పక్షమే నిలబడ్డారు.

బూర్గుల నర్సింగరావు నిఖార్సయిన కమ్యూనిస్టు నాయకుడు. తెలంగాణలో నిజాం సర్కారు పట్ల కాంగ్రెస్ మెతక వైఖరిని జీర్ణించుకోలేని వారు కమ్యూనిస్టులతో కలిసి నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అలా గ్రామీణ ప్రాంతాల్లో పెల్లుబికిన రైతాంగ ఉద్యమానికి సమాంతరంగా పట్టణాల్లోనూ వేరు వేరు సమూహాలను కమ్యూనిస్టులు ఏకం చేశారు. హైదరాబాద్ నగరంలో మగ్దూం మొహియుద్దీన్, రాజ్ బహదూర్ గౌర్ తదితరులు హైదరాబాద్ కామ్రేడ్స్ అసోసియేషన్‌, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ను ఏర్పాటు చేశారు. ఆ ఉద్యమంలో బూర్గుల నర్సింగరావు కీలకంగా వ్యవహరించారు.

విద్యార్థి నాయకుడిగా

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లోనే నర్సింగరావు విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పనిచేసేవారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలా కమ్యూనిస్టు రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అండగా నిలిచారు. ఉద్యమంలో భాగంగా అండర్ గ్రౌండ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన అరెస్టయి కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. జైలు నుంచి వచ్చాక తిరిగి కాలేజ్‌లోకి అనుమతించలేదు. దీంతో బూర్గుల రామకృష్ణారావు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఉత్తరం రాశారు. అయినా అటెండెన్స్ లేకుండా ఏలా అనుమతిస్తామని నిరాకరించారు. తరువాత పరీక్షలు రాసి చదువులు కొనసాగించారు.

తెలంగాణ ఉద్యమం

హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తమ్ముడి కొడుకు నర్సింగరావు. కానీ రాజకీయంగా ఇద్దరివీ వేరు వేరు దారులు. ఒకరవి కాంగ్రెస్ రాజకీయాలు. మరొకరివి కమ్యూనిస్టు రాజకీయాలు. నర్సింగరావు బంధుత్వం కంటే రాజకీయ విశ్వాసాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్వంత పెదనాన్నకు వ్యతిరేకంగానే ఉద్యమించారు. బూర్గుల నర్సింగరావు తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. 1952లో ముల్కీ ఉద్యమం నాటికి నర్సింగరావు నిజాం కాలేజ్‌లో ఎంఏ చదువుతున్నారు. ముల్కి నిబంధనలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. సిటీ కాలేజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఈఎన్‌టీ హాస్పిటల్ చేరేసరికి అక్కడ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కారు కనిపించింది. విద్యార్థులు ఆవేశంతో ఆ కారును తగలబెట్టారు.

కమ్యూనిస్టు రాజకీయాలు కలిగిఉన్నందున అతడు ప్రభుత్వ ఉద్యోగానికి దూరం కావల్సి వచ్చింది. దీంతో ప్రైవేటు లెక్చరర్ గా వృత్తిని కొనసాగించారు. బూర్గుల నర్సింగరావు కేవలం ఉద్యమకారుడు మాత్రమే కాదు... సాహితీ ప్రియుడు కూడా. నిరంతర అధ్యయనం ఆయన లక్షణం. మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ నర్సింగరావు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాతి పరిణామాల పట్ల ఆయనకు అసంతృప్తి ఉంది. హైదరాబాద్ కేంద్రంగా జరిగే మత రాజకీయాలను ఆయన ఎప్పుడూ వ్యతిరేకించే వారు.

పలువురి సంతాపం

నర్సింగరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లోనూ నర్సింగ రావు పాత్ర మరువలేనిదని అన్నారు. ఎన్నో కమ్యూనిస్టు, ప్రగతిశీల ఉద్యమాలను బూర్గుల ముందుండి నడిపించారని కొనియాడారు. నర్సింగరావు మరణం తీరని లోటన్నారు. నర్సింగరావు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన యోధుడు బూర్గుల అని రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీఆర్ కొనియాడారు. తెలంగాణకు ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు మంత్రి హరీష్ రావు. సిపిఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, నారాయణ తదితరులు బూర్గులకు నివాళి అర్పించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp