గుడ్ బై : త‌మిళ‌నాట చిన్న‌మ్మ సంచ‌ల‌న నిర్ణ‌యం

By Kalyan.S Mar. 04, 2021, 07:30 am IST
గుడ్ బై : త‌మిళ‌నాట చిన్న‌మ్మ సంచ‌ల‌న నిర్ణ‌యం

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌కు ఇటీవ‌లే నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అంత‌కు నెల‌లు ముందు నుంచే అక్క‌డ రాజ‌కీయ పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. రంగంలోకి బీజేపీ కూడా దిగింది. ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టింది. ఇదే క్ర‌మంలో సుదీర్ఘ‌కాలంగా జైల్లో ఉన్న శశిక‌ళ కూడా ఎన్నిక‌ల వేళ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ప‌రిణామాల‌న్నీ త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పాయి.

పార్టీల‌న్నీ ఎన్నో వ్యూహాలు, ఎన్నో ఎత్తులు, పొత్తులపై స‌మాలోచ‌న‌లు చేస్తున్న వేళ శ‌శిక‌ళ అనూహ్య నిర్ణ‌యం రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. జ‌య‌ల‌లిత నెచ్చెలి, త‌మిళ‌నాట చిన్న‌మ్మ‌గా పేరొందిన శ‌శిక‌ళ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు అధికార దాహం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణ‌యం వెనుక ఉన్న అస‌లైన కార‌ణాలపై రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

విడుద‌లైన‌ప్ప‌టి నుంచీ తీవ్రంగా మంత‌నాలు
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ జ‌న‌వ‌రి 27న జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె విడుద‌ల‌తో తమిళనాట ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందిరిలోనూ ఆసక్తి ఏర్ప‌డింది. అప్పటిదాకా అన్నాడీఎంకే-బీజేపీ కూటమి వర్సెస్ డీఎంకే- కాంగ్రెస్ కూటమి అనుకున్న పోటీ కాస్తా ఆమె రాకతో త్రిముఖ పోటీ తప్పదన్నట్లుగా కథనాలొచ్చాయి. దీనికి తోడు ఆమె తిరిగి అన్నాడీఎంకేలోకి రావాలని కొందరు, వద్దని మరికొందరు నాయకులు వాదులాడుకోవడం ప్రారంభించారు.

దీంతో అన్నాడీఎంకే- బీజేపీ కూటమి విజయావకాశాలకు చెక్ పడుతుందని అంతా అంచనా వేశారు. అంద‌రి అంచ‌నాలు, చ‌ర్చ‌లకు త‌గ్గ‌ట్లుగానే శ‌శిక‌ళ అడుగులు కూడా ప‌డేవి. జైలు నుంచి విడుద‌లైన ఆమె బెంగళూరులోని ఓ ఫాం హౌస్ వేదికగా రీ ఎంట్రీకి స‌ర్వం సిద్ధం చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. కొంద‌రు ప్ర‌ముఖులు, న్యాయ నిపుణుల‌తో ఆమె త‌ర‌చూ చ‌ర్చ‌లు జ‌రుపుతుండ‌డంతో రీ ఎంట్రీ ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. ఫాం హౌస్‌ వద్దకు భారీగా ఆమె మద్దతుదారులు, కార్యకర్తలు కూడా త‌ర‌లివెళ్లేవారు.

భారీగా స్వాగ‌త ఏర్పాట్లు
శ‌శిక‌ళ సాదాసీదాగా త‌మిళ‌నాడులో అడుగుపెట్ట‌లేదు. రాజ‌కీయాల్లో, ప్ర‌ధానంగా అన్నాడీఎంకే పార్టీలో పెనుమార్పులు సృష్టిస్తార‌న్న‌ట్లుగానే ఆమె రంగ‌ప్ర‌వేశం జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 8న మందీమార్బలంతో బెంగళూరు నుంచి భారీ ఏర్పాట్ల నడుమ చెన్నై నగరానికి చేరుకున్నారు. శశికళకు దారిపొడవునా స్వాగత సత్కారాలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం కార్యకర్తలంతా తరలివ‌చ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే శశికళ విడుదల అవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్న నాటి నుంచే తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆమె నేరుగా అడ్డుగుపెడుతున్న సందర్భంలో ఇప్పటికే అన్నాడీఎంకేలో అనుమానాలు మొదలయ్యాయి. ఆమె స్వాగ‌త ఏర్పాట్ల‌కు కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. ఆమె వెంట వందల సంఖ్యలో పార్టీ ప్రముఖులు కార్లలో ర్యాలీ నిర్వ‌హించారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతం అత్తిపల్లి నుంచి చెన్నై దాకా సుమారు ఐదు వేలమంది పోలీసులు ఆమెకు భద్రతా ఏర్పాట్లు చేశారు. అవ‌న్నీ గ‌మ‌నిస్తే ఆమె రాజ‌కీయంగా కీల‌క అడుగులు వేయ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు.

అనూహ్య నిర్ణ‌యం వెనుక‌...
శ‌శిక‌ళ చెప్పిన‌ట్లు ఆమెకు అధికార దాహం లేద‌నుకుందాం. రాజ‌కీయాల‌పై ఆస‌క్తి కూడా లేదనుకుందాం. అలాంట‌ప్పుడు త‌మిళ‌నాడుకు రావ‌డానికి అంత హంగామా ఎందుకు సృష్టించిన‌ట్లు అనేది స‌మాధానం లేని ప్ర‌శ్న. అలాగే అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపై కోర్టుకు కూడా వెళ్లే ఆలోచ‌న‌లు ఎందుకు చేసిన‌ట్లు అనేది చ‌ర్చ‌గా మారింది. డీఎంకేను ఢీ కొట్టాలంటే అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో ఐక్యత తప్పనిసరని కమలనాథులతో పాటు అన్నాడీఎంకేలో సీనియర్ నేతలు నిర్ణయించారు.

ఈ క్ర‌మంలోనే ఏం జరిగిందో ఏమో శశికళ ఒక్కసారిగా తన నిర్ణయం మార్చుకున్నారు. రాజకీయాలనుంచే పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీని వెనుక బీజేపీ ఒత్తిడి ఉందా అనే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. ఆమె రాక‌తో అన్నాడీఎంకే లో క‌ల‌క‌లం ఏర్ప‌డింది. ఇది త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతాయ‌ని అన్నాడీఎంకే - బీజేపీ కూట‌మిలోని ఓ వ‌ర్గం అభిప్రాయం ప‌డుతోంది. ఇటువంటి త‌రుణంలో శ‌శిక‌ళ రాజ‌కీయాలకు గుడ్ బై చెప్ప‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp