సచిన్ పైలట్ ధిక్కారస్వరం, అగ్గిరాజేస్తున్న జ్యోతిరాదిత్య

By Raju VS Jul. 12, 2020, 09:43 pm IST
సచిన్ పైలట్ ధిక్కారస్వరం, అగ్గిరాజేస్తున్న జ్యోతిరాదిత్య

రాజస్తాన్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ కి కొత్త కష్టాలు తెస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో వర్గపోరు చివరకు అధికారం కోల్పోవడానికి కారణం అయ్యింది. పాత, యువ నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరి మధ్యప్రదేశ్ తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి రాజస్తాన్ లో ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంతో కాంగ్రెస్ అదిష్టానం సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించడం లేదు. చివరకు అసమ్మతి నేతగా ఉన్న సచిన్ పైలట్ తిరుగుబాటు తారస్థాయికి చేరుతున్నట్టు చెప్పవచ్చు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా తరహాలోనే ఆయన పయనం ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ చేతిలోంచి మరో రాష్ట్రం కోల్పోవడం ఖాయమనే అబిప్రాయం వినిపిస్తోంది.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తీరుతో సచిన్ పైలట్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఏడాదిన్నరగా పాలనలో ఉన్న ప్రభుత్వంలో తనకు తగిన న్యాయం జరగలేదని పైలట్ రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేస్తే అధిష్టానం మాత్రం భిన్నంగా ఆలోచించి గెహ్లట్ ని గద్దెనెక్కించడంతో నాటి నుంచి గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం తిరుగుబాటు సంకేతాలు పంపించారు. దాంతో అప్రమత్తమయిన కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు ప్రారంబించింది. వారం రోజులుగా జైపూర్ రాజకీయం వేడెక్కేంది. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో కాంగ్రెస్ అంతర్గత పోరు చల్లారేలా కనిపించడం లేదు.

ఇప్పటికే సచిన్ పైలట్ కి 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దాంతో మధ్యప్రదేశ్ లో 23 మంది ఎమ్మెల్యేలతో కలిసి జ్యోతిరాదిత్యా సింధియా చేసిన ప్రయత్నమే పైలట్ ప్రారంభించారా అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ పాత్ర మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పైలట్ వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. బీజేపీ పొలిటికల్ గేమ్ కారణంగానే కాంగ్రెస్ లో పరిస్థితులు మారుతున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ తరహాలో రాజస్తాన్ లో కూడా అధికారం దక్కించుకునేందుకు బీజేపీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని చెబుతోంది. అదే పరంపరలో జ్యోతిరాదిత్యా ట్వీట్ ఆసక్తిగా మారింది. యువనాయకుడికి అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకనాటిన తన సహచరుడిని విస్మరించడం విచారకరం అంటూ వ్యాఖ్యానించారు. తద్వారా రాజస్తాన్ రాజకీయాల్లో వేడి పెంచే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలట్ తో పాటుగా సీఎంని కూడా పిలిచి సంయుక్త సమావేశానికి ప్రయత్నం చేసినప్పటికీ సచిన్ గైర్హాజరయ్యారు. రేపటి రాజస్తాన్ సీఎల్పీ మీటింగ్ కి కూడా ఆయన వర్గీయులు దూరం కావాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అశోక్ గెహ్లట్ కూడా బీజేపీ కుయత్నాలకు పాల్పడుతోందని, విచారణ కూడా చేస్తామంటూ చెబుతున్నారు. తన వర్గీయులతో కలిసి కాంగ్రెస్ సమావేశాలకు కూడా హాజరుకాకూడదని సచిన్ పైలట్ నిర్ణయం తీసుకవోడంతో ఇక బహిరంగ తిరుగుబాటుగానే కనిపిస్తోంది. రాజస్తాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది. చివరకు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందన్నదే ఆసక్తికరంగా మారింది. కరోనా వేళ వరుసగా ప్రభుత్వాలు మారుతున్న తీరు కాంగ్రెస్ ని కలవరపెడుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp