ఢిల్లీకి సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు: రాజస్థాన్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం

By Jagadish J Rao Jul. 12, 2020, 03:03 pm IST
ఢిల్లీకి సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు: రాజస్థాన్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం


కాంగ్రెస్, ఇతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను పడగొట్టేందుకు బిజెపి వేట కొనసాగుతుంది. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ మద్దతుతో ఉన్న ప్రభుత్వాలను కూల్చి బిజెపి అధికారంలోకి‌ వచ్చింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజకీయ అనిశ్చితకు బిజెపి ప్రయత్నించింది. అందులో విజయవంతమై కొత్త సంస్కృతిని నెలకొల్పింది.‌ ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ పై బిజెపి కన్ను పడింది.

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా తన 23 మంది విశ్వాసపాత్రులైన ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలో చేరిన కారణంగా అక్కడి కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి కూలిపోయింది. అనంతరం మూడు నెలలకే రాజస్థాన్‌లో కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలో ఉంది.

రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఒకప్పుడు రాష్ట్ర అత్యున్నత పదవి ముఖ్యమంత్రి పీఠానికి పోటీదారుడు. ఆయన తన వర్గ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ఉన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన పార్టీ నాయకత్వంతో మాట్లాడవచ్చని వర్గాలు తెలిపాయి.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ పరిస్థితి గురించి వివరించాడనికి ఢిల్లీలో ఉన్నట్లు చెబుతున్నారు. "రాజస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులపై సోనియా గాంధీకి వివరిస్తారు. విభేదాలు ఏమైనప్పటికీ అందరూ కలిసి పని చేయాలి" అని పార్టీ అంతర్గత వ్యక్తి పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలకు చేసిన విధంగా కోట్లు ఎరజూపి బిజెపి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. డబ్బును ఆఫర్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలను అవినీతి నిరోధక శాఖ ప్రశ్నిస్తోంది.

"మధ్యప్రదేశ్ పరిస్థితి మళ్లీ జరగడానికి మేము అనుమతించబోం. మాకు నమ్మకం ఉంది" అని పార్టీలోని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. "మా ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోంది. కేంద్రం, బిజెపి చాలా డబ్బు ఆఫర్ చేస్తున్నాయి" అని వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపి ఎమ్మెల్యేలకు రూ.15 కోట్ల వరకు లేదా "ఫేవర్స్" ను ఆఫర్ చేస్తోందని ఆరోపించారు. "ఎమ్మెల్యేలకు తమ వైపు రావడానికి బిజెపి డబ్బు ఇస్తున్నట్లు మేము వింటున్నాము. కొంతమందికి రూ.15 కోట్ల వరకు వాగ్దానం చేశారు. మరికొందరు ఇతర సహాయాల గురించి హామీ ఇచ్చారు. వారు మొదట రహస్యంగా ఏమి చేశారో...అవి ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నారు. మీరు దీనిని గోవాలో చూశారు. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చూశారు"అని గెహ్లాట్ అన్నారు.

2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి పదవికి పోటీదారుగా ఉన్న సచిన్ పైలట్‌కు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవి కట్టబెట్టారు. అలాగే ఐదు మంత్రిత్వ శాఖలతో కూడిన ఉప ముఖ్యమంత్రిని కూడా కేటాయించారు.

అయితే అప్పటి నుండే సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మధ్య విభేదాలు పుట్టుకొచ్చాయి. అప్పటి నుండి ఆ విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి.‌ వివిధ సందర్భాల్లో ఆ విభేదాలు బయటపడ్డాయి.‌ ఇరువురు బహిరంగ విమర్శలకు దిగారు.

ఎమ్మెల్యేలను బిజెపి భయభ్రామతులకు గురిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, రాజస్థాన్ పోలీసుల అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు.

దక్షిణ రాజస్థాన్‌లోని కుశాల్‌ఘర్ కు చెందిన ఎమ్మెల్యే..బిజెపిని సంప్రదించిన వారిలో ఒకరిగా పేరు పొందారు. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.

200 ఎమ్మెల్యే స్థానాలు గల రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌ 107 స్థానాలను కలిగి ఉంది. అలాగే 12 మంది స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా కాంగ్రెస్‌కు ఉంది. అదనంగా ఇతర పార్టీల నుండి ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు గెహ్లాట్ ప్రభుత్వానికి ఉంది. ఎమ్మెల్యే స్థానాలున్న సిపిఎం, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), భారతీయ ట్రైబుల్ పార్టీలు కాంగ్రెస్ సర్కార్ కు మద్దతు ఇస్తున్నాయి.

గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలకు ముందు, మార్చిలో మధ్యప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులకు కలవరపడని కాంగ్రెస్ ముందస్తుగానే స్పందిస్తుంది. గుజరాత్‌లో ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న కాంగ్రెస్...రాజ్యసభ ఎన్నికల్లో తన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించింది. దీనికి రెండు రోజుల ముందు గెహ్లాట్ మాట్లాడుతూ "బిజెపి తమ ఎమ్మెల్యేలకు రూ.25 నుండి రూ.30 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నివేదికలు విన్నాను" అని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బిజెపి తన ప్రయత్నలను ముమ్మరం చేసింది. కాంగ్రెస్ కూడా వేగవంతంగా స్పందిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి ‌నేతల మధ్య ‌మాటల యుద్ధం జరుగుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp