మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఏ దారిలో నడవబోతున్నారు..?

By Ritwika Ram Jul. 23, 2021, 06:00 pm IST
మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఏ దారిలో నడవబోతున్నారు..?

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా 9 ఏళ్లు పని చేసి మంచి పేరుతో పాటు వివాదాలను కొనితెచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆరేళ్ల పదవీ కాలం ఉండగానే వీఆర్ఎస్ తీసుకుని సంచలనం రేపిన విషయం తెలిసిందే కదా. ఆయన అలా రాజీనామా చేశారో లేదో.. ఇలా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. టీఆర్ఎస్ లోకి చేరుతారని, హుజూరాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తారని పుకార్లు లేచాయి. హుజూరాబాద్ లో పోటీపై, టీఆర్ఎస్ లో చేరికపై వచ్చినవి పుకార్లేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొట్టి పారేశారు. అయితే పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తాజాగా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని, అయితే ఎప్పుడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేనన్నారు.

ఎవరూ ఆహ్వానించలేదట..

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ చేరతారని.. కాదు.. బీఎస్పీలో చేరతారని, ఈ రెండు కాకుండా సొంతంగా పార్టీ పెడతారని ప్రచారాలు జరుగుతున్నాయి. తనకు ఏవేవో పొలిటికల్ పార్టీల నుంచి పిలుపులు వచ్చినట్టు ప్రచారం జరుగుతోందని, తనకు ఏ రాజకీయ పార్టీ నుండి పిలుపు రాలేదని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చినట్లు, హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నట్లు వస్తున్నవార్తలు అన్నీ అవాస్తవాలని క్లారిటీ ఇచ్చేశారు.

ఆయన ఇంతటితో ఆగలేదు. పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దళితులకు మూడెకరాలు, పేదలకు ఇండ్లు ఇస్తే సరిపోదని.. వారిని జీవితంలో ఉన్నత స్థితికి తీసుకురావాలని అన్నారు. తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదని కూడా విమర్శించారు. కేసీఆర్ పైలట్ ప్రాజెక్ట్ గా లాంచ్ చేయబోతున్న దళిత బంధు పథకంపై చర్చలో పాల్గొనడానికి తనకు పిలుపు రాలేదని కూడా చెప్పారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి, ఆయనకు మధ్య గ్యాప్ వచ్చిందనే వాదనలకు బలం చేకూర్చినట్లు అయింది.

Also Read : ఆ సీనియర్ నేత బీజేపీలోనూ ఇమడలేకపోయారా..?

కొత్త పార్టీ పెట్టబోతున్నారా?

ప్రవీణ్ కుమార్ తాజాగా చెబుతున్న మాటలను బట్టి చూస్తే.. ఆయన కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుజనులే కేంద్ర బిందువుగా ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన అవసరం ఉందన్న ఆయన.. తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదని, బహుజనులకు న్యాయం చేసేందుకే తాను బయటకు వచ్చానని చెప్పారు. కేవలం 1 శాతం మంది దగ్గరే సంపద నిక్షిప్తమై ఉందని, ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తున్న మిగిలిన 99 శాతం మంది బహుజనుల కోసమే తాను ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నానని తెలిపారు. అంటే ఏదో ఒక పార్టీలో చేరి, అందులో ఓ సాధారణ లీడర్ లా ఉండటం కాకుండా.. బహుజనుల కోసం ప్రత్యేకంగా పార్టీ పెట్టాలని అనుకుంటున్నట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.

సొంత పార్టీతో సక్సెస్ అవుతారా?

బహుజనుల బతుకులు మారాలంటే వంద శాతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని చెబుతున్న ప్రవీణ్ కుమార్.. మరి కొత్త పార్టీతో సక్సెస్ అవుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా లెక్కకు మించిన కుల సంఘాలు, పార్టీలు ఉన్నాయి. కానీ కొన్ని వర్గాల ఓట్ల మీద గెలిచిన, నిలిచిన పార్టీలు అతి తక్కువ. సామాజిక న్యాయం చేస్తామంటూ వచ్చిన పార్టీలు చరిత్రలో కలిసిపోయాయి. నిజానికి ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ చేస్తున్నవి కుల రాజకీయాలే.

తెలంగాణలో గత ఎన్నికలనే తీసుకుంటే... అప్పట్లో కుల సంఘాల మీటింగ్స్ జోరుగా సాగేవి. కుల సంఘం పెద్దలు ఏ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయిస్తే.. ఆ పార్టీకి అందరూ ఓటు వేయాలని తీర్మానం చేసుకునే వారు. గ్రామస్థాయిలో అలాంటి రాజకీయాల్లో నడుస్తున్నాయి. అయితే ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరోస్ సంస్థలో 4 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వాళ్ల సాయంతో రాజకీయ పార్టీని నడిపించినా.. జనంలో అక్కడక్కడ ఆయనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలచడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ కొత్త పార్టీ స్థాపిస్తే జనంలో, ఎన్నికల్లో నిలుస్తుందా? మణిపూర్ లో ఇరోమ్ షర్మిలకు ఎదురైన అవమానం ఎవ్వరం మరిచిపోలేం కదా!!

Also Read : ముగ్గురు మాజీ టిఆర్ఎస్ నేతల రహస్య మంతనాలు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp