ఆంధ్రజ్యోతి రాజకీయ పాతివ్రత్య కబుర్లు

By Gopal.T Mar. 01, 2020, 01:06 pm IST
ఆంధ్రజ్యోతి రాజకీయ  పాతివ్రత్య కబుర్లు

ఆంధ్రప్రదేశ్ లో మీడియా ఇప్పుడు ఏకపక్షంగానే ఉంది. మీడియా కేవలం కులం, రాజకీయం ప్రాతిపాదికగానే పనిచేస్తున్నాయి. చంద్రబాబు ఓటమిని తెలుగుదేశం నాయకులైనా దిగమింగుకోగలుగుతున్నారు కానీ మీడియా జీర్ణం చేసుకోలేకపోతోంది.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసరంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవినుండి తప్పుకోవాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వెంటనే బాధ్యతలు చేపట్టాలి. అమరావతినే రాష్ట్ర రాజధానిగా ప్రకటించి రాష్ట్ర బడ్జెట్ యావత్తూ అమరావతిలోని ఖర్చు చేయాలి. ఇది ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో మీడియాకు ఉన్న ఎజెండా.

మీడియాకు, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంబంధం ప్రజలకు తెలియంది కాదు. మరీ ముఖ్యంగా మీడియాకు చంద్రబాబుతో ఉన్న అనుబంధం బహిరంగ రహస్యమే. ఒకటి రెండు మీడియా సంస్థలైతే చంద్రబాబు పట్ల తమ ఇష్టాన్ని బహిరంగంగానే ప్రకటించుకున్నాయి. బాబుకు సేవలో మీడియా కునారిల్లుతోంది. ఈ విషయం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు తెలుసు. అందుకే ఈ మీడియా కథనాలను ప్రజలు విశ్వసించడం లేదు. ఈ విషయం 2019 ఎన్నికల్లో స్పష్టమైంది. మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డినే విశ్వసించారు. అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అయినా మీడియాకు కనువిప్పు కలగలేదు.

గడచిన తొమ్మిదినెలలుగా మీడియా జగన్మోహన్ రెడ్డిపై యుద్ధం చేస్తోంది. ప్రతి వార్త, ప్రతి కథనం ఏకపక్షమే. రాజకీయ లక్ష్యంతోనే మీడియా పనిచేస్తోంది. అయితే ఈ వాస్తవాన్ని విస్మరించి మీడియాపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాడిచేస్తోందంటూ మొసలి కన్నీరు కారుస్తోంది.

ప్రతి వారం "కొత్త పలుకు" పేరుతో వేమూరి రాధాకృష్ణ ప్రతి ఆదివారం రాసుకునే వ్యాసంలో గడచిన తొమ్మిది నెలలుగా విషం చిమ్మడమే కనిపిస్తోంది. వాస్తవానికి ఆంధ్రజ్యోతి పత్రిక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా, రాధాకృష్ణ "కొత్త పలుకు" మాత్రం ఆంధ్ర ప్రదేశ్ కు, అందునా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విషం చిమ్మడానికే ఎక్కువ కేటాయిస్తోంది.

అయితే, దొంగే "దొంగ దొంగ" అని అరిచినట్టు రాజకీయ ఎజెండాతో నడుస్తున్న రాధాకృష్ణ ఆ బురదను, దురదను జగన్మోహన్ రెడ్డికి ఆపాదించే ప్రయత్నం చేయడం పాతివ్రత్య కబుర్లు చెప్పడమే. జగన్మోహన్ రెడ్డికి తానే ప్రధాన ప్రత్యర్థి అన్నట్లు వ్యవహరిస్తున్న రాధాకృష్ణ ఆదివారం కొత్తపలుకుల్లో ఏమి రాస్తారో శనివారమే "రేపటి పలుకులు ఇవేనా? " అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

రాజకీయ పాతివ్రత్య కబుర్లు చెప్పడం రాధాకృష్ణకు, మరీ ముఖ్యంగా తెలుగు మీడియాకే చెల్లింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp