లోపాలు ,తప్పులూ చూపించే అవకాశం అందరికీ ఉంది రాధాకృష్ణా ...

By iDream Post Apr. 13, 2020, 10:01 am IST
లోపాలు ,తప్పులూ చూపించే అవకాశం అందరికీ ఉంది రాధాకృష్ణా ...

బహుశా కొత్తపలుకు రాయనారంభించాక ఇదే మొదటి సారి కేసీఆర్ పై భారీ స్థాయిలో ధిక్కార స్వరం వినిపించారు . అందుకు కారణాలు ఏవైనా సదరు వ్యాసాన్ని చదవడం ప్రారంభించాక సగటు ఆంధ్రా పాఠకుని మనసులో ఉదయించే తొలి ప్రశ్న .

లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులకు యాభై శాతం జీతాల కోత విధించడం అనే విధానపరమైన నిర్ణయంలో పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి కూడా కోత విధించడం కరెక్ట్ కాదు అని ఒక లోపం తెలంగాణాలో ఎత్తి చూపారు,అంట వరకు బాగానే ఉంది కానీ ఆంధ్రాలో కూడా జీతాలు రెండు వాయిదాలలో చెల్లించే విషయంలో నిర్ణయం తీసుకొంటూ పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందితో పాటు , అదే స్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ , పారిశుధ్య సిబ్బందికి పూర్తి స్థాయి జీతాలు అందించిన ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు ప్రశంసించలేదు, ఇది జర్నలిజంలో లోపమా లేక రాజకీయ కక్షనా ?.

సరే ,రాధాకృష్ణకు జగన్ తో ఉన్న రాజకీయవైరం కారణంగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప ప్రశంసించరనేది తెలుగు పాఠకులకు తెలిసిన విషయమే అయినా ఒకే ఆర్టికల్ లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలని ఉద్దేశించి రాస్తున్నప్పుడు సదరు అంశ ప్రస్తావనలో తెలంగాణా సీఎంను, ఏపీ సీఎం అనుసరిస్తున్నాడు అని చెప్పుకొచ్చినప్పుడు కనీసం ఏపీలో ఇలా చేశారు అని వార్తగా అయినా పాఠకులకు అందించాల్సిన పత్రికా ధర్మం పాటించకపోవడం ఉద్దేశ్యపూర్వకం కదా?.

సీనియర్ నేతగా కేసీర్ జగన్ కు సలహాలు ఇచ్చిఉండొచ్చు అందులో కొన్ని జగన్ స్వీకరించి ఉండవొచ్చు కానీ ఉద్యోగుల జీతాల మీద ఇరు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల మీద పత్రికలో నిర్దిష్టంగా రాస్తున్నప్పుడు అత్యవసర సేవలు అందిస్తున్న అన్ని రంగాల ఉద్యోగులకు పూర్తి జీతం ఇస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించి కేసీర్ కూడా మొదట అన్ని శాఖలతోపాటు వైద్య సిబ్బందికి కూడా కోత విధించినా, జగన్ నిర్ణయం తరువాత కెసిఆర్ కూడా వైద్య సిబ్బందికి 100% జీతం ఇవ్వటానికి నిర్ణయించాడు ..అని రాయటానికి మనసు రాలేదా?అలా రాయలేదు సరే జగన్ సొంతగా నిర్ణయాలు తీసుకున్నట్టు కాకుండా కేసీఆర్ ని అనుసరించినట్టు ఎలా అవుతుందో వివరించి చెప్పకుండా ఇష్టానుసారం రాయడం ABN లోపం కాదా ?.

పోనీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ , ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలు కానీ కేసీఆర్ ని అనుసరించిన చేసినవే అని రాధాకృష్ణ అభిప్రాయమా?. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న జగన్ నిర్ణయాన్ని పరిశీలిస్తున్న , అమలు చేయ యత్నిస్తున్న పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణా సీఎం కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించిన విషయం రాధాకృష్ణకు తెలియదా . ఏపీలో ఉన్న విలేజ్ వలంటీర్ వ్యవస్థను మనం కూడా ఏర్పాటు చేసుకోవాలని మంత్రి వర్గ సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి ఆంధ్రజ్యోతి మీడియా అధిపతి దృష్టికి రాలేదా ? .


ఇది మీ జర్నలిజం వైఫల్యం కాదా ?
ఆరేళ్లుగా ఫార్మ్ హవుస్ లోనో , ప్రగతి భవన్ లోనో సెల్ఫ్ క్వారంటయిన్లో ఉన్న కేసీఆర్ కి ఏమీ తెలియదు . క్షేత్ర స్థాయిలో అన్నీ మాకే తెలుసు అని సెల్ఫ్ సెర్టిఫికేషన్ ఇచ్చుకొన్నఆంధ్రజ్యోతికి, మోడీ దీపాలు వెలిగించమన్న తొమ్మిది నిమిషాల్లో జగన్ ఎన్ని నిమిషాల ఎన్ని సెకన్లు వెలిగించాడో కనిపెట్టగలిగిన ABN కు జగన్ ప్రవేశ పెట్టిన దిశా చట్టం , విలేజ్ వలంటీర్ వ్యవస్థ , విలేజ్ సెక్రటిరియేట్ వ్యవస్థ , ప్రవేశపెడుతున్న రైతు భరోసా కేంద్రాలు గతంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టని , అమలు చేయని వ్యవస్థలని , ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు ఈ విషయంలో ఏపీని అనుసరిస్తున్నాయని , ఈ విషయంగా జగన్ పలు రాష్ట్రాల ప్రశంసలు పొందారని తెలియకపోవడానికి వారు ఏ రాజకీయ క్వారంటయిన్లో కళ్ళు మూసుకొని గడుపుతున్నారో!.

ఇలా వ్యూహాత్మకంగా కళ్ళు మూసుకోవడం ఆంధ్రజ్యోతికి కొత్త కాదు . అవి తెరుచుకొంటాయని నిజాలు రాస్తారని ఎవరూ ఆశించరు కానీ గత వారం క్రితం వరకూ కేసీఆర్ సమర్ధ పాలన చేస్తున్నాడని జగన్ ప్రస్తావన వచ్చినప్పుడు ఆ పిల్లోడికి తెలియదు అని చెబితే వినడు దెబ్బ తింటాడు అని ఆంతరంగిక సహచరులతో చెప్పినట్టు రాసుకొచ్చిన రాధాకృష్ణ ,ఇవాళ కేసీఆర్ ఆరేళ్లుగా సెల్ఫ్ క్వారంటయిన్ అంటూ చెప్పుకొచ్చిన తర్వాత జగన్ క్వారంటయిన్లో ఉన్న కేసీఆర్ ని ఎలా అనుసరించాడు అనేది చెప్పలేకపోవడం కొత్తపలుకులో తగ్గిన అసత్య వాదనా పటిమను సూచిస్తుంది .

కరోనా వైరస్ కట్టడిలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వాన్ని , వలంటీర్ , సచివాలయ ఉద్యోగ వ్యవస్థల కష్టాన్ని గుర్తించకుండా ఏపీ ప్రభుత్వం అసలేం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది అని రాజకీయ ప్రేరేపిత కోణంలో రాసిన వ్యాఖ్యానాలు క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న వారి నైతిక స్టైర్యాన్ని దెబ్బ తీస్తాయి , ఇది పత్రికా ధర్మం కాదు అనే కనీస స్పృహ రాధాకృష్ణకు లేకపోవడం లోపం మాత్రమే కాదు తీవ్రమైన తప్పిదం కూడా .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp