ప్ర‌జాకోర్టులో ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ దోషా? నిర్దోషా?

By Sodum Ramana 19-11-2019 08:03 AM
ప్ర‌జాకోర్టులో ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ దోషా? నిర్దోషా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది నుంచి ఆంగ్ల‌మాధ్య‌మం ప్ర‌వేశ పెట్టాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్న క్ష‌ణం నుంచి ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా పూనకం వ‌చ్చిన‌ట్టుగా ఊగిపోతున్నాయి. ఏదైనా నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించ‌డం వేరు, విషాన్ని కుమ్మ‌రించ‌డం వేరు. పైగా మ‌త‌ప‌ర‌మైన ఉద్దేశాల‌ను జ‌గ‌న్ స‌ర్కార్‌కు అంట‌గ‌ట్ట‌డాన్ని స‌భ్య‌స‌మాజం వ్య‌తిరేకించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఎందుకంటే జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాల‌న్నింటితో ఏకీభ‌వించాల్సిన అవ‌స‌రం లేదు. ఆ నిర్ణ‌యాల‌పై ప్ర‌తి ఒక్క‌రూ నిర్మోహ‌మాటంగా త‌మ‌త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించే స్వేచ్ఛ‌, హ‌క్కును క‌లిగి ఉన్నారు. ఇదే ప్ర‌జాస్వామ్య అందం.

కానీ గ‌త ఆదివారం ఆంధ్ర‌జ్యోతిలో ఏపీలో ర‌హ‌స్య అజెండా శీర్షిక‌న ఆ ప‌త్రిక ఎండీ రాధాకృష్ణ రాసిన కొత్త‌ప‌లుకు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆంగ్ల విద్య పేరుతో జ‌గ‌న్ మ‌త‌మార్పిడుల‌కు పాల్ప‌డుతున్నార‌నే కోణంలో ఆయ‌న రాయ‌డంపై కోర్టుకు వెళుతున్న‌ట్టు విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్ల‌డించిన నేప‌థ్యంలో...ఈ వ్యాసం పుట్టుకొచ్చింది.

కొత్త‌ప‌లుకు ఒక వ్యాస‌మ‌ని, అది అభిప్రాయం మాత్ర‌మేన‌ని ఆంధ్ర‌జ్యోతి ప్ర‌తినిధి మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌గా ఆయ‌న స‌మాధానం దాట‌వేసిన‌ట్టు రాశారు. అంతేకాదు ఇంగ్లీష్ మాట్లాడితే క్రిస్టియ‌న్ అని వ్యాసంలో ఎక్క‌డా లేద‌ని ఆ ప్ర‌తినిధి అన్న‌ట్టు రాశారు. ఒకే జీవితం గ‌డ‌వ‌డానికి జీతం కోసం ప‌నిచేసే వాళ్లు య‌జ‌మానికి ఒత్తాసు ప‌ల‌క‌కుండా మ‌రోలా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరుకోలేం. కానీ ఇంగ్లీష్ మాట్లాడితే క్రిస్టియ‌న్ అని వ్యాసంలో రాయ‌క‌పోవ‌చ్చుగానీ, హిందూ-క్రిస్టియ‌న్ల మ‌ధ్య విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే వ్యాఖ్యానాలు ఆ వ్యాసంలో అడుగ‌డుగునా తార‌స‌ప‌డుతాయి. అదృష్టం కొద్దీ తెలుగు మాత్రమే తెలిసిన నాకు రాధాకృష్ణ క‌లం విష‌పు కోర‌ల‌తో ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను మ‌తం పేరుతో కాటేయాల‌నే కుట్ర‌ల‌ను ప‌సిగ‌ట్ట‌గ‌లిగాను.

ఆ క‌లం ఎంత‌గా మ‌త విద్వేషాగ్నిని ర‌గిలించి ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తోందో గ‌త ఆదివారం మొద‌టి పేజీలో కొత్త‌ప‌లుకులోని కొన్ని అంశాల‌ను ప్రాధాన్యం ఇచ్చి ప్ర‌చురించారు. అవి మాత్రం చ‌దివినా చాలు రాధాకృష్ణ‌లోని దుర్మార్గం తెలుస్తుంది.

ఈ వాక్యాల అర్థ‌మేమిటో తెలియ‌ని అమాయ‌కులా ఏపీ ప్ర‌జ‌లు.

-ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు హిందువులు వ‌ర్సెస్ క్రిస్టియ‌న్లుగా స‌మాజం విడిపోవ‌డానికి బీజం ప‌డుతోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చ‌ర్య‌ల‌న్నీ ఈ దిశ‌గానే ఉన్నాయ‌న్న అనుమానాలు హిందువుల్లో వ్యాపిస్తున్నాయి.
-బీసీల‌ను కూడా మ‌త‌మార్పిడి చేయిస్తే రాజ‌కీయంగా తాను మ‌రింత బ‌లప‌డ‌తాన‌ని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భావిస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు కూడా అంత‌ర్గ‌త స‌మావేశాల్లో అంగీక‌రిస్తున్నారు.
-వివాదాస్ప‌దంగా మారిన ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధ‌న అనే ప్ర‌భుత్వ నిర్ణ‌యం వెనుక కూడా మ‌త‌కోణం ఉంద‌నీ, ముఖ్య‌మంత్రికి ర‌హ‌స్య అజెండా ఉంద‌నీ ప్ర‌తిప‌క్షాలు అనుమానిస్తున్నాయి.
-క్రైస్త‌వ మ‌త‌వ్యాప్తి ఎక్కువ‌గా జ‌రిగిన కోస్తా జిల్లాల ప్ర‌జ‌ల్లో హిందూ-క్రిస్టియ‌న్ అనే భేద భావం ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతోంది.
-జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంలో క్రైస్త‌వుల‌కే ప్రాధాన్యం ల‌భిస్తోంద‌ని హిందువులు అనుమానిస్తున్నారు. ఈ ప‌రిణామం హిందూ-క్రిస్టియ‌న్ ఘ‌ర్ష‌ణ‌ల‌కు దారితీసే ప్ర‌మాదం లేక‌పోలేదు.

రాధాకృష్ణ‌లో వ‌ళ్లంతా విష‌మే ఉంద‌నేందుకు ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ‌లు ఏం కావాలి.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు హిందువులు వ‌ర్సెస్ క్రిస్టియ‌న్లుగా స‌మాజం విడిపోవ‌డానికి బీజం ప‌డుతోంద‌ని ఆయ‌న రాశారు. హిందూ వ‌ర్సెస్ క్రిస్టియ‌న్ల‌గా స‌మాజాన్ని విడ‌గొట్ట‌డానికి బీజం ఢిల్లీలో ప‌డింది. ఇటీవ‌ల రాధాకృష్ణ‌ను కేంద్ర‌మంత్రి క‌ల‌వ‌డం, ఆ త‌ర్వాత ఆయ‌న ఢిల్లీ వెళ్లి అమిత్‌షాను క‌ల‌వ‌డంతో మ‌త విద్వేష పూరిత కుట్ర‌ల‌కు బీజం ప‌డింద‌ని చెప్పొచ్చు.

ఇసుక కొర‌త వంటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తున్న జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వైసీపీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారని, తెలుగుదేశం వ‌లే జ‌న‌సేన ఉండ‌ద‌ని ప్ర‌క‌టించిన 24 గంటలకే...తెలుగుదేశం వ‌లే వైసీపీ మెత‌క‌గా ఉండ‌ద‌ని తెలిసి వ‌చ్చేలా చేశారని కొత్త‌ప‌లుకులో రాధాకృష్ణ ప‌లికారు. అంతేకాదు దీంతో కేంద్ర పెద్ద‌ల వ‌ద్ద మొర్ర పెట్టుకోడానికో ఏమోగానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఢిల్లీ పరుగెత్తుకెళ్లారని కూడా ఆయ‌న రాశారు.

మ‌రి రాధాకృష్ణ తానెందుకు ఢిల్లీకి ప‌రుగెత్తికెళ్లారో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉదాహ‌ర‌ణ ద్వారా తెలుగు స‌మాజానికి చెప్పార‌నుకోవాలా? మ‌రి ఇప్ప‌టిక‌ప్పుడు రాధాకృష్ణ‌కు ఢిల్లీ పెద్ద‌ల‌తో ప‌నేం ఉంది. ఆయ‌న ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత రెండు వారాల క్రితం ఆదివారం ప్ర‌త్యేక సంచిక‌లో అమిత్‌షా గురించి క‌వ‌ర్‌పేజీ క‌థ‌నాన్ని గుర్తు తెచ్చుకుందాం.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు న్యాయ‌మూర్తి హ‌త్య వెనుక అమిత్‌షా ఉన్నార‌ని జ‌స్టిస్ లోయా సోద‌రి ఆరోపించిన వార్త‌కు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్ర‌చురించ‌డాన్ని మ‌ర‌చిపోక ముందే....అదే అమిత్‌షాను ఆకాశ‌మే హ‌ద్దుగా కీర్తిస్తూ స‌ర్దార్‌షా అనే శీర్షిక‌తో క‌వ‌ర్ పేజీ క‌థ‌నం రాయ‌డాన్ని తెలుగు స‌మాజం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంద‌ని రాధాకృష్ణ గుర్తిస్తే మంచిది.

అమిత్‌షా గురించి రాధాకృష్ణ ప‌త్రిక‌లో రాసిన ఇంట్రో ఎలా సాగిందో చ‌ద‌వండి.

ఆ క‌ళ్లు స్కాన‌ర్లు.
మ‌నుషుల్ని క‌చ్చితంగా అంచ‌నా వేస్తాయి.
ఆ గాంభీర్వం ఓ సంకేత భాష‌.
అర్థ‌మైన‌ట్టే ఉంటుంది. అస్స‌లు కాదు.
ఆ భృకుటి ముడిప‌డిందంటే...
ఏదో చిక్కుముడి విడిపోతోంద‌ని భావం.
ఆ గుండ్ర‌టి త‌ల‌కాయ‌
రాజ‌కీయ రాకెట్ ప్ర‌యోగ కేంద్రం
రాజ‌కీయాల్లో ఎద‌గ‌డానికి వంశాలూ వార‌స‌త్వాల‌తో ప‌నిలేదు. కొండ‌ల్ని ఢీకొట్ట‌గ‌ల డీఎన్ఏ ఉంటే చాలని నిరూపించారు అమిత్‌షా.

కేంద్రంలో రెండో సారి అధికారంలోకి బీజేపీ కేబినెట్లో అమిత్‌షా అత్యంత కీల‌క‌మ‌నే విష‌యం సుస్ప‌ష్టం. కేంద్రంతో విభేదించిన‌ప్పుడు తానూ విచ్చ‌ల‌విడిగా మోడీ-అమిత్‌షాల‌పై క‌థ‌నాలు రాసిన విష‌యం జ‌గ‌ద్వితం. ఇప్పుడేమో అమిత్‌షా క‌ళ్లు స్కాన‌ర్ల‌ని, గుండ్ర‌టి త‌ల‌కాయ రాజ‌కీయ రాకెట్ ప్ర‌యోగ కేంద్ర‌మ‌ని కీర్తించ‌డం కంటే దిగుజారుడుకు ప‌రాకాష్ట ఉందా?

ఇప్పుడు హిందూ-క్రిస్టియ‌న్ల మ‌ధ్య మ‌త‌విద్వేషాల‌ను రాధాకృష్ణ ఎంత రెచ్చ‌గొట్టాల‌ని కుట్ర‌ప‌న్నినా, వృథా శ్ర‌మ‌నే. అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు నిర్ణ‌యాలు, అభిప్రాయాల‌ను మార్చుకునేందుకు ప్ర‌జ‌లేమీ రాధాకృష్ణ‌లా వ్యాపారాలు చేయ‌లేదు. ఎందుకంటే తెలుగు స‌మాజం విజ్ఞ‌త‌తో ఆలోచిస్తుంది. త‌గిన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటుంది. వారంతా ప్ర‌జాకోర్టులో న్యాయ‌మూర్తులే. రాధాకృష్ణ దోషా?  నిర్దోషా అనేది వారే తీర్పునిస్తారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News