అజిత్ సింగ్ ఇకలేరు

By Ramana.Damara Singh May. 06, 2021, 01:49 pm IST
అజిత్ సింగ్ ఇకలేరు

కరోనా మహమ్మారి మరో ప్రముఖ నేతను కబళించింది. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీమంత్రి చౌదరి అజిత్ సింగ్ కోవిడ్ చికిత్స పొందుతూ గురువారం ఉదయం గురుగ్రామ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత నెల 20న వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయారు.

సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర

మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ ఆయన తదనంతరం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. 1986లో రాజ్యసభకు ఎన్నికవడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1987లో లోక్ దళ్(ఏ), 1988లో జనతాపార్టీ అధ్యక్షుడిగా ఉంటూ 1989లో జనతాదళ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ దేశంలో ప్రారంభమైన సంకీర్ణ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. వి.పి.సింగ్ ప్రధానమంత్రి కావడానికి సహకరించి.. ఆయన మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో ఉత్తరప్రదేశ్లోని భాగపట్ నియోజకవర్గం నుంచి తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు.

1991లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆహార శాఖ మంత్రిగా చేరారు. 1996లో రాష్ట్రీయ లోకదళ్ ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగారు. 1996లో కాంగ్రెస్ తరపున ఎన్నికైన.. పార్టీకి, పదవికి రాజీనామా చేసి 1997లో ఆరేల్దీ తరఫున మళ్లీ పోటీ చేసి ఎన్నికయ్యారు. 1998లో ఓటమి పాలైన 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా నెగ్గారు. 2001లో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయేలో చేరి ఆయన కేబినెట్లో వ్యవసాయ మంత్రిగా 2003 వరకు పనిచేశారు. మళ్లీ 2011లో యూపీఏ లో భాగస్వామిగా చేరి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పౌర విమానాయన శాఖను చేపట్టారు. 2014లో ముజఫర్ పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

తెలంగాణ ఉద్యమానికి అండ

1939లో మీరట్లో జన్మించిన అజిత్ బీటెక్, ఎంఎస్ చేసినా తండ్రి చరణ్ సింగ్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రైతు నాయకునిగా.. ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో బలంగా ఉన్న ఝాట్ వర్గ నేతగా ఎదిగారు. రైతు సమస్యలపై పోరాటాలు చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన రెండు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్నినెలలుగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి అండగా నిలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించిన అజిత్.. యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కీలకంగా వ్యవహరించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp