బెజవాడ లో మిత్రులు శత్రువులు అయ్యారు!

By Mavuri S Mar. 07, 2021, 09:00 am IST
బెజవాడ లో మిత్రులు శత్రువులు అయ్యారు!

మున్సిపల్ ఎన్నికల్లో మిత్రులు శత్రువులు, శత్రువులు మిత్రులు అవుతున్నారు. ఇప్పటికే బెజవాడ రాజకీయాలు కాక పుట్టిస్తుంటే, మరో పక్క కొత్త సమీకరణాలు నవ్వు తెప్పిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ జనసేన పొత్తు ఉందని అగ్ర శ్రేణి నేతలు పదేపదే చెప్పడం తప్ప, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ రెండు పార్టీల తీరు వేరుగా ఉంది. బెజవాడ వేదికగా బీజేపీ జనసేన పొత్తు కొత్త మలుపు తీసుకుంది.

వారి డివిజన్లలో వీరు... వీరి డివిజన్లలో వారు

బెజవాడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన ను కలిసి బరిలోకి దిగాయి. ఇరు పార్టీల నేతలు ఏకాభిప్రాయంతో సీట్లను పంచుకొని అభ్యర్థులను పోటీలో దించారు. అయితే కొన్ని డివిజన్లలో మాత్రం ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు పోటీలో ఉన్నారు. ఇక్కడ నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. పైకి మాత్రం స్నేహపూర్వక పోటీ అని చెప్పిన, ప్రచారంలో మాత్రం విమర్శలు తప్పడంలేదు..

కుదరలేదు.. ఉండలేదు!

ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రెండు పార్టీల ఉమ్మడి డివిజన్ లో పోటీ చేసే అభ్యర్థుల పై నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. 64 డివిజన్ లో ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ లో 37 డివిజన్లు జనసేనకు, 27 డివిజన్లో బిజెపి పోటీ చేయాలని మొదట్లో భావించారు. అయితే తూర్పు, మధ్య నియోజకవర్గాల్లోని ఏడు డివిజన్ల విషయంలో నాయకుల మధ్య అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగి వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలని భావించినా అభ్యర్థులు మాత్రం ససేమిరా అనడంతో పాటు నాయకుల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ఇరు పార్టీలు బరిలో దిగాలని నిర్ణయించుకున్నాయి. చివరకు జనసేన 38 డివిజన్లకు, బిజెపి 23 మంది అభ్యర్థులను ప్రకటించింది. బిజెపి మొదట 20 మందితో ఒక జాబితా విడుదల చేయగా, కొద్ది రోజులకు మరో ముగ్గురిని ప్రకటించింది. నాలుగు డివిజన్లలో మాత్రం మిత్ర పార్టీలు అభ్యర్థులకు విడివిడిగా బరిలోకి దింపాయి.

ఇది లెక్క!

తూర్పు నియోజకవర్గం పరిధిలోని 20 డివిజన్ ను మొదట బిజెపికి కేటాయించగా ఆ పార్టీ తరఫున పల్లవరాజు పోటీ చేస్తున్నారు. అయితే ఇదే డివిజన్ నుంచి జనసేన పార్టీ తరఫున అధికారికంగా జైరామ్ కూడా బరిలో ఉన్నారు. మధ్య నియోజకవర్గం పరిధిలోని 25 వ డివిజన్ లో బీజేపీ నుంచి నాగలక్ష్మి పోటీలో ఉంటే, మిత్ర పక్షం జనసేన నుంచి లక్ష్మీ పోటీలో నిలిచారు. అలాగే 28వ డివిజన్లో జనసేన తరపున రాజేష్ పోటీలో ఉంటే, అదే డివిజన్లో కాషాయ పార్టీ నుంచి జయరాం ఉన్నారు.

32 వ డివిజన్ ను మొదట జనసేనకు కేటాయించారు. దీంతో ఆ డివిజన్ నుంచి రత్న కమల్ పోటీలో నిలివగా, బీజేపీ నుంచి శ్రీనివాసరాజు పోటీకి సై అంటూ ముందుకు వచ్చారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 64 వ డివిజన్ పంపకాలు లో భాగంగా బీజేపీ కి వెళ్ళింది. దీంతో ఇక్కడి నుంచి కళ్లేపల్లి హారిక నామినేషన్ వేశారు. అయితే ఈ డివిజన్ నుంచి కూడా జనసేన పార్టీ తరఫున భోగేశ్వరం ఈ పోటీలో దింపారు. దీంతో బెజవాడ వేదికగా బిజెపి జనసేన మధ్య అసలు పొత్తు ఉందా లేక నేతల మాటల్లోనే మిత్రత్వం కనిపిస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. దీనిపై ఇరు పార్టీల అగ్రశ్రేణి నాయకులు కనీసం నోరు మెదపకపోవడం విశేషం.

Read Akso : మున్సిపల్ ఫలితాల తర్వాత మారబోతున్న రాజకీయ సమీకరణాలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp