ఈనాడు ఉద్యోగులు ఉండవల్లిని ఎందుకు కలిశారు..?

By Voleti Divakar Oct. 18, 2020, 11:42 am IST
ఈనాడు ఉద్యోగులు ఉండవల్లిని ఎందుకు కలిశారు..?

మార్గదర్శి కుంభకోణం పై కేసు వేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు వ్యతిరేకంగా ధర్నా చేసిన వారంతా ఇప్పుడు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఆయన్నేఆశ్రయించారు. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్న నానుడిని ఈనాడు బాధితులు అక్షరాలా అనుసరిస్తున్నారు.

తమ యజమాని, ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్‌ను ఈనాడు పత్రికలో పనిచేసే ఉద్యోగులు కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈనాడు ఉద్యోగులు, విలేఖర్లు ఉండవల్లి లాంటి వ్యక్తులను వ్యక్తి గతంగా కలుసుకోవడంపై అలిఖిత నిషేధం ఉంటుంది. అయితే ఉండవల్లిని కలుసుకున్నది ఈనాడు బాధితులు కావడం గమనార్హం. సుమారు 3 నెలల తరువాత విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్‌ను ఈనాడులో తొలగించబడిన ఉద్యోగులంతా కలిసి తమకు న్యాయం జరిగేలా జోక్యం చేసుకోవాలని వేడుకున్నారు.

ఈనాడు అధిపతి రామోజీరావు 'కరోనా మహమ్మారి సహాయక చర్యల నిమిత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలకు రూ. 10 కోట్ల చొప్పున విరాళాన్ని అందించారు. అలాంటి రామోజీరావు తమను కరోనా పేరు చెప్పి ఉద్యోగాల నుంచి తొలగించారని, తిరిగి చేర్చుకున్న ఉద్యోగులను కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఈనాడు ఉద్యోగులు వాపోతున్నారు.

బాధితుల్లో ఈనాడు అనుబంధ సంస్థ అయిన మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేటు లిమిటెడ్, రిటా, పబ్లికేషన్ తదితర ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీరి సంఖ్య వేలల్లో ఉంటుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈనాడు పత్రిక సర్క్యులేషన్, ప్రకటనల ఆదాయం తగ్గిపోవడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈనాడును అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రికగా నిలబెట్టేందుకు దశాబ్దాలుగా తాము ఎంతో కృషిచేశామని ఇప్పుడు హఠాత్తుగా రోడ్డునపడేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ అవసరాలను కూడా పక్కన పెట్టి సంస్థ అభివృద్ధికి పాటుపడ్డామని తెలిపారు. అలాంటిది తమను కరోనా పేరు చెప్పి పక్కన పెట్టడం పై వాపోతున్నారు.

అన్ని రంగాల్లో ధురంధరుడి వంటి రామోజీరావును నేరుగా ఢీ కొట్టడం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, ఆ తరువాత ఉండవల్లికే చెల్లింది. అలాంటి ఉండవల్లిని కలిస్తే తమకు న్యాయం జరుగుతుందని ఈనాడు బాధిత ఉద్యోగులు ఆశించారు. తమ సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఉండవల్లి వారికి సూచించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp