హ‌మ్మ‌య్య‌.. అశోకుడి క‌థ ప్ర‌శాంతం

By Kalyan.S Aug. 14, 2020, 08:45 pm IST
హ‌మ్మ‌య్య‌.. అశోకుడి క‌థ ప్ర‌శాంతం

నెల రోజుల‌కు పైగా సాగిన అశోకుడి పోరాటం ఫ‌లించింది. అతి క‌ష్టం మీద సాధించుకున్న సీఎం కుర్చీ ఎక్క‌డ చేజారిపోతుందో అని ఆందోళ‌న ప‌డుతూ.. అప్పుడ‌ప్పుడు స‌చిన్ పైలెట్ వ‌ర్గంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఒకానొక సంద‌ర్భంలో గ‌వ‌ర్న‌ర్ పై కూడా అస‌హ‌నం వెళ్ల‌గ‌క్కి.. ఎంతో ప్ర‌యాస ప‌డిన రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాత్ చివ‌ర‌కు విజ‌యం సాధించారు. బ‌ల‌ప‌రీక్షకు ముందే స‌చిన్ పైలెట్ కూడా స్నేహ హ‌స్తం అందించినా.. ప్ర‌భుత్వంపై అవిశ్వాసం పెడ‌తామంటూ బీజేపీ ఇచ్చిన ట్విస్ట్ తో అసెంబ్లీ స‌మావేశాల పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది. మెజార్టీ లేక‌పోయినా బీజేపీ ఇచ్చిన ప్ర‌క‌ట‌న వెన‌క కుట్ర దాగి ఉంద‌న్న అనుమానాల‌కు తెర‌ప‌డింది. రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఊగిస‌లాట‌కు శుభం కార్డు ప‌డింది.

అవిశ్వాసానికి ముందే విశ్వాసం

శుక్ర‌వారం (ఆగ‌స్టు 14) ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్ట‌నున్న‌ట్లు బీజేపీ ప్ర‌క‌టించింది. రాజస్థాన్‌ సర్కార్ కోమాలోకి వెళ్లిపోయిందని, అంత‌ర్గ‌త త‌గాదాల‌తో నిల‌బ‌డ‌లేద‌ని, అందుకే ప్రతిపక్షమైన బీజేపీ నో కాన్ఫిడెన్స్ మోషన్‌ను ప్రవేశ పెట్టనున్నట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ప్ర‌తిప‌క్షానికి ఆ అవ‌కాశం ఇవ్వ‌కుండా స‌మావేశాలు ప్రారంభం కాకుండానే ప్ర‌భుత్వమే ముందు విశ్వాస ప‌రీక్ష‌ను ప్ర‌వేశ‌పెట్టింది. వాయిస్ ఓట్ తో అశోక్ గెహ్లాత్ విజ‌యం సాధించారు. అనంత‌రం అసెంబ్లీని కొద్ది సేపు వాయిదా వేసిన స్పీక‌ర్ ఆ త‌ర్వాత ఈ నెల 21కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వాడివేడి చ‌ర్చ‌

విశ్వాస తీర్మానం నెగ్గిన అనంత‌రం సీఎం మాట్లాడుతూ.. క‌ర్ణాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గోవా, మ‌ణిపూర్ త‌దిత‌ర రాష్ట్రాల మాదిరిగా బీజేపీ రాజ‌స్థాన్ లో రాజ‌కీయాల‌కు తెర‌లేపింద‌ని మ‌రోసారి ఆరోపించారు. ఇక్క‌డ అలా జ‌ర‌గ‌కుండా సుదీర్ఘ పోరాటం చేసి అడ్డుకున్న‌ట్లు చెప్పారు. బీజేపీ వ‌ల్ల ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని విమ‌ర్శించారు. త‌మ పార్టీలోని అంత‌ర్గ‌త విభేదాల‌తో బీజేపీకి సంబంధం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా వాయిస్ ఓట్ తో ప్ర‌భుత్వం నెగ్గ‌డంపై బీజేపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఇది ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధ‌మంటూ ఆందోళ‌న చేసింది. త‌మ‌కు అసెంబ్లీలో మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా స‌భ‌లో కాస్త గంద‌ర‌గోళం ఏర్ప‌డింది.

వాయిస్ ఓటు అంటే...

అసెంబ్లీలోని సభ్యుల అభిప్రాయాన్ని వెల్ల‌డించ‌డాన్నే వాయిస్ ఓట్ లేదా మూజువాణి ఓటు విధానం అంటారు. విశ్వాస పరీక్షకు సమాధానంగా ఎస్‌, లేదా నో అని స‌భ్య‌లు చెప్పాలి. మద్దతుగా ఉండే సభ్యులంతా తొలుత ఎస్‌ అని, వ్యతిరేకించే వారు నో అని సమాధానం ఇవ్వాలి. అనంతరం ఎంతమంది మద్దతిచ్చారు, ఎంతమంది వ్యతిరేకించారు అనేది లెక్కిస్తారు. వాటిని ఆధారంగా స్పీక‌ర్ ఎవ‌రు గెలిచారో నిర్ణ‌యిస్తారు. ఈ విధానంలో స్పీక‌ర్ నిర్ణ‌య‌మే ఫైన‌ల్.

కేంద్ర రాజ‌కీయాల‌కు స‌చిన్ పైలెట్?

అశోక్ గెహ్లాత్ తనను పనికిమాలిన వ్యక్తి అంటూ పరుష పదజాలంతో విమర్శించారని.. తిరుగుబాటు చేసిన స‌చిన్ పైలెట్ కొత్త పార్టీ పెడ‌తారా..? బీజేపీలో చేర‌తారా..? అని ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌పై వివాదానికి మ‌ధ్య‌లోనే కాస్త చెక్ ప‌డినా స‌చిన్ భ‌విత‌వ్యం ఏంట‌నే దానిపై చ‌ర్చ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ త‌ర్వాత స‌చిన్ త‌న వ‌ర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేల‌తో తిరిగి ప్ర‌భుత్వంతో జ‌త‌ క‌లిశారు. ఆ భేటీ సంద‌ర్భంగా స‌చిన్ కొన్ని డిమాండ్లు వారి ముందు పెట్టారు. దీనిలో భాగంగా ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా కాంగ్రెస్ అధిష్ఠానం స‌చిన్ పైలెట్ ను నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రిగా అశోక్ గెహ్లాత్ రాష్ట్రంలోను, ఏఐసీసీలో ఉండి స‌చిన్ పైలెట్ కేంద్ర వ్య‌వ‌హారాల‌ను చూసుకోనున్న‌ట్లు స‌మాచారం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp