రాజ‌స్థాన్ లో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం

By Kalyan.S Jul. 11, 2020, 07:57 pm IST
రాజ‌స్థాన్ లో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం

రాజ‌స్థాన్ లో రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అతి త‌క్కువ మెజారిటీతో గ‌ద్దెనెక్కి ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి దిన‌దిన గండంగా మారింది. క‌రోనా కాలంలోనూ రాజ‌కీయాలు చేస్తూ.. త‌మ ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేస్తోందంటూ రాజ‌స్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్ మ‌రోసారి ఆరోప‌ణ‌లు కురిపించారు. రాజ్యసభ ఎన్నికల స‌మ‌యంలోనూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాజ్యసభ ఎ‍న్నికల్లో ప్రత్యర్థికి ఓటు వేసే విధంగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆశచూపుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇదే విధంగా ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తర్వాత బిజెపి అధినాయకత్వం కన్ను రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పడిందని ఏఐసీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గత నెలలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసిందని.. అదే విధానాన్ని రాజస్థాన్లోనూ అవలంబించాలని కమలనాథులు వ్యూహం రచించారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంటే.. మరోవైపు బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి ప్రలోభాలకు గురి చేసి.. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆరోపించారు. త‌మ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం పని చేస్తుంటూ బీజేపీ మాత్రం సమస్యలను పెంచే విధంగా ప్రవర్తిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఇస్తాం.. ఇతర సాయం చేస్తామని బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తోన్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి బీజేపీ అసలు రంగు బయటపడుతోంది’ అని మ‌రోసారి ఆరోప‌ణలు గుప్పించారు. కానీ ఏళ్ల పాటు గుర్తుండి పోయేలా కాంగ్రెస్ పార్టీ వారికి తగిన గుణపాఠం చెబుతుంద‌ని హెచ్చ‌రించారు. అన్నింటినీ గ‌మ‌నిస్తున్న ప్ర‌జ‌లు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అహంకారానికి తగిన బుద్ధి చెప్తారని అశోక్‌ గెహ్లోత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ....

రాజస్థాన్ లో మూడు స్థానాలకు గ‌త నెల 19న రాజ్యసభ ఎన్నికలు జ‌రిగాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మెజారిటీ ప్రకారం మొత్తం మూడింటిలో కాంగ్రెస్ రెండు స్థానాలు‌, ఒకటి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అయితే సరైన సంఖ్యాబలం లేకున్నా బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఈ విష‌యంలో కూడా సీఎం అశోక్‌ గెహ్లోత్ నాడు పలు అనుమానాలను లేవ‌నెత్తారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ తరహాలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయని, వారిపై విచారణ జరపాలని ఏసీబీకి రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ విప్ మహేష్ జోషి కూడా గ‌తంలో లేఖ లేఖ రాశారు. తమ ఎమ్మెల్యేలను డబ్బులతో ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఇప్పుడు మ‌రోసారి బీజేపీ తీరుపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp