ఎమ్మెల్యే మామగారు ఎమ్మెల్సీగా గెలుస్తారా..! ? ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆసక్తి !

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది . ఈనెల 14 న జరిగే ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మామగారు ఎమ్మెల్సీ బరిలో నిలవడమే ఇందుకు కారణం. తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు రాజకీయ చక్రం తిప్పిన దివంగత మాజీ మంత్రి, జనయోధుడు జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు, రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజాకు పిల్లనిచ్చిన మామ గంధం నారాయణ రావు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో రాజాపై పంచాయితీ, ఎంపిటిసి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతతో పాటు, తన మామను ఎమ్మెల్సీగా గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాల్సి వచ్చింది . చాపకింద నీరులా ఆయన ఇందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు.
ఉపాధ్యాయ సమస్యలపై గళం వినిపిస్తున్న గంధం
విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాల్లో పాల్గొన్న నారాయణరావు అనంతరం అధ్యాపకుడిగా సుమారు 34 సంవత్సరాల పాటు 5 ప్రభుత్వ కళాశాలల్లో విద్యాభోధన చేశారు. మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా ఇటీవలే పదవీ విరమణ చేశారు . అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ఆయన మండల స్థాయి నుంచి జిల్లా వరకు అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు . అలాగే అధ్యాపక సంఘం నాయకుడిగా రాష్ట్రస్థాయి ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ, పిజి కళాశాలల యాజమాన్య సంఘం అధ్యక్షుడిగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన అధ్యాపకులు , ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఇప్పటికీ పాటుపడుతున్నారు .
ఎన్నికల బరిలో 11 మంది ఉపాధ్యాయులు
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 11 మంది నిలిచారు. ఈ నెల 14 న జరిగే ఈ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 17 వేల 400 మందికి పైగా ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు . బరిలో నిలిచిన అభ్యర్థులెవరికీ అధికార వైసిపి, రాజకీయ పార్టీలు బహిరంగ మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన షేక్ సాబ్జి యుటిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ప్రస్తుతం యూటీఫ్ కు చెందిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ రాము సూర్యారావు పదవీకాలం మార్చి 29 వ తేదీతో పూర్తి కావడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. మళ్లీ యుటిఎఫ్ ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా అన్న ఆసక్తి ఉపాధ్యాయుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది. సాబ్జి కి యుటిఎఫ్ తో పాటు, ఎపిటిఎఫ్, డిపిఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాయి.
మరోవైపు గత ఎన్నికల్లో ఓటమిపాలైన, యుటిఎఫ్ నేపథ్యం కలిగిన చెరుకూరి సుభాష్ చంద్రబోస్ కూడా పోటీలో నిలిచారు . ఈయన యుటిఎఫ్ ఓట్లు చీల్చడంతో పాటు, తన సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయుల ఓట్ల ఫై దృష్టిసారించారు.
ఇక గంధం నారాయణరావుకు ఎస్టీయూ, పిఆర్టియు, ఇతర సంఘాలు మద్దతు ప్రకటించాయి. అల్లుడు రాజా చొరవతో వైసిపి అనుబంధ ఉపాధ్యాయ సంఘం, జిల్లాలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, ఆపార్టీ శ్రేణులు పరోక్షంగా సహకారం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయ వర్గాల్లో బలమైన యుటిఎఫ్ ఓట్లను సుభాష్ చంద్రబోస్ చీల్చే అవకాశాలు ఉన్నాయి . ఈ నేపథ్యంలో ఇతర సంఘాలు మద్దతుతో పాటు , అధికార వైసిపి పరోక్ష అండ గంధం నారాయణరావు కు ఈ ఎన్నికల్లో కలిసి వస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . ఏది ఏమైనా మార్చి 17 న ఓట్ల లెక్కింపులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.


Click Here and join us to get our latest updates through WhatsApp