జగన్‌ మాట.. భరత్‌ బాట..

By iDream Nagaraju Feb. 22, 2021, 04:00 pm IST
జగన్‌ మాట.. భరత్‌ బాట..

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ రాజకీయాల్లో రాటు దేలిపోయారా? ఎదురు దెబ్బలు కాచుకుంటూ తనదైన శైలిలో రివర్స్‌ అటాక్‌ చేస్తున్నారా? రాజమండ్రి రాజకీయాల్లో తన మార్క్‌ ఏమిటో చూపించేందుకు సాహసిస్తున్నారా? జగన్‌ను మెప్పించి, పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా? ముదురు రాజకీయాలను తట్టుకుని రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను రెపరెపలాడించనున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ రాజకీయ పరిశీలకులు ‘అవును’ అని సమాధానమిస్తున్నారు.

ఎంపీగా ఓ వైపు సమర్థవంతంగా పని చేస్తూనే, మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ పునాదులను పటిష్టం చేసేందుకు భరత్‌రామ్‌ నడుం బిగించారు. అయితే ఈ ప్రయత్నంలో ఆయనకు ఇంటా, బయటా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యల నుంచి బయట పడటం అంత సులువు కాదని చాలా మంది భావించారు. వారి అంచనాలు తలకిందులు చేస్తూ రాజమండ్రి అర్బన్‌ కోఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్‌ కోఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే చందన రమేష్‌ కుమారుడు నాగేశ్వర్‌కు పగ్గాలు అప్పగించడంలో భరత్‌రామ్‌ కీలకంగా వ్యవహరించారు. ఇక ఇక్కడి నుంచి అడుగులు వేయడంలో భరత్‌ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఈ పదవులను కోల్పోయిన వారు, ఆశించిన వారి ఎత్తులకు పైఎత్తు వేస్తూ ప్రజల్లో మరింతగా ఆదరణ చూరగొనేలా కార్యాచరణ రూపొందించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కొంత సఖ్యత లేదనే మాటలు వినిపిస్తున్నా, వారందరినీ కలుపుకుపోగలనని తన చేతలతో నిరూపిస్తున్నారు.

పార్లమెంట్‌లో రాష్ట్రానికి చెందిన సమస్యలను లేవనెత్తడంలో, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతల విషయంలో భరత్‌ రామ్‌ ముందు వరుసలో ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి సారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ తన చతురతతో అన్ని పనులను వెను వెంటనే చక్కబెడుతూ వైఎస్‌ జగన్‌ ఢీల్లీ టీమ్‌లో కీలక సభ్యునిగా మారినట్లు సమాచారం. ఈ విషయంలో ప్రత్యర్థులు కొన్ని ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నించినప్పటికీ భరత్‌ వాటన్నింటినీ అధిగమించారని స్థానికులు చెబుతున్నారు.

ప్రజలతో మరింతగా మమేకం:
ఇప్పటి వరకు ఒక ఎంపీగా నిలదొక్కుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చించిన భరత్‌ రామ్‌ ఇకపై ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంలో భరత్‌ వెనుకబడి ఉన్నారని స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ దృష్ట్యానే ప్రజల్లో మరింతగా మమేకమయ్యేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. రజమహేంద్రవరంలో ఎవరైనా సరే ఇకపై నేరుగా కలిసి మాట్లాడేందుకు మరింత సమయం వెచ్చించనున్నారని సమాచారం. ఏయే రోజుల్లో అందుబాటులో ఉంటారనే విషయమై ముందుగానే ప్రజలకు సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

గెలుపే లక్ష్యంగా అడుగులు:
త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టడం ద్వారా మరింత పట్టు సాధించే దిశగా ప్రత్యేక ప్రణాళిక ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించడంతో పాటు గ్రూపు రాజకీయాలకు చెక్‌ పెడుతూనే.. ఆయా వార్డుల్లో కార్పొరేటర్‌గా విజయం సాధించే గెలుపు గుర్రాలపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. ఏకాభిప్రాయం, అధిష్టానం సూచనలతో నగర పాలక సంస్థపై వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడించడమే ధ్యేయంగా ఆయన ముందుకు అడుగులేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే పలువురితో మాట్లాడి గెలుపు వ్యూహాలు రచించారని స్థానిక నేత ఒకరు చెప్పారు.

పంచాయతీలో సత్తా చాటిన భరత్‌ రామ్‌:
తనకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడంలో తొలి నుంచీ దూకుడుగా వ్యవహరించే ఎంపీ భరత్‌ రామ్‌ తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ తన మార్క్‌ చూపించారు. విపక్షాలకు కంచుకోట లాంటి కడియం మండలంలో వైఎస్సార్‌సీపీ అభిమానుల విజయానికి బాటలు వేశారు. ఈ మండలంలోని పది పంచాయతీలకు గాను ఐదింటిలో విజయదుందుభి మోగించారు.

వాస్తవంగా జనసేన పుట్టింది ఈ కడియం మండలంలోనే అని చెప్పవచ్చు. మరోవైపు సొంత పార్టీ నేతలు కొందరి నుంచి సరైన సహకారం లేదు. లోపాయికారీ రాజకీయాలు, ఎత్తులు, జిత్తులను అధిగమించి ఎట్టకేలకు ఐదు పంచాయతీల్లో పాగా వేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ రాజకీయాలకు చెక్‌ పెడుతూనే, పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నప్పటికీ ఒక చేతి మీదుగా కార్యకలాపాలు సాగితే విజయం సాధించడం పెద్ద కష్టం కాదని నిరూపించారు.

రేపు కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా పూర్తి బాధ్యతలు అప్పగిస్తే ఇంతకు మించి ఫలితం వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి భరత్‌ రామ్‌ రాజమండ్రి అభివృద్ధి కోసం రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు నిధులు మంజూరు చేయించారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సంప్రదింపులు జరిపి ఈ మేరకు నిధులు సాధించారు. రోడ్డు విస్తరణ పనులు, వివిధ అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా చెప్పుకోవడంలో భరత్‌ రామ్‌ ఫెయిల్‌ అయ్యారని, ఇంత తక్కువ సమయంలో ఇన్ని నిధులు తెచ్చినప్పటికీ ఆ విషయాన్ని చాటి చెప్పడంలో ఇంకా వెనుకబడి ఉన్నారని రాజకీయ, అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రేపటి మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ విషయాలన్నింటినీ చాటి చెప్పగలిగితే వైఎస్సార్‌సీపీకి తిరుగులేని విజయం ఖాయం అంటున్నారు. పార్టీలో అంతర్గతంగా గ్రూపు రాజకీయాలున్నప్పటికీ భరత్‌ రామ్‌ సాధించిన ప్రగతి ముందు అవి పెద్దగా పని చేయవని విశ్లేషిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp