పీఠం ఒకటే....ఆశావహులెందరో!

By Voleti Divakar Feb. 23, 2021, 01:40 pm IST
పీఠం ఒకటే....ఆశావహులెందరో!

కోవిడ్ కు ముందు గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మేయర్ సీటును జనరల్ గా ప్రకటించారు. వెంటనే రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఒక టిడిపి నేత అత్యుత్సాహంతో తాను మేయర్ గా పోటీలో ఉన్నట్లు ప్రకటించుకోవడంతో పాటు, తనకు అనుకూలంగా ఉండే మీడియా వారికి ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేశారు. కోవిడ్ రాక, తాజాగా విలీన గ్రామాలపై కోర్టు కేసుల కారణంగా ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. ఒకవేళ ఎన్నికలు జరిగితే ఆయన ఆశ నెరవేరుతుందో లేదో మరి. ఇలాంటి ఆశావహులు అన్ని పార్టీల్లోనూ ఎంతో మంది కార్పొరేషన్ ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా తాను మేయర్ పోటీలో లేనని మొన్నటి వరకు నగర వైసిపి కోఆర్డినేటర్ గా వ్యవహరించిన శ్రీఘాకోళపు శివ రామసుబ్రహ్మణ్యం స్పష్టంగా చెప్పారు. జనరల్ స్థానం కాబట్టి అభ్యర్థులు ఆర్థికంగా, సామాజికంగా బలవంతులై ఉండాల్సి ఉంటుంది.

నాయకుల ఆశలు నెరవేరేనా?
రాజరాజనరేంద్రుడు పాలించిన రెండు నియోజకవర్గాల్లో విస్తరించిన రాజమహేంద్రవరం నగర మేయర్ పీఠంపై ఎంతో మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అధికార వైఎస్సార్ సిపి తరుపున ఎం షర్మిలారెడ్డి, ప్రస్తుత నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, బిసి వర్గానికి చెందిన కోడి ప్రవీణ్ వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

అధిష్టానం అవకాశం ఇస్తే పోటీలో ఉంటానని నందెపు శ్రీనివాస్ చెప్పారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ కూడా ఆసక్తి గా ఉన్నట్లు ఆయన అనుచరులు నర్మగర్భంగా చెబుతున్నారు. దీనిపై పార్టీలోని ప్రత్యర్థి వర్గం ఎలా స్పందిస్తోందో. ఎన్నికలు దగ్గరపడిన తరువాత మరిన్ని పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అధిష్టానం ఆశావహులకు ప్రాధాన్యతనిస్తుందా లేక కొత్త వారిని తెరపైకి తెస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

2014లో మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. ఆ సమయంలో షర్మిలారెడ్డి కూడా మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వైసిపి మేయర్ పదవికి సాధించేందుకు అవసరమైన కార్పొరేటర్ సీట్లు దక్కించుకోలేకపోవడంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. మరోసారి ఆమెకు మేయర్ అభ్యర్థిగా అవకాశం దక్కకపోవచ్చు.

ఈసారి గోరంట్ల మాట చెల్లుబాటు అవుతుందా?

గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మేయర్ పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. తెలుగుదేశంపార్టీ తరుపున ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని, గెలవాలని గన్ని కృష్ణ దశాబ్దాల నుంచి ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో అసెంబ్లీ టిక్కెట్టు కోసం, 2014 ఎన్నికల్లో పార్లమెంటు సీటును ఆశించినా ఆయనకు నిరాశే ఎదురైంది. ఈసారైనా ఆశలు ఫలిస్తాయా అన్నది వేచి చూడాలి.

మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త, వాసు మేయర్ గా పోటీ చేసే విషయమై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. ముందే విందు ఇచ్చిన శాప్ మాజీ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు కూడా మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయానికి టిడిపి నుంచి మరిన్ని పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక్కడో విషయాన్ని గమనించాలి. ఆదిరెడ్డి ప్రత్యేకవర్గంగా ఏర్పడక ముందు వరకు టిడిపిలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాటే చెల్లుబాటయ్యేది. 2001లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా విశాఖపట్నంనకు చెందిన ఎంఎస్ చక్రవర్తిని రంగంలోకి దించి, గెలిపించారు. ఆ తరువాత ఆదిరెడ్డి సతీమణి గృహిణిగా ఉన్న వీరరాఘవమ్మను, అలాగే గత ఎన్నికల్లో కూడా గృహిణిగా ఉన్న ప్రస్తుత వైసిపి నాయకుడు సిసిసి ఎండి పంతం కొండలరావు సతీమణి రజనీశేషసాయిని మేయర్ గా బరిలోకి దింపి గెలిపించగలిగారు. ఈసారి ఎన్నికలు జరిగితే ఆయన సూచించిన వ్యక్తే మేయర్ గా బరిలో దిగుతారా లేక ఆదిరెడ్డి వర్గం ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. లేక ఇరువర్గాలు కలిసి గన్ని కృష్ణకు అవకాశం కల్పిస్తారా అన్నది కూడా వేచిచూడాల్సిందే.

బిజెపి-జన సేన కూటమి అభ్యర్థి ఎవరో?
నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రతీసారి బిజెపి మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తూ వచ్చింది. ఈసారి జన సేనతో పొత్తు బిజెపికి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. దీంతో ఇరు పార్టీలోని ఆర్థికంగా బలమైన వారు మేయర్ పీఠాన్ని ఆశించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయా పార్టీల నాయకులు ఈ విషయంలో గుంభనంగానే ఉన్నారు. ఎన్నికల నాటికి ఆశావహుల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. *

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp