రాజుగారి పదవి పోయిందే...!

By Krishna Babu Oct. 16, 2020, 09:46 pm IST
రాజుగారి పదవి పోయిందే...!

వైసీపీ పై నిత్యం ఏదొక ఆరోపణలు చేస్తూ అనుకూల మీడియాలో రోజూ హల్చల్ చేస్తూన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటివరకు ఆయన నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పదవి నుండి ఎంపీ రఘురామ కృష్ణంరాజుని తప్పిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ స్థానంలో సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బ్యాంకులని మోసగించారనే ఆరోపణలతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేయడమే ఈ పరిణామాలకి కారణం అని తెలుస్తుంది .

రఘురామ కృష్ణం రాజు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు మొత్తం 826.17 కోట్ల మొత్తంలో రుణం బకాయి పడ్డారని, దీనికి సంబంధించిన వ్యవహారంలో ఆయన బ్యాంకుకు సరైన సమాధానం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా బ్యాంకులను మోసం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సౌరభ్ మల్హోత్రా ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రఘురామకృష్ణంరాజు సహా 9 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

గత కొంతకాలంగా బయటికి తెలియని కారణాలతో వైసీపీ పట్ల అసమ్మతి ప్రదర్శిస్తున్న రఘురామ కృష్ణంరాజు , ప్రతిపక్ష టీడీపీ పార్టీ ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలను బలపరుస్తూ వైసీపీ నేతల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ అనుకూల మీడియాలో నిత్యం హల్చల్ చేయసాగారు . ఈ క్రమంలో కొందరు వైసీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ విధానాలు నచ్చకపోతే పార్టీకి , పార్టీ గుర్తుతో గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేయమని డిమాండ్ చేయగా అందుకు ప్రతిగా కొంత అసభ్య పదజాలం కూడా వాడిన రఘురామ కృష్ణంరాజు తాను జగన్ బొమ్మతో గెలవలేదని , నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా జగన్ బొమ్మతో పాటు నా బొమ్మ కూడా పెట్టుకొంటేనే గెలిచారు అని విచిత్ర వాదన తెర పైకి తేవడంతో పాటు తనకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పదవి కూడా వైసీపీ అధిష్టానం సిఫారసు వలన రాలేదని నర్సాపురం ఎంపీగా తన గెలుపు , సమర్ధత చూసి వేరే పార్టీకి చెందాల్సిన కోటాలో తనను నియమించారని చెప్పుకొన్నారు .

అయితే నేడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఆయనను తప్పించడమే కాక తనకు ఏ పార్టీ కోటాలో అయితే పదవి రాలేదని చెప్పుకొచ్చారో అదే వైసీపీ పార్టీ నుండి మరో ఎంపీ బాలసౌరిని ఛైర్మెన్ గా నియమించడం రఘురామ కృష్ణంరాజుకి ఊహించని షాక్ తో పాటు తీవ్రమైన అవమానంగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు .

ఇన్నాళ్లు నరసాపురంలో సొంత బలంతో గెలిచానని ఢిల్లీలో , ఢిల్లీలో తనకు అపార పలుకుబడి ఉందని అందుకే వైసీపీ పార్టీతో సంభందం లేకుండా బిజెపి పెద్దలు పిలిచి పదవి ఇచ్చారని ఏపీలో చెప్పుకొంటూ వైసీపీ పై అసంబద్ధ ఆరోపణలతో రోజూ అనుకూల మీడియాలో గొప్పలు చెప్పుకొంటూ రభస చేస్తున్న రఘురామ కృష్ణంరాజుకి గుక్క తిప్పుకోలేని దెబ్బ తగిలిందని చెప్పొచ్చు .

ఈ పరిణామాలు బట్టి చూస్తే అటు ఢిల్లీలో కానీ , ఇక్కడ నరసాపురంలో కానీ ఆయన చెప్పుకొన్నట్టు ఏ విధమైన పలుకుబడీ లేకపోగా వైసీపీ పార్టీ ద్వారా సంక్రమించిన పార్లమెంటరీ కమిటీ పదవిని అడ్డం పెట్టుకొని బిజెపి పెద్దల అపాయింట్మెంట్ సంపాదించి వారితో ఫొటోలు దిగి వాటిని అడ్డం పెట్టుకొని ఇక్కడ గొప్పలు చెప్పుకొంటున్నాడన్న వైసీపీ నేతల మాటలే నేడు నిజం అయ్యినట్లైంది .

బహుశా రఘురామ కృష్ణంరాజు రేపు ప్రెస్మీట్ పెడితే తనకి పదవి రావటానికి కారణం కాదన్న వైసీపీ పార్టీ , జగన్మోహన్ రెడ్డే తన పదవి పోవటానికి కారణం అని మరో నాలుగు ఆరోపణలు చేస్తారేమో .. అయితే పదవి రావటానికి కారణం కాని వారు పోవటానికి కారణమవుతారా అని వైసీపీ నుండి ప్రశ్న వస్తే సమాధానం చెప్పలేక రాజు గారు మళ్లీ అక్కసు వెళ్లగక్కుకోవడమే తప్ప మరే ప్రయోజనం ఉండకపోవచ్చు .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp