ఏపీ బీజేపీకి, పురంధేశ్వ‌రికి సంబంధం లేదా?

By Kalyan.S Sep. 06, 2021, 09:45 am IST
ఏపీ బీజేపీకి, పురంధేశ్వ‌రికి సంబంధం లేదా?

కేంద్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెబుతున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ కోసం కార్మికులు శ‌క్తివంచ‌న లేకుండా ఉద్య‌మిస్తూనే ఉన్నారు. ప్రాణాలు పోయినా ప్లాంట్ ను వ‌దులుకునేది లేద‌ని చెబుతున్నారు. కార్మికులు ఇంత బావోద్వేగంతో ఉంటే.. ఏపీ బీజేపీ నేత‌లు మాత్రం వింత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్లాంట్ అమ్మేస్తామన్న‌ కేంద్రం ఆ దిశ‌గానే ముందుకెళ్లిపోతోంది. ఈ క్ర‌మంలో స్టీల్ ప్లాంట్ విక్ర‌యించ‌కుండా కేంద్రాన్ని ఒప్పిస్తామ‌ని ఓ సంద‌ర్భంలో బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కార్మికుల‌కు హామీ ఇచ్చారు. ప్లాంట్ ఎక్క‌డికీ పోద‌ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మ‌రో నేత పురందేశ్వ‌రి అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌ను వ‌దిలేసి ప్యాకేజీని ప్ర‌స్తావిస్తుండ‌డం కార్మికుల్లో అగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంది.

నంద‌మూరి కుటుంబం నుంచి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన పురంధేశ్వ‌రి రాజకీయంగా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరించిన ఆమె తన సత్తాను చాటారు. అలాంటి ఆమె.. రాష్ట్ర విభజన వేళలో అనుసరించిన వైఖరి.. ఆమెకు లాభం కంటే నష్టాన్నే కలుగజేసింది. కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పేసి బీజేపీలోకి వెళ్లినప్పటికీ.. తనదైన మార్కును చూపించలేకపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గడిచిన కొన్నేళ్లుగా అవసరమైన అంశాల కంటే కూడా అనవసరమైన విషయాల మీదనే ఆమె ఎక్కువగా ఫోకస్ చేయటం.. వివాదాల్లో కూరుకుపోవటం తరచూ జరుగుతోంది.

తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కార్మికుల‌కు, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆగ్ర‌హం తెచ్చేలా ఉన్నాయ‌నే చెప్పాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్లదని.. ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూస్తామని.. మెరుగైన ప్యాకేజీ దక్కేలా చూస్తామని ఆమె వ్యాఖ్యానించటం గమనార్హం. విశాఖ ప్లాంట్ అంటే.. భౌతికంగా కనిపించే ఫ్యాక్టరీ.. అందులో పని చేసే ఉద్యోగులు మాత్రమే అని పురంధేశ్వరి పొరపడినట్లున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక ఎంతో భావోద్వేగం ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. దాదాపు రూ.2లక్షల కోట్ల విలువైన ప్రజాఆస్తిని రూ.33వేల కోట్లకు కారచౌకగా కట్టబెట్టటంపై ఏపీ ప్రజలు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు.. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కాకుండా లాభాల్లో ఉన్న వేళ.. దాన్ని అమ్మేయాలని చూడటం వెనుక లాజిక్ ఏమిటన్నది కేంద్రం ఇప్పటికి చెప్పలేకపోతోంది. స్టీల్ ప్లాంట్ అమ్మకంతో ఉద్యోగుల భద్రత కోణంలోనూ.. ప్రజల ఉద్యమాన్ని.. ఆగ్రహాన్ని పరిమిత కోణంలో చూస్తున్న వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

తాజాగా మాట్లాడిన ఆమె.. ‘‘మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి. మౌలిక సదుపాయాలకు వనరులు అవసరం. ఐదు రంగాల్లో నిరర్ధక ఆస్తులను వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. అలాంటి నిరుపయోగ ఆస్తులు వినియోగించుకోవడం మేం సమ్మతిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు. ఉద్యోగులకు ప్యాకేజీ ఇవ్వడం వారిని ఆదుకునే అంశంపై ఆలోచిస్తాం. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఏపీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని పురంధేశ్వరి మర్చిపోయి.. ఉద్యోగుల ప్యాకేజీ గురించి మాట్లాడటం ఆమె ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికితోడు ఏపీ బీజేపీ లోని నేత‌లు త‌లోమాట మాట్లాడుతుండ‌డం మ‌రింత వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp