నిన్న ఎమ్మెల్యే.. నేడు కార్పొరేట‌ర్ పై దాడి : ‌కార‌ణం తెలిస్తే షాక్‌

By Kalyan.S Oct. 18, 2020, 06:45 pm IST
నిన్న ఎమ్మెల్యే.. నేడు కార్పొరేట‌ర్ పై దాడి : ‌కార‌ణం తెలిస్తే షాక్‌

మ‌హాన‌గ‌రంలో వ‌ర‌ద‌లు తెచ్చిన విప‌త్తు మామూలుగా లేదు. ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లు ఐదు రోజులుగా ఇళ్ల‌లోనే బందీలుగా ఉంటున్నారు. నిత్యావ‌స‌రాలు, దుస్తులు సైతం త‌డిసిపోవ‌డంతో న‌ర‌కం అనుభ‌విస్తున్నారు. రాక‌పోక‌లు బంద్ కావ‌డంతో బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌.. ఇంట్లో ఉండ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రోజులు పెరిగే కొద్దీ ఆ ఆవేద‌న కాస్తా.. ఆగ్ర‌హంగా మారుతోంది. ఏళ్ల త‌ర‌బ‌డి స‌మ‌స్య‌లు ఉన్నా ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డం.. అక్ర‌మ నిర్మాణాల ప్రోత్సాహంలో వారి పాత్ర కూడా ఉండ‌డంతో కొంత మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఉప్ప‌ల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని నిల‌దీసిన స్థానికులు... ఆదివారం ఏకంగా ఓ కార్పొరేట‌ర్ పై దాడికి పాల్ప‌డ్డారు. మ‌హిళ‌లు సైతం పిడిగుద్దులు కురిపంచారు.

నీ పేరు రాసి చ‌స్తాం..

వరద సహాయక చర్యలను పర్యవేక్షించి పరిస్థితిని సమీక్షించటానికి బోటులో అధికారులతో కలిసి తమ కాలనీకి వచ్చిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డిని అక్కడి మహిళలు గట్టిగా నిలదీశారు. మూడు రోజుల నుంచి వరదల్లో తమ ఇళ్లు మునిగిపోయాయని, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక పిల్లలతో కలిసి తిప్పలు పడుతున్నా.. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ మహిళలు ఎమ్మెల్యేతో వాగ్వీవాదానికి దిగారు. తమను సురక్షిత ప్రాంతానికి ఎందుకు తరలించటం లేదని ఎమ్మెల్యేపై మహిళలు మండిపడ్డారు. మహిళలు అగ్రహం వ్యక్తంచేస్తుండటంతో వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి చోట ఇళ్లు ఎవరు నిర్మించుకొమ్మని చెప్పారంటూ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రశ్నించారు. అనుకోకుండా వరదలు వస్తే ఇందులో తాము చేయడానికి ఏముంటుందని సదరు మహిళలను ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించారు. అప్పటికే ఆవేదనతో రగిలిపోతున్న ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మీరే కదా ?.. మరి పర్మిషన్ ఎందుకు ఇచ్చారంటూ మహిళలు మరోసారి ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఒకవేళ తాము ఈ వరదల్లోనే చిక్కుకుని చావాల్సి వస్తే.. 'నీ పేరే రాసి చస్తాం' అంటూ ఎమ్మెల్యేను హెచ్చరించింది ఓ మహిళ.

కార్పొరేట‌ర్ చొక్కా ప‌ట్టుకున్న మహిళ‌

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన హయత్‌ నగర్‌ కార్పోరేటర్‌కు చేదు అనుభవం ఎదురైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది. వాటితో పాటుగానే నగరంలోని పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో వరద పరిస్థితిని పరిశీలించేందుకు, ముంపునకు గురైన ప్రాంతాలను చూసేందుకు హయత్‌ నగర్‌ కార్పోరేటర్‌ సామా తిరుమల్‌ రెడ్డి వెళ్లారు. ఆదివారం ఉదయం బంజారా కాలనీని సందర్శించడానికి వెళ్లిన ఆయనను స్థానికులు నిలదీసి ప్రశ్నించారు. నాలా కబ్జాలే ముంపుకు కారణం అంటూ కోపోద్రిక్తులయ్యారు. గతంలో తాము నాలా భూములు కబ్జాకు గురి అవుతున్నాయని అధికారులు, కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క‍్రమంలో ఓ మహిళ కార్పోరేటర్‌ చొక్కా పట్టుకుని నిలదీశారు. అందరి ముందు ఓ మహిళ తన చొక్కాపట్టుకుని నిలదీయడంతో ఒక్కసారిగా కార్పోరేటర్‌ కంగు తిన్నారు. ఆ తర్వాత స్థానికులకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp