ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్..! తెలంగాణనే ఆయన ఊపిరి!!

By Kalyan.S Aug. 06, 2020, 07:39 pm IST
ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్..! తెలంగాణనే ఆయన ఊపిరి!!

అంద‌రూ ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ ను తెలంగాణ సిద్ధాంతకర్తగా పిలుస్తారు. ఆయన మాత్రం నేను సిద్దాంతకర్తను కాను అలా పిలవకండి అని చాలా సందర్భాల్లో చెప్పేవారు. ''సిద్ధాంతకర్త అని ఎందుకొచ్చిందో నాకు తెల్వదు. నన్ను ఎప్పుడూ సిద్ధాంతకర్త అనుకోలే. అనుకోకూడదు. చాలా బహిరంగ సభలో జెప్పిన అయినా వినడం లేదు. చివరకు నన్ను టీఆర్ఎస్ సిద్ధాంతకర్తను కూడా జేసిండ్రు. నేనేం చేయాలి.'' అని అంటుండేవారు. కానీ ఆయ‌న తుదివ‌ర‌కూ తెలంగాణ రాష్ట్రం.. సిద్ధాంతం కోసం త‌ప్పించిన సిద్ధాంత‌క‌ర్తే. నా కోరిక ఎప్పుడూ ఒక‌టే అని చెప్పేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును క‌ళ్లారా చూడాల‌ని, ఆ త‌ర్వాతే చ‌నిపో్వాల‌ని కోరుకునేవారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు రాష్ట్ర ఏర్పాటును చూడ‌క‌ముందే 2011 జూన్ 21న క‌న్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఎన్నో పుస్త‌కాలు ర‌చించి జాతిని మేల్కొలిపారు.

ఉద్య‌మానికే జీవితం అంకితం.. అందుకే బ్ర‌హ్మ‌చ‌ర్యం

వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో ఆగష్టు 6, 1934న జ‌న్మించిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ తుది వ‌ర‌కూ తెలంగాణ కోస‌మే ప‌నిచేశారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశారు. ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పేవారు.

కేసీఆర్ పాదాభివంద‌న‌పై...

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు జ‌య‌శంక‌ర్ అంటే చాలా అభిమానం. ఓ ర‌కంగా గురువుగా భావించేవారు. జ‌య‌శంక‌ర్ సార్ అంటూ చాలా గౌర‌వంగా చూసేవారు. రాష్ట్రం కోసం ఉద్య‌మాలు జ‌రుగుతున్న వేళ బహిరంగ సభల్లో జయశంకర్‌కు కేసీఆర్‌ పాదాభివందనం చేసేవారు. ''కేసీఆర్ నాకు పాదాభివందనం చేస్తడు. వద్దని చాలా చెప్పిన. ఆయన నన్ను ఒక ఫాదర్ ఫిగర్‌గా ట్రీట్ చేసి బర్త్‌డే రోజు మొట్టమొదట నాకు పాదాభివందనం చేయందే బయటికి రాడు ఆయన. పర్సనల్ విషయాలివన్నీ. అయితే కేవలం పొలిటికల్ ప్లాట్‌ఫాం మీద మొక్కితే పొలిటికల్ అయితది.'' అని ఆయ‌న చాలా సంద‌ర్భాల్లో అన్నారు.

డిగ్రీ క‌ళాశాల కోసం నాడు ఉద్య‌మం

తాను పుట్టిన వ‌రంగ‌ల్ జిల్లాలో అప్ప‌ట్లో డిగ్రీ క‌ళాశాల లేదు. 1953లో వరంగల్‌లోనే జయశంకర్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. దీంతో డిగ్రీ చ‌దువు కోసం హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. దీంతో సహ విద్యార్థులతో కలిసి ఆయన వరంగల్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఉద్యమించారు. ఆ ఉద్యమ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి ఆయన ఒకసారి చెబుతూ, ''డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలనే మా ఉద్యమానికి టీచర్లు కూడా మద్దతిచ్చారు. మా ఉద్యమం పెద్ద ఊరేగింపుగా మారింది. డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని నినాదాలు చేసేవాళ్లం. నా నోటి నుంచి అనుకోకుండా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అని వచ్చింది. అందరు నవ్వారు. కానీ, 30 ఏళ్ల తర్వాత యూనివర్సిటీ వచ్చింది. దానికి తర్వాత కాలంలో నేను వైస్ ఛాన్సలర్ అయ్యాను.'' అని వెల్లడించారు.

విలువ‌ల‌తో కూడిన విద్య‌.. ప్ర‌ముఖుల గురువు..

అధ్యాపకుడిగా ఎంతో మందికి మార్గనిర్దేశం చేసిన ఆయ‌న విద్య‌తో పాటు విద్యార్థుల‌కు విలువ‌లు నేర్పేవారు. స‌మాజంలో ఎలా మెల‌గాలో చెప్పేవారు. సామాజిక స్పృహ క‌లిగించేవారు. తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమ‌ర్జెన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమ్జన్సీ గడ్డురోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ కే సాధ్యం అంటూ ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రముఖ సాహీతివేత్త రామశాస్త్రి కన్నీళ్లపర్యంతమయ్యారు. జయశంకర్ విద్యార్థుల్లో అనేక మంది దేశవిదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయూ మాజీ ప్రొఫెసర్ ఎన్. లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ కే. సీతారామావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్.

ఓయూనే ఊపిరి...

ఉస్మానియా యూనివ‌ర్సిటీ అంటే జ‌య‌శంక‌ర్ కు ఎన‌లేని అభిమానం. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పోషించిన పాత్ర వెనుక ఆయ‌న కృషి ఎంతో ఉంది. ఉస్మానియాపై ఆయ‌న‌కు ఎంత ప్రేముందో ఓ సంద‌ర్భంలో అన్న ఈ మాట‌లు తెలియ‌జేస్తాయి. 'ఉస్మానియాను తలచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది చెప్పు.. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తయి.. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తు కనిపిస్తరు. దు:ఖమొస్తది.. అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు… అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం.'' అని ఒక ఆయన గుర్తు చేసుకునేవారు.

తెలంగాణ కోస‌మే ర‌చ‌న‌లు

ఆయ‌న ఎన్ని ర‌చ‌న‌లు రాసినా అందులో తెలంగాణ‌మే ఆయ‌న నినాదంగా ఉండేది. జ‌య‌శంక‌ర్ ర‌చ‌నల్లో ప్ర‌స్తావ‌న త‌ప్ప‌నిస‌రిగా క‌నిపించేది. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌, తెలంగాణలో ఏం జరుగుతోంది.., తల్లడిల్లుతున్న తెలంగాణ (వ్యాస సంపుటి), 'తెలంగాణ' (ఆంగ్లంలో), వక్రీకరణలు - వాస్తవాలు.. ఇలా దాదాపుగా ఆయ‌న ర‌చ‌న‌ల‌న్నీ తెలంగాణ చుట్టే తిరిగేవి. ఆ ప్రాంత ప్రాధాన్యాన్ని, స‌మ‌స్య‌ల‌ను వాటిలో పొందుప‌రిచేవారు. స్వ‌రాష్ట్ర ఆవ‌శ్య‌క‌త‌ను ఆవిష్క‌రించేవారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న ర‌చ‌న‌లు కూడా ‌ఉద్య‌మానికి ప్రేర‌ణగా నిలిచిపోయాయి.

- నేడు ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp