గెజిట్ల అమలుకు కసరత్తు.. తెలుగు రాష్ట్రాలు ఏం చేయబోతున్నాయి..?

By Karthik P Jul. 31, 2021, 11:24 am IST
గెజిట్ల అమలుకు కసరత్తు.. తెలుగు రాష్ట్రాలు ఏం చేయబోతున్నాయి..?

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు తెరదించేలా గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (జీఆర్‌ఎంబీ), కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కే ఆర్‌ఎంబీ) పరిధులను నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ల అమలుపై ఆయా బోర్డులు కసరత్తులు మొదలు పెట్టాయి. ఈ నెల 16వ తేదీన గెజిట్లు జారీ కాగా.. 90 రోజుల్లో తెలుగు రాష్ట్రాల పరిధిలోని రెండు నధులపై ఉన్న అన్ని ప్రాజెక్టులు ఆయా బోర్డుల పరిధిలోకి రానున్నాయి. అక్టోబర్‌ 14వ తేదీన నుంచి కృష్ణా నదిపై ఉన్న 71 ప్రాజెక్టులు, కృష్ణా నదిపై ఉన్న 36 ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ అంతా రెండు బోర్డులే చూసుకోబోతున్నాయి.

గెజిట్లు జారీ అయి పక్షం రోజులు ముగిశాయి. ఇంకా 75 రోజులు మాత్రమే సమయం ఉండడంతో రెండు బోర్డులు తమ పనిని చేసేందుకు రెండు రాష్ట్రాలతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నాయి. జీఆర్‌ఎంబీపై విడుదలైన గెజిట్‌ను అమలు చేసేందుకు తాజాగా బోర్డు 11 మంది అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు అధికారులు సభ్యులుగా ఉన్నారు. వచ్చే నెల 3వ తేదీన హైదారాబాద్‌లో ఈ సమన్వయ కమిటీ తొలి భేటీ జరగబోతోంది.

కేఆర్‌ఎంబీ కూడా గెజిట్ల అమలుకు చర్యలు చేపట్టింది. ప్రాజెక్టుల కార్యకలాపాలపై నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు వీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు ఇద్దరేసి అధికారులను తమకు కేటాయించాలని కే ఆర్‌ఎంబీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. రెండు సర్కిళ్లను ఏర్పాటు చేయాలని కే ఆర్‌ఎంబీ యోచిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు, ఎగువన ఉన్న ప్రాజెక్టులను ఒక సర్కిల్‌గా, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు, దిగువన ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు మరో సర్కిల్‌ను ఏర్పాటు చేసి. ఇద్దరు ఎస్‌ఈలను నియమించాలని బోర్డు భావిస్తోంది. ఇందు కోసం 300 మంది సాగునీటి అధికారులు అవసరం అవుతారని ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రాజెక్టుల వద్ద భద్రత కోసం 300 మంది సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు అవసరం అవుతాయని కేఆర్‌ఎంబీ అంచనా వేస్తోంది.

Also Read : లోక్ సభలో రఘురామరాజు ప్రశ్నలు అడిగే అవకాశం ఎలా వస్తుంది?

అందరి దృష్టి తెలంగాణపైనే..

రెండు బోర్డులు కేంద్రం జారీ చేసిన గెజిట్లను అమలు చేసేందుకు సిద్ధమైన వేళ.. తెలంగాణ రాష్ట్రం ఎలా స్పందింస్తుందనే అంశంపైన ఆసక్తి నెలకొంది. గెజిట్లు జారీ చేసిన సమయంలో వాటిని స్వాగతిస్తున్నామని ఏపీ సర్కార్‌ తెలుపగా.. తెలంగాణ మాత్రం మౌనంగానే ఉండిపోయింది. అయితే గెజిట్లను వ్యతిరేకిస్తోందనే సంకేతాలైతే వెలువడ్డాయి. బోర్డుల నిర్వహణకు రెండు రాష్ట్రాలు ఒక్కొక్క బోర్డుకు 200 కోట్ల రూపాయల నిధులు జమ చేయాలని రెండు బోర్డులు లేఖలు రాశాయి. అయితే ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ స్వాగతించిన నేపథ్యంలో నిధులు జమ చేయడంపై సందేహాలు లేవు. తెలంగాణ ఏం చేస్తుందనే అంశంపైనే అందరి దృష్టి నెలకొంది. వచ్చే నెల 3వ తేదీన జరిగే జీఆర్‌ఎంబీ సమన్వయ కమిటీ సమావేశంలో తెలంగాణ వైఖరి ఏమిటన్నది తెలిసే అవకాశం ఉంది.

వివాదాలు పరిష్కారం అవుతాయా..?

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన, నిర్మాణంలోనూ, ప్రతిపాదన దశలోనూ ఉన్న పలు అనుమతులులేని ప్రాజెక్టులను రెండు గెజిట్లలో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. గెజిట్లు విడుదలైనప్పటి నుంచి ఆరు నెలల లోపు (జనవరి 14) ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు, పత్రాలు సమర్పించి బోర్డుల నుంచి అనుమతులు పొందాలని గెజిట్లలో స్పష్టంగా పేర్కొన్నారు.

కృష్ణా బేసిన్‌లో..

కృష్ణా బేసిన్‌లో నిర్మాణంలో ఉన్న పది ప్రాజెక్టులకు, పూర్తయిన మూడు ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం.. పూర్తయిన ఐదు ప్రాజెక్టులకు, నిర్మాణంలో ఉన్న మూడు ప్రాజెక్టులకు, ప్రతిపాదన దశలో ఉన్న ఒక ప్రాజెక్టుకు అనుమతులు పొందాల్సి ఉంది. నిర్మాణంలో ఉన్న మున్నేరు ప్రాజెక్టుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనుమతులు పొందాల్సి ఉంది.

గోదావరి బేసిన్‌లో...

గోదావరి బేసిన్‌లో రెండు రాష్ట్రాలు అనుమతులు లేకుండా 15 ప్రాజెక్టులు చేపట్టాయి. ఇందులో 11 ప్రాజెక్టులు తెలంగాణావి కాగా,, నాలుగు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి ఉన్నాయి.

నీటి లభ్యత తక్కువగా ఉన్న కృష్ణా బేసిన్‌లోనే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అక్కడ మొదలైన వివాదాలు.. గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులకు చేరుతున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు.. అక్రమ ప్రాజెక్టులు చేపడుతున్నాయని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. అనుమతులు పొందాల్సిన ప్రాజెక్టులపై మరోసారి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం చెలరేగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో జీఆర్‌ఎంబీ, కే ఆర్‌ఎంబీలు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను ఎలా పరిష్కరిస్తాయన్నది ఆసక్తికరం.

Also Read : దిశ చట్టం అమలు దిశగా కేంద్రం ముందడుగు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp