ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో...మహేశ్ బాబు

By Amar S 01-12-2019 06:56 PM
ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో...మహేశ్ బాబు

యువ వైద్యురాలి హత్యోదంతంపై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించాడు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపాడు. తన స్వరంతో ఉన్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
యువ వైద్యురాలి హత్యోదంతంపై యావత్తు దేశం భగ్గుమంటోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు మండిపడుతోంది. తాజాగా టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు.. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మరిన్ని కఠిన చట్టాలు తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు.


మహేశ్ ట్వీట్
"రోజులు గడుస్తూనే ఉన్నాయి. పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఒక సమాజంగా మనం విఫలమవుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నా విన్నపం ఏంటంటే.. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అంతా కలిసి మహిళలకు అండగా నిలుద్దాం.. భారతదేశాన్ని సురక్షితంగా మార్చుదాం."
-మహేశ్ బాబు, సినీ నటుడు

కేటీఆర్‌, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశాడు మహేశ్. అలాగే సామాజిక మాధ్యమాల్లో మహేశ్‌ బాబు స్వరంతో ఉన్న ఓ సందేశం చక్కర్లు కొడుతోంది. అందులో ఈ హీరో కవితా రూపంలో ఉన్న కొన్ని పంక్తుల్ని చదువుతూ.. మగాళ్లకు తమ బాధ్యతని గుర్తుచేశాడు. ఇంతకీ ఆ కవితేంటో చదివేయండి..
ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో..
ఎవరి మాట మన్ననగా ఉంటుందో..
ఎవరి మనసు మెత్తగా ఉంటుందో..
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో..
ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం.. సమాజంలో గౌరవం ఉంటాయో..
ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి, ఆత్మకి విలువిస్తారో..
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో..
ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో..
స్త్రీకి శక్తి ఉంది.. గుర్తింపు ఉంటుంది.. గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో..
ఎవరికి దగ్గరగా ఉంటే.. వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో..
అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు..
ఒక్క మాటలో చెప్పాలంటే.. వాడే మగాడు..

మహేశ్‌ స్వరంతో ఉన్న ఈ సందేశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News