కార్పొరేట్‌ ఆసుపత్రుల కరోనా దందా

By Jaswanth.T Aug. 07, 2020, 08:20 pm IST
కార్పొరేట్‌ ఆసుపత్రుల కరోనా దందా

సంక్షోభంలో నుంచి కొత్త వ్యాపారాలను వెతుక్కుని బాగుపడేవారు కొందరు ఉంటుంటారు. వైద్య రంగంలోనైతే ఇటువంటి తీరుకు కొదవేలేదు. వృత్తినే దైవంగా నమ్ముకుని సేవలందిస్తున్న కొందరిని మినహాయిస్తే అత్యధిక శాతం మంది కాసులవేటలోనే తరిస్తున్నారన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. కార్పొరేట్‌ కంపెనీలు వైద్యరంగంలోకి అడుగుపెట్టాక రోగుల మీద కాసులవేట విస్తృతమైపోయింది. ప్రస్తుతం కరోనా సమయంలో ఈ డబ్బులు దండుకోవడం ఎక్కువైపోవడంతో సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి. కరోనా వచ్చిన కొత్తలో కేవలం ప్రభుత్వ వైద్యులు మాత్రమే ధైర్యంగా ఎదుర్కొనేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వం అనుమతికి ఇచ్చినప్పటికీ కొందరు మినహా ఎక్కువ మంది వైద్యులు ఆసుపత్రులు మూసేసిన విషయం ఇంకా జనం మరువనేలేదు.

ప్రభుత్వ నిబందనల మేరకు ఆసుపత్రులు మూసివేసినప్పటికీ తమ వృత్తి ధర్మం మేరకు టెలీ మెడిసిన్‌ విధానంలో తమ రోగులకు సేలందించిన వైద్యులు కూడా లేకపోలేదు. వారిని ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. అయితే కొందరి కారణంగా మొత్తం వైద్య రంగానికే తీరని కళంకం వస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కోవిడ్‌ చికిత్సకు పలు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అనుమతిలిచ్చాయి. ఈ అనుమతులను సాకుగా చూపి లక్షలు దండుకునేందుకు కొందరు సిద్దమైపోయారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్‌ నిండిపోవడంతో, కాస్తంత కలిగిన వారు ప్రైవేటు ఆసుపత్రులవైపు చూస్తున్నారు. అయితే అక్కడ ఎదురవుతున్న పరిస్థితి చూసి నోరెళ్ళబెడుతున్నారు.

ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చేందుకు తీసుకువెళితే ముందు బెడ్స్‌ ఖాళీ లేవని చెప్పారని, కొంచెం చూడండి సర్‌ అని బ్రతిమలాడితే రోజుకు రూ. 40వేలు అవుతుందని, ముందుగా ఒకటిన్నర లక్షల రూపాయలను చెల్లించాలని చెప్పారి రాజమహేంద్రవరానికి చెందిన ఒక కోవిడ్‌ బాధితుడి బంధువు వాపోయాడు. డబ్బులు చెల్లిస్తామంటే మంచం సిద్ధమైపోయిందని, కానీ ఆ డబ్బులు చెల్లించుకోలేని వారి పరిస్థితి ఏంటని తల్చుకుంటేనే భయమేస్తోందని అతడు ఆవేదన వ్యక్తం చేసాడు. వీటికి తోటు సీటీ స్కాన్, మందులు, ఇతర సేవల పేరుతో భారీగానే ఫీజులు వసూలు చేస్తుండడంతో రోగానికంటే, ఆసుపత్రి ఫీజులే జనం ఎక్కువ భయపడుతున్నారు.

ఏపీలో కోవిడ్‌ 19 నియంత్రణకు ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపడుతుండడంతో ఇటువంటి బాధితులు తక్కువగానే ఉండొచ్చు. తెలంగాణాలోనైతే ఏకంగా ఆరోగ్య శాఖా మంత్రి ఒక హాస్పటల్‌పై చర్య తీసుకున్నాం, మరో రెండు ఆసుపత్రులపై చర్యలకు సిఫార్సు చేస్తున్నామని మీడియా ముందే వెల్లడించారు. వీటిని పరిశీలిస్తే ప్రాణభయంతో ఉన్న ప్రజల నుంచి కూడా డబ్బులు పిండుకోవచ్చన ధోరణితో వ్యవహరించడం పట్ల ఏహ్యభావం కలక్కమానదు. వ్యాధి పట్ల పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతోపాటు, పరిస్థితుల ప్రభావంతో ఏర్పడ్డ భయం కారణంగా పలువురు తమ శక్తికి మించినదే అయినప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వ్యాధి నివారణ, చికిత్సలను గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కోవిడ్‌ 19 చికిత్సపై ప్రైవేటు ఆసుపత్రులు అందించే సేవలను కూడా ఉన్నతాధికారులు పర్యవేక్షించే విధంగా చర్యలు చేపడితేనే ఇటువంటి దందాకు చెక్‌పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp