నేడు ప్రధాని కీలక ప్రకటనలు.. వీటిపై క్లారిటీ?

అన్ లాక్ 1.0 నేటితో ముగియనుంది. అలాగే లాక్ డౌన్ విధించి 100 రోజులు పూర్తి కానుంది. మరి రేపటి నుంచి పరిస్థితి ఏంటి..? కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు అన్ లాక్ చేసుకుంటూ పోవడమేనా..? లేదా ప్రమాదకర స్థాయిలో రంకెలేస్తున్న మహమ్మారి కి అడ్డుకట్ట వేసేందుకు మళ్లీ లాక్ డౌన్ తెరపైకి వస్తుందా.., లేదా కఠిన ఆంక్షలు ఉంటాయా..? అనే చర్చలకు తెర దించుతూ అన్ లాక్ 2.0 మార్గ దర్శకాలను సోమవారం సాయంత్రమే కేంద్రం విడుదల చేసింది. దాదాపు అన్ లాక్ 1.0 ఉన్న మార్గదర్శకాలే ఇందులో ఉన్నాయి. అదనంగా జూలై 15 నుంచి కేంద్ర, రాష్ట్రాలకు చెందిన శిక్షణా సంస్థల్లో కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. కట్టడి ప్రాంతాల్లో జూలై 31 వరకు కఠిన లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. కంటైన్ మెంట్, బఫర్ జోన్లను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించింది.
ప్రసంగం.. ప్రాధాన్యం..
మార్గ దర్శకాల విడుదల అనంతరం పీఎంఓ కార్యాలయం నుంచి మరో ప్రకటన విడుదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు పేర్కొంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని ప్రసంగిస్తారు. ఇదే రోజు ఉదయం భారత్-చైనా కమాండర్ల స్థాయి చర్చలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే కేంద్రం చైనాకు చెందిన 59 యాప్లను బ్యాన్ చేసింది. లాక్ డౌన్ 5.0 ముగియనుండడం, లాక్ డౌన్ విధించిన వంద రోజులు పూర్తి కావస్తుండడం, అన్ లాక్ 2.0 ప్రారంభం.. మరో వైపు చైనా తో వివాదాల నేపథ్యంలో ప్రధాని ప్రసంగం అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుంది. మరోవైపు విదేశీ వస్తువుల వాడకం తగ్గించి.. స్థానిక వస్తువుల విక్రయాలు చేయాలని మోడీ మేడిన్ ఇండియా పిలుపు ఇచ్చారు. స్థానిక సంపదను పెంచాలన్నారు. ప్రజలు మాత్రం ప్రధానంగా చైనా వస్తువుల బ్యాన్ పైనే పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంపై మోడీ ఏం చెబుతారోనన్న ఆతృత సర్వత్రా నెలకొంది.
అన్ లాక్ 1.0 లో 3.40 లక్షల కేసులు
లాక్ డౌన్ 1 నుంచి లాక్ డౌన్ 4 వరకు దేశంలో 2.20 లక్షల వరకూ కరోనా కేసులు నమోదైతే.. కేవలం అన్ లాక్ 1.0లో అంటే జూన్ 1 నుంచి జూన్ 29 వరకు 3. 40 లక్షల పైగానే పాజిటివ్ కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యయా. మూడు నెలల కాలం కంటే ఒక్క నెలలో నమోదైన కేసులే ఎక్కువ. ఈ నేపథ్యంలో అన్ లాక్ 2.0 ప్రకటించినా... పెరుగుతున్న కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు మోడీ కొన్ని సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ప్రాంతాల నుంచి ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న ప్రధాని వాటిపై ఏం చెబుతారో చూడాలి.
ఆర్థిక అవసరాలపై...
కరోనా ధాటికి కుదేలైన ఆర్థిక వ్యవస్థను జవసత్వాలు అందించేందుకు మార్చి 12న కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చూకూరిన లబ్ధి, దేశ ఆర్థిక వ్యవస్థ లో వచ్చిన మార్పులపై మాట్లాడుతూ... భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు చేయాల్సిన పనిపై సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి.


Click Here and join us to get our latest updates through WhatsApp