సాధారణ టీచర్ ఆ దేశానికి అధ్యక్షుడయ్యారు

By Srinivas Racharla Jul. 20, 2021, 08:00 pm IST
సాధారణ టీచర్ ఆ దేశానికి అధ్యక్షుడయ్యారు

పెరూ దేశ అధ్యక్ష ఎన్నికలలో ఎలిమెంటరీ టీచర్ సత్తా చాటాడు. ప్రపంచంలో రాగి ఉత్పత్తి చేసే అతిపెద్ద రెండవ దేశమైనా "పెరూ" లో సాధారణ ప్రైమరీ టీచర్‌గా విధులు నిర్వర్తించిన వ్యక్తి అధ్యక్ష పీఠం చేజిక్కించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

గత జూన్‌ 6న పెరూ దేశ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరిగాయి. హోరాహోరీ జరిగిన అధ్యక్ష ఎన్నికలలో 51ఏళ్ల వామపక్షవాది పెడ్రో కాస్టిల్లో మితవాద పార్టీ పాపులర్‌ ఫోర్స్‌ (ఎఫ్‌పి) పార్టీకి చెందిన కైకో ఫుజిమోరిని 44వేల ఓట్ల తేడాతో ఓడించారు. కాగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమోరి కుమార్తె ఫుజిమోరి అధ్యక్ష ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ ఆ దేశ నేషనల్‌ జ్యూరీ ఆఫ్‌ ఎలక్షన్స్‌ (జెఎన్‌ఇ)కి ఫిర్యాదు చేశారు.దీంతో కాస్టిల్లో గెలిచిన అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తూ పెరూ రాజధాని లిమాలోని ఎలక్టోరల్ ట్రిబ్యునల్ ముందు వివిధ ప్రాంతాల నుండి వందలాది పెరువియన్లు ఒక నెలకు పైగా క్యాంప్ చేశారు.అలాగే ఎన్నికలు ముగిసి నెల రోజులైనా ఫలితాలపై ప్రతిష్టంభన వీడకపోవడంతో ఇటీవల కాస్టిల్లో మద్దతు దారులు వీధుల్లోకి వచ్చి పెద్దయెత్తున నిరసనలు తెలిపారు.

Also Read : మణిపూర్‌ కాంగ్రెస్‌లో కుదుపు.. అధ్యక్షుడు సహా 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా

ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం పాటు జరిగిన కౌంటింగ్ అనంతరం ఎన్నికలలో పెడ్రో కాస్టిల్లో గెలుపొందినట్టు పెరూ దేశ ఎలక్షన్ చీఫ్ జార్జ్ సలాస్ అధికారికంగా ప్రకటించారు.అధ్యక్ష ఎన్నికలలో ఫుజిమోరిపై 44,058 ఓట్ల మెజారిటీ సాధించిన సోషలిస్ట్ పెడ్రో కాస్టిల్లో ని రిపబ్లిక్ అధ్యక్షుడిగా మరియు దినా బోలుయార్టేను మొదటి ఉపాధ్యక్షునిగా ఎన్నికైనట్లు ఎలక్షన్ అథారిటీ ప్రకటించింది.

1985 నుండి పాలించిన మాజీ పెరువియన్ అధ్యక్షులందరూ అవినీతి ఆరోపణలలో చిక్కుకున్నారు. అరెస్టు చేయబడిన అధ్యక్షులలో కొందరు జైలు లేదా వారి భవనాలలో నిర్బంధించ బడ్డారు. ఒక అధ్యక్షుడు అయితే ఏకంగా పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు ఆత్మహత్య చేసుకున్నారు.దీనికి పరాకాష్టగా నవంబర్ 2020 లో కేవలం 9 రోజుల వ్యవధిలో ముగ్గురు అధ్యక్ష పీఠం అధిరోహించడంతో పెరూలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.

తొలి నుంచి పెరూ రాజకీయాలలో సంపన్న,వ్యాపార వర్గాలదే ఆధిపత్యం.కానీ తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల బరిలో సాధారణ రైతు కుటుంబానికి చెందిన పెడ్రో కాస్టిల్లో నిలవడం రాజకీయ వర్గాలలో సంచలనం రేపింది.కాగా తన పెరూ లిబ్రే పార్టీకి చిహ్నమైన పెన్సిల్‌ను చెరకు పరిమాణంలో ప్రయోగించిన కాస్టిల్లో "నో మోర్ పూర్ ఇన్ ఎ రిచ్ కంట్రీ (ధనిక దేశంలో పేదలు లేరు)" అనే నినాదంతో అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు.జూలై 28 న నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కాస్టిల్లో ఉత్తర ప్రాంతమైన కాజమార్కాలోని మారుమూల గ్రామమైన శాన్ లూయిస్ డి పునాలో గత 25 సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అతను రాజ్యాంగాన్ని పునర్నిర్మించడానికి మరియు మైనింగ్ సంస్థలపై పన్నులను పెంచుతామని ఎన్నికల హామీ ఇచ్చారు. మైనింగ్ రంగం నుండి వచ్చే ఆదాయాన్ని విద్య మరియు ఆరోగ్యంతో సహా ప్రజా సేవలను మెరుగుపరచడానికి ఖర్చు చేస్తానని కాస్టిల్లో వాగ్దానం చేసి ఎన్నికలలో విజయం సాధించారు.

Also Read : వైసీపీ గూటికి లాల్ జాన్ బాష సోదరుడు ,మాజీ ఎమ్మెల్యే జీయావుద్ధిన్‌

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp