రాజాంలో మురళికి "గ్రీష్మ" సెగ

By Ramana.Damara Singh Jan. 15, 2022, 01:30 pm IST
రాజాంలో మురళికి "గ్రీష్మ"  సెగ

ఆ నియోజకవర్గంలో బోణీ కొట్టడానికి టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, అభ్యర్థిని మార్చినా ఫలితం దక్కలేదు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ శ్రీకాకుళం జిల్లా రాజాంలో టీడీపీకి చేదు ఫలితాలే ఎదురయ్యాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పట్టు బిగించడానికి పార్టీ ఇంఛార్జి కోండ్రు మురళీమోహన్ చేస్తున్న ప్రయత్నాలకు నియోజకవర్గ నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ముఖ్యంగా మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తన కుమార్తె గ్రీష్మ ప్రసాద్ కు ఎలాగైనా టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఆమె వర్గం నుంచి కోండ్రుకు ప్రతిఘటన ఎదురవుతోంది. సంక్రాంతి సందర్భంగా ఇది మరోసారి బయటపడింది.

కుమార్తె కోసం ప్రతిభ తాపత్రయం

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న ప్రతిభా భారతి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 1999 వరకు వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా, తర్వాత స్పీకరుగా కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఎచ్చెర్ల జనరల్ కావడంతో కొత్తగా ఏర్పడిన రాజాం ఎస్సీ నియోజకవర్గానికి మారారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ ప్రభ మసక బారింది. 2009, 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమెకు 2019 ఎన్నికల్లో చంద్రబాబు పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కోండ్రు మురళీమోహన్ కు టికెట్ ఇచ్చారు. తాను గెలిచే అవకాశం ఉన్నా కోండ్రుకు టికెట్ ఇవ్వడం వల్లే టీడీపీ ఓటమి పాలైందని ప్రతిభ అప్పట్లో వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఇంఛార్జిగా ఉన్న కోండ్రును పట్టించుకోవడం లేదు. తన వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారసురాలిగా కుమార్తె గ్రీష్మను రంగంలోకి దించారు. తల్లి సలహాలు సూచనలతో ఆమె కోండ్రుకు పోటీగా నియోజకవర్గంలో తరచూ పర్యటనలు జరుపుతున్నారు. సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాజాం పట్టణంతోపాటు ఇతర మండలాల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతిభ, గ్రీష్మల పెద్ద ఫొటోలతో రూపొందించిన ఈ ఫ్లెక్సీల్లో నియోజకవర్గ ఇంఛార్జి కోండ్రు ఫోటో గానీ.. కనీసం పేరు గానీ లేకపోవడం గమనార్హం.

కోండ్రుకు సహాయ నిరాకరణ

తన కుమార్తెకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ప్రతిభ ఉండటంతో సహజంగానే ఆమె వర్గం నుంచి కోండ్రు కు సహాయ నిరాకరణ ఎదురవుతోంది. మరోవైపు నియోజకవర్గానికి చెందిన చాలా మంది ముఖ్యనేతలు కూడా ఆయనకు సహకరించకుండా దూరంగా ఉంటున్నారు. రాజాం పట్టణ పార్టీలో ప్రతిభ వర్గం హవా ఉండగా.. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు సొంత మండలం రేగిడిలో కీలకంగా వ్యవహరించే కళా సోదరుడు రామకృష్ణం నాయుడు, ఆయన కుమారుడు గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. సంతకవిటి మండలంలో పట్టున్న కొల్ల అప్పలనాయుడు గతంలో ఎమ్మెల్సీ పదవి రాకుండా కొందరు పెద్దలు అడ్డుకున్నారన్న అసంతృప్తి చాలా కాలం నుంచీ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఇక వంగర మండలంలో టీడీపీ నేతలు, క్యాడర్ అంత వైఎస్సార్సీపీలోకి వెళ్లిపోవడంతో స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులనే నిలబెట్టలేని దుస్థితిలో టీడీపీ పడిపోయింది. ఈ పరిస్థితుల్లో కోండ్రు కు అన్నివైపుల నుంచి ప్రతిబంధకాలు తప్పడం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp