ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం స్థిరంగా ఉంది..వదంతులు నమ్మకండి -అభిజిత్ ముఖర్జీ

By Kiran.G Aug. 13, 2020, 10:30 am IST
ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం స్థిరంగా ఉంది..వదంతులు నమ్మకండి -అభిజిత్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆర్మీకి చెందిన రీసెర్చ్‌, రెఫెరల్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకినట్లు కూడా పరీక్షల్లో తెలిసింది. వెంటిలేటర్ పై ఉంచి ప్రణబ్ ముఖర్జీకి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఇప్పటికే ప్రణబ్ ముఖర్జీ చనిపోయారంటూ సోషల్ మీడియాతో పాటు కొన్ని వెబ్ మరియు డిజిటల్ మీడియా ఛానెల్స్ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇలా అసత్య కథనాలను ప్రచురిస్తున్న వార్త ఛానెల్స్ మరియు జర్నలిస్టులపై ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ మండిపడ్డారు. తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆయన బ్రతికే ఉన్నారంటూ వెల్లడించారు.

తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న వదంతులు మరియు ఊహాగానాలపై స్పందిస్తూ భారతదేశ మీడియా నకిలీ వార్తలు తయారు చేసే కర్మాగారంగా మారిందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తన తండ్రి సజీవంగా ఉన్నారని ఆయన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఊహాగానాలు నమ్మొద్దని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే పలువురు జర్నలిస్టులతో పాటు అనేకమంది సోషల్ మీడియా వేదికగా ప్రణబ్ ముఖర్జీ మృతి చెందారంటూ అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp